ఆ మహమ్మారికి విరుగుడు.. ‘విస్కీ’ మెడిసిన్.. వైద్యుల సూచన

by Anukaran |
ఆ మహమ్మారికి విరుగుడు.. ‘విస్కీ’ మెడిసిన్.. వైద్యుల సూచన
X

దిశ, ఫీచర్స్ : ‘విస్కీ’ తాగాలా? వద్దా? ఈ ప్రశ్న ప్రస్తుతం ప్రతీ స్పిరిట్ లవర్ మదిలో మెదులుతోంది. కానీ కరోనా తీవ్రంగా వ్యాప్తి చెందుతున్న ప్రస్తుత తరుణంలో ‘ఆల్కహాల్’ తీసుకోవడం వల్ల ఇమ్యూన్ పవర్ తగ్గుతుందని చాలా మంది వైద్యులు సూచిస్తున్నారు. అయితే ప్రపంచంలోనే ప్రాణాంతక మహమ్మారిగా నిలిచిన ‘స్పానిష్ ఫ్లూ’ గురించి వినే ఉంటారు. ప్రపంచ జనాభాలో దాదాపు 3-5 శాతం(50-100 మిలియన్ల ప్రజలు) మందిని కబళించిన స్పానిష్ ఫ్లూ ప్రపంచ చరిత్రలో ఓ భయోత్పాత ఘటనలా మిగిలింది. ప్రస్తుతం ‘విస్కీ’ని దూరం పెట్టినా, స్పానిష్ ఫ్లూ‌ను ఎదుర్కొనేందుకు మాత్రం ‘విస్కీ’ తాగమని వైద్యులే సూచించారని మీకు తెలుసా? మెడిసిన్‌గా విస్కీ ఉపయోగించారని విన్నారా? ఆ విశేషాలేంటో తెలుసుకుందాం.

రోబోలే వైద్యం చేస్తున్న టెక్ ఎరాలో మనం నివసిస్తున్నాం. రెప్పపాటు వేగంతో ప్రపంచ దేశాల సమాచారాన్ని పొందే టెక్నాలజీతో దూసుకుపోతున్నాం. ఆధునాతన వైద్యాలయాలు, వైద్య పరికరాలు, ఆశ్చర్యపరిచే పరిశోధనలు, రోగాన్ని బట్టి పరీక్షలున్న ఈ సమయంలోనే ‘కరోనా’ వైరస్ వస్తేనే దాన్ని నిరోధించడానికి ఇప్పటికీ సరైన మందు కనిపెట్టలేకపోయాం. అల్లోపతి, ఆయుర్వేదం, నేచరోపతి, హోమియో, యోగా, ధ్యానం ఇలా రకరకాల పద్ధతుల్లో ‘కొవిడ్’ కణాన్ని ఎదుర్కొనేందుకు నిత్యం యుద్ధం చేస్తున్నాం. ఆఖరకు తాజాగా ‘నాటు’ వైద్యం కూడా ప్రయత్నిస్తున్నాం.

మరి ఇప్పుడే పరిస్థితి ఇలా ఉంటే 1918లో ‘స్పానిష్ ఫ్లూ’ మహమ్మారి వచ్చి ఒకేసారి వందల మందిని పొట్టనబెట్టుకుంటే వైద్యులేం చేయగలరు? అలాంటి పరిస్థితుల్లో తమ ఆలోచనల్లో ఉన్న ప్రతి వైద్యాన్ని ప్రయత్నించడం మామూలే. గాయాలను నివారించడంలో, నొప్పిని తగ్గించడంలో ‘విస్కీ’ని వాడతారనే విషయం తెలిసిందే. ఈ క్రమంలోనే ‘స్పానిష్ ఫ్లూ’ యునైటెడ్ స్టేట్స్ ఆఫ్ అమెరికాలోకి ప్రవేశించడంతో చాలామంది ప్రజలు రెమెడీగా విస్కీని ఉపయోగించడం ప్రారంభించారు. వైద్యులు కూడా ‘విస్కీ’ని తక్కువ పరిమాణంలో సిఫారసు చేయడంతో పాటు, అందులో ఔషధ ప్రయోజనాలు ఉన్నాయని చెప్పారు.

వైద్యులు, నర్సులు, ఫ్రంట్‌లైన్ కార్మికులు తమను తాము ఇన్‌ఫ్లుయెంజా నుంచి కాపాడుకోవడానికి క్రమం తప్పకుండా విస్కీని ఉపయోగించారు. కొంతమంది వైద్యులు అనారోగ్యంతో బలహీనపడిన గుండెతో పాటు, శ్వాసకోశ వ్యవస్థను ఉత్తేజపరిచేందుకు విస్కీ సహాయపడిందని నమ్మారు. మరికొందరు దాని మత్తుమందు ప్రభావం రోగులకు కొంత ఓదార్పునిస్తుందని భావించారు.

ఉపశమనకారీ :

1918లో యాంటీబయాటిక్స్ అందుబాటులో లేనందున, రోగులకు చికిత్స చేయడానికి ఆస్పిరిన్, స్ట్రైక్‌నైన్(strychnine) నుంచి హార్లిక్స్, విక్స్ వేపోరబ్, విస్కీ వరకు అనేక రకాల చికిత్సలు ఉపయోగించారు. ఏప్రిల్ 4, 1919న టైమ్స్ ఆఫ్ ఇండియా వార్తాపత్రికలో ప్రచురించిన ఒక కథనం ప్రకారం, విస్కీ ఉద్దీపనగా మాత్రమే కాకుండా ఉపశమనకారిగా కూడా పనిచేసింది. “ఫ్లూ వల్ల అనారోగ్యంతో పాటు, మరణ రేటు పెరిగింది. దీన్నుంచి బయటపడేందుకు, ఈ సమస్యకు పరిష్కారంగా విస్కీని ఉపయోగించారు. విస్కీ అమ్మకం అనుమతించితే, దానిలో ఎక్కువ భాగం పూర్తిగా చికిత్సా ప్రయోజనాల కోసం కాకుండా వినియోగించబడుతుందని కచ్చితంగా చెప్పవచ్చు. ఇది ఆరోగ్య భావాన్ని కలిగించడంతో పాటు ఆందోళన నుండి బయటపడేస్తుంది. ఇది ఖచ్చితంగా సంక్రమణను నిరోధించడంలో సహాయపడుతుంది” అంటూ టైమ్స్ ఆఫ్ ఇండియా కథనంలో పేర్కొన్నారు.

విస్కీ మెడిసినా?

స్పానిష్ ఫ్లూ సమయంలో విస్కీకి ఔషధంగా శాస్త్రీయ మద్దతు లేదు. ఇది మత్తుమందుగా పనిచేయడం, మత్తు ప్రభావాన్ని ప్రేరేపించడం ద్వారా అనారోగ్యం నుంచి కొంత ఉపశమనం మాత్రమే కలిగించిందని వైద్యులు సూచించారు. విస్కీకి.. అది రోగికి అందించే ఔషధ ప్రయోజనాల మధ్య ఎటువంటి సంబంధం లేదు. 1917లో, అమెరికన్ మెడికల్ అసోసియేషన్ కూడా మద్యానికి ఔషధ విలువ లేదని చెప్పింది. ప్రస్తుత కొవిడ్ కాలంలో.. మహమ్మారి సంబంధిత లక్షణాలను గమనించినట్లయితే, ఇలాంటి పరిస్థితుల్లో విస్కీ తీసుకుంటే ఆరోగ్యం మరింత దిగజారిపోతోందని వైద్యులు చెప్పడం నూటిని నూరు శాతం కరెక్ట్ అని పరిశోధకులు చెబుతున్నారు. విస్కీ తీసుకోవడం వల్ల ఎక్కువ ఇబ్బందులను ఆహ్వానించడమే అవుతుందని, తాగకపోవడమే ఉత్తమమని వాళ్లంటున్నారు.

కాలం మారిపోయింది. మనకు ఇప్పుడు ఎక్కువ మందులు ఉన్నాయి. అత్యాధునిక మెడికల్ ఎక్విప్‌మెంట్స్ ఉన్నాయి. స్పానిష్ ఫ్లూ సమయంలో పెయిన్ కిల్లర్‌గా, ఫ్లూ నివారణగా సూచించిన ఆల్కహాల్ సమర్థత గురించి ఇప్పటికే చాలా పరిశోధనలు జరిగినా అందులో నిరూపితం కాలేదు. అతిగా ఆల్కహాలు తాగడం, విస్కీ అధికంగా తీసుకోవడం వల్ల రోగనిరోధక శక్తి బలహీనపరుస్తుందనేది అందరికీ తెలిసిన విషయమే. మరోవైపు, ఆల్కహాల్, పెయిన్ కిల్లర్లను కలిపి తీసుకోవడం వల్ల స్టమక్ అల్సర్స్, రక్తస్రావం కావచ్చు. ఇది మీ అనారోగ్యాన్ని మరింత తీవ్రతరం చేయడంతోపాటు, కోలుకోకుండా చేసే అవకాశముంది. ఇటీవలే టీకాలు వేసుకున్న లేదా త్వరలో టీకాలు వేసుకోవాలని యోచిస్తున్న, మద్యపానం తీసుకోవడం గురించి వైద్యుడితో మాట్లాడటం మంచిది. వ్యాక్సిన్ ఉత్తమంగా పనిచేయాలంటే ఆల్కహాలుకు దూరంగా ఉండాల్సిందే.

“1918లో ఫ్లూ వ్యాపిస్తున్న సమయంలో నేను చికాగో సమీపంలోని నావల్ స్టేషన్ గ్రేట్ లేక్స్‌లో పనిచేశాను. అక్కడ చాలా మంది రోగులు నిల్చుని ఉన్నారు. వారికి చికిత్స చేయడానికి మాకు సమయం లేదు. మేము టెంపరేచర్ కూడా చూడలేదు. బీపీ(రక్తపోటు) చూడ్డానికి కూడా మా దగ్గర సమయం లేదు. మేము వారికి కొద్దిగా వేడి విస్కీ ఇచ్చేవాళ్లం. అయితే కొంతమంది ఊపిరితిత్తులు పాడైపోయి, పడిపోయేవాళ్లు. ఓహ్.. ఇది భయంకరమైన విషయం. మేము అన్నివేళలా ఆపరేటింగ్ మాస్క్‌లు, గౌన్లు ధరించాల్సి వచ్చింది. అంటువ్యాధి ముగిసే వరకు రోజుకు 16 గంటలు అవి వేసుకుని ఉండేవాళ్లం. ఎంతమంది చనిపోయారో ఎవరికీ తెలియదని అనుకుంటాను. లెక్కలేనంతమంది చనిపోయేవాళ్లు’
– జోసీ మాబెల్ బ్రౌన్, యుఎస్ నేవీ నర్సు

“అంటువ్యాధి ప్రారంభమైనప్పటి నుంచి మేము విస్కీని మూడు రెట్లు ఎక్కువకు అమ్ముకున్నాము. కొందరు విస్కీని నేరుగా సేవిస్తే, కొంతమంది మాత్రం దీన్ని ఈస్ట్ కేకులతో, సోడాతో, క్వినైన్‌తో, ఇతర వస్తువులతో కలిపి తీసుకున్నారు. మా కస్టమర్లలో కొందరు వైద్యులు విస్కీ వాడాలని సలహా ఇచ్చారు. మరికొందరు తమ స్నేహితులు ఫ్లూ నుంచి మంచి ఫలితాలతో బయటపడ్డారని తెలిపారు. జీవితంలో ఎప్పుడూ విస్కీ తాగని వ్యక్తులు కూడా ఈ సమయంలో తీసుకున్నారు’
– సిరాక్యూస్‌లోని ఒక మద్యం వ్యాపారి 1918 వార్తాపత్రిక నివేదిక ఆధారంగా

Advertisement

Next Story