హోం మంత్రి ఫైర్.. లక్షణాలున్న వారిని వెనక్కి పంపితే

by srinivas |
హోం మంత్రి ఫైర్.. లక్షణాలున్న వారిని వెనక్కి పంపితే
X

దిశ, వెబ్ డెస్క్: రాష్ట్రంలో కరోనా విజృంభణ కొనసాగుతోందని, రోజురోజుకూ పాజిటివ్ కేసుల సంఖ్య వేగంగా పెరుగుతోందని, అంతేగాకుండా జిల్లాలోనూ కేసులు విస్తృతంగా వ్యాప్తిచెందుతున్నాయని హోం మంత్రి సుచరిత అన్నారు. రోజూ ఇంత విపరీతంగా కేసులు పెరుగుతున్నా.. జనాల్లో అస్సలు భయం కనిపించడం లేదని, కోవిడ్ నిబంధనలు పాటించడంలో చాలా మంది నిర్లక్ష్యం వహిస్తున్నారని అసంతృప్తి వ్యక్తం చేశారు. శుక్రవారం కరోనా నియంత్రణపై గుంటూరు జిల్లా అధికారులతో హోం మంత్రి సుచరిత సమీక్షా సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ఆమె మాట్లాడుతూ.. జిల్లాలో ఇప్పటివరకూ లక్షా యాభై వేల పరీక్షలు చేస్తే పది వేలకు పైగా పాజిటివ్ కేసులు నమోదయ్యాయన్నారు. జిల్లాలో రెండు వేల బెడ్స్‌తో ఇప్పటికే పదకొండు హాస్పిటల్స్‌లో కరోనా పాజిటివ్ కేసులకు చికిత్స అందిస్తున్నామని చెప్పారు. మూడు వేల బెడ్స్‌తో మరో పన్నెండు ప్రైవేటు హాస్పిటల్స్‌ను సిద్ధం చేశామని తెలిపారు. కరోనా లక్షణాలు ఉన్న పేషెంట్‌ను ప్రైవేటు ఆసుపత్రులకు తీసుకెళ్ళిన సమయంలో వారిని తిరిగి వెనక్కి పంపితే కఠిన చర్యలు తీసుకుంటామని సుచరిత హెచ్చరించారు. సంబంధిత ఆస్పత్రుల గుర్తింపును కూడా రద్దు చేస్తామన్నారు. ఆస్పత్రులలో సిబ్బంది భయపడకుండా సేవలందించాలని సుచరిత కోరారు. కోవిడ్ బాధితులకు అసౌకర్యం కలిగిన సమయంలో కాల్ సెంటర్ 08632271492 నంబర్ కు ఫోన్ చేస్తే సమస్యను అధికారులు పరిష్కరిస్తారని హోం మంత్రి చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed