అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ కన్ఫామ్

by Shamantha N |
అసోం సీఎంగా హిమంత బిశ్వ శర్మ కన్ఫామ్
X

గువహతి: అసోం సీఎం ఎవరనే సస్పెన్స్‌కు తెరపడింది. ఎట్టకేలకు అమిత్ షాకు విశ్వాసపాత్రుడు, ఈశాన్యంలో బీజేపీ కీలక నేత హిమంత బిశ్వ శర్మనే సీఎంగా కన్ఫామ్ అయ్యారు. రెండోసారి వరుసగా అసోంలో అధికారాన్ని చేజిక్కించుకున్న బీజేపీ, శర్బానందా సోనోవాల్ తర్వాత సీఎం స్థానాన్ని హిమంత బిశ్వ శర్మకు ఇవ్వాలని పార్టీ అధిష్టానం నిర్ణయించింది. అనంతరం ఆదివారం హిమంతను శాసనసభాపక్ష నేతగా తాజా మాజీ సీఎం శర్బానందా సోనోవాల్ ప్రతిపాదించగా ఎమ్మెల్యేలు ఏకగ్రీవంగా ఎన్నుకున్నారు. సోమవారం గువహతిలోని శ్రీమంత శంకర్‌దేవ్ కళాక్షేత్రలో ఆయన ముఖ్యమంత్రిగా ప్రమాణ స్వీకారం చేయనున్నారు.

ఆయనతోపాటు క్యాబినెట్ మంత్రులుగా పలువురు ఎమ్మెల్యేలూ ప్రమాణం తీసుకోనున్నారు. హోం, ఫైనాన్స్, హెల్త్ శాఖలను హిమంత బిశ్వ శర్మ తన దగ్గరే ఉంచుకోనున్నట్టు కొన్నివర్గాలు తెలిపాయి. 2016లో అప్పటి కేంద్ర క్రీడా శాఖ మంత్రి శర్బానంద సోనోవాల్‌ను సీఎం క్యాండిడేట్‌గా ప్రకటించి, ఎన్నికల బరిలో గెలిచి ప్రభుత్వాన్ని ఏర్పాటు చేసిన బీజేపీ తాజాగా ముందుగానే ముఖ్యమంత్రి అభ్యర్థిని ప్రకటించలేదు. బీజేపీ, దాని మిత్రపక్షాలు, ఏజీపీ, యూపీపీఎల్‌లు మెజార్టీ స్థానాలను గెలుచుకున్నాయి. 2015లో కాంగ్రెస్ నుంచి బీజేపీలోకి చేరి ఈశాన్యంలో పార్టీని పటిష్టపరిచిన హిమంత బిశ్వ శర్మనే సీఎంగా అధిష్టానం ఎంచుకున్నది. శర్బానందా ప్రభుత్వంలో శర్మ ఆరోగ్య శాఖ మంత్రిగా సేవలందించిన సంగతి తెలిసిందే.

Advertisement

Next Story