తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు అక్షింతలు..

by vinod kumar |
తెలంగాణ ప్రభుత్వానికి మరోసారి హైకోర్టు అక్షింతలు..
X

దిశ, వెబ్‌డెస్క్ : తెలంగాణలో పెరుగుతున్న కొవిడ్ కేసుల నియంత్రణకు రాష్ట్ర ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలపై హైకోర్టు మరోసారి అసహనం వ్యక్తం చేసింది. కేసుల నివారణకు తీసుకున్న చర్యలపై ప్రభుత్వం అందజేసిన నివేదికను పరిశీలించిన అత్యున్నత న్యాయస్థానం ప్రశ్నల వర్షం కురిపించింది. రోజుకు 30 నుంచి 40వేల టెస్టులు చేస్తున్నామని ప్రభుత్వం ఇచ్చిన నివేదికలో పేర్కొనగా.. ఈనెల 1 నుంచి ఇప్పటివరకు 3.47లక్షలు మాత్రమే టెస్టులు చేశారు. 8.40లక్షల టెస్టులు ఎందుకు చేయలేదని న్యాయమూర్తి ప్రభుత్వాన్ని ప్రశ్నించారు.

నైట్ కర్ఫ్యూ విధించడం వలన కేసులు కొద్దిమేర తగ్గాయని ప్రభుత్వం తరఫు న్యాయవాది వివరించగా.. రాత్రి కర్ఫ్యూ పెట్టడంతో సరిపోదని, జనాలు బయట తిరగకుండా చర్యలు తీసుకోవాలని కోర్టు ఆదేశించింది. ఎన్నికల సభలు, సమావేశాలు, ర్యాలీలపై ఆంక్షలు విధించాలని చెప్పింది. ఆర్టీపీసీఆర్ టెస్టు చేసిన 24గంటల్లోగా రిపోర్టు ఇవ్వాలని, ప్రతిరోజూ మీడియా బులెటిన్ ప్రకటించాలని న్యాయమూర్తి తెలంగాణ ప్రభుత్వాన్ని ఆదేశించారు. యాదాద్రి, భువనగిరి, నిర్మల్, జగిత్యాల, కామారెడ్డి, మేడ్చల్-మల్కాజిగిరి జిల్లాలో చాలా కేసులు నమోదవుతున్నాయని.. ఆయా జిల్లాల్లో టెస్టుల సంఖ్యను పెంచాలని స్పష్టంచేసింది.

రిపోర్టులు లేకున్నా కరోనా లక్షణాల ఆధారంగా ఆస్పత్రుల్లో రోగులను అడ్మిట్ చేసుకోవాలన్న హైకోర్టు, ఆక్సిజన్ కొరత లేకుండా చూడాలని కోరింది. రాష్ట్రంలో కరోనా నియంత్రణకు ప్రత్యేక కమిటీ వేయాలని, వలస కార్మికుల కోసం పునరావాస కేంద్రాలను ఏర్పాటు చేయాలని తెలిపింది. వైన్సులు, బార్లు, సినిమా థియేటర్లపై పటిష్ట చర్యలు తీసుకోవాలని చెబుతూనే తదుపరి విచారణను ఈనెల 27కు వాయిదా వేస్తూ హైకోర్టు తీర్పు వెలువరించింది.

Advertisement

Next Story