దంచి కొట్టిన వాన

by Shyam |
దంచి కొట్టిన వాన
X

దిశ, న్యూస్‌బ్యూరో: రాష్ట్రవ్యాప్తంగా భారీగా వర్షం కురిసింది. బుధవారం రాత్రి నుంచే జిల్లాల్లో ఎడతెరపి లేకుండా వాన పడింది. వాగులు, వంకలు పొంగిపొర్లాయి. చెరువులు, కుంటలు నిండాయి. ఆయా ప్రాంతాల్లో చెర్వులు నిండుకుండలా మారాయి. గురువారం వరకు సగటు వర్షపాతం 11 సెం.మీ గా నమోదైంది. అత్యధికంగా మెదక్ కుల్చారంలో 10.8 సెంమీ. వర్షం కురిసింది. వికారాబాద్ జిల్లా పెద్దేముల్ మండలం గాజీపూర్ వాగు పొంగి పొర్లింది. తాండూరు సదాశివపేట్ రోడ్డులో రవాణా వ్యవస్థ నిలిచిపోయింది. ఐనెల్లి సమీపంలో బండలవాగు పొంగి పొర్లడంతో తాండూర్, చించోళి రోడ్డు మార్గంలో వాహనాలు నిలిచిపోయాయి. మోమిన్‌పేటలో 9.5 సెంటీమీటర్ల వర్షం కురిసింది. చిలుకవాగు, కానల వాగు పొంగి ప్రవహిస్తున్నాయి. పెద్దేముల్‌ మండలం ఇందూరు గ్రామంలో భారీ వర్షానికి ఇండ్లలోకి నీరు చేరింది. ప్రధాన రోడ్లన్నీ వాగులు, కాలువల మాదిరి కనిపిస్తున్నాయి. ఇంట్లో ఉన్న బియ్యం, ధాన్యంతో పాటు ఇతర వస్తువులు పూర్తిగా తడిసిపోయాయి. విద్యుత్‌ సరఫరాకు అంతరాయం కలిగింది.

అదే విధంగా మంచిర్యాల జనగాం, ఆదిలాబాద్, వికారాబాద్, ఖమ్మం, జగిత్యాల జిల్లాలో 8 నుంచి 9 సెంటీమీటర్లు, నల్గొండ, కుమ్రం భీం ఆసిఫాబాద్, సిద్దిపేట, రాజన్న సిరిసిల్ల, వరంగల్ రూరల్, నల్గొండ జిల్లాలో 6 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. అత్యల్పంగా నిజామాబాద్ జిల్లా సిరికొండలో 3.8 సెంటీమీటర్ల వర్షపాతం నమోదు అయ్యింది. భారీ వర్షాలతో ఆదిలాబాద్, ములుగు, ఖమ్మం జిల్లాల్లో రవాణా వ్యవస్థ దెబ్బతింది. ఏటూరునాగారం దగ్గర వాగులు పొంగడంతో గిరిజన గ్రామాలకు రాకపోకలు నిలిచాయి.

హైదరాబాద్‌తో పాటు నగర శివారు ప్రాంతాల్లోనూ ఎడతెరపి లేకుండా వర్షం కురిసింది. బంజారాహిల్స్, జూబ్లీహిల్స్, అసిఫ్‌నగర్, నాంపల్లి, మెహదీపట్నం, గోషామహల్, మాసబ్‌ట్యాంక్, లక్డీకపూల్, బేగంపేట, సికింద్రాబాద్, పంజాగుట్ట, ఖైరతాబాద్ బాలానగర్, కూకట్‌పల్లి, జీడిమెట్ల, గాజులరామరం, చందానగర్‌, ఎల్బీనగర్, దిల్‌సుఖ్‌నగర్, కోఠి, మల్కాజిగిరిలో భారీ వర్షపాతం నమోదైంది. గ్రేటర్ పరిధిలో 44.4 మి.మీ. సగటు వర్షపాతం నమోదైంది. ఇక ఛత్తీస్‌గఢ్ నుంచి దక్షిణ తమిళనాడు వరకు తెలంగాణ, కోస్తాంధ్ర మీదుగా ఏర్పడిన అల్పపీడన ద్రోణి ప్రభావంతో వర్షాలు కురుస్తున్నట్లు వాతావరణ శాఖ తెలిపింది. శుక్రవారం కూడా రాష్ట్రంలోని పలు జిల్లాల్లో మోస్తరు నుంచి భారీ వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ అధికారులు ప్రకటించారు.

Advertisement

Next Story