ఉచిత వైద్యానికి స్వస్తి.. నిమ్స్​లో పనిచేయని‘ హెల్త్​ కార్డులు’

by Shyam |   ( Updated:2021-11-01 21:46:39.0  )
ఉచిత వైద్యానికి స్వస్తి.. నిమ్స్​లో పనిచేయని‘ హెల్త్​ కార్డులు’
X

దిశ, తెలంగాణ బ్యూరో: ఉద్యోగస్తులు, జర్నలిస్టుల చికిత్స కొరకు సర్కార్ ​ఇచ్చిన హెల్త్​ కార్డులు నిమ్స్​ హాస్పిటల్​ లో పనిచేయడం లేదు. కార్డు అని చెబితే అత్యవసరం ఉన్నా చేర్చుకోవడం లేదు. మరి కొందరికి అడ్మిట్​ అయిన తర్వాత కార్డులు వర్తించవని సిబ్బంది తేల్చి చెబుతున్నారు. దీంతో చేసేదేమీ లేక చాలామంది ఉద్యోగులు, జర్నలిస్టులు డబ్బులు చెల్లించాల్సిన పరిస్థితి తలెత్తింది. ఓపీ దగ్గర నుంచి టెస్టుల వరకు బిల్లులు వేస్తూ అందినకాడికి దండుకుంటున్నారు సిబ్బంది. కొందరి కార్డులకు అనుమతి ఇచ్చినా, ఈ రోగానికి లేదు, ఆ టెస్టులకు వర్తించదంటూ బిల్లులు వేస్తున్నారు. కొందరు డాక్టర్లయితే ఏకంగా ప్రైవేట్ ల్యాబ్​ లకు వెళ్లి టెస్టులు తీసుకురావాలని సూచిస్తున్నారని పలువురు రోగులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. దీంతో ప్రతీరోజూ ఎంతోమంది ఉద్యోగులకు తిప్పలు పడుతున్నారు. అత్యవసర సమయంలో వచ్చిన రోగుల బాధ వర్ణణాతీతం.

సర్కార్​ కార్డు ఉన్నదనే భరోసాతో వస్తే జేబులు గుల్ల జేసుకోవాల్సిన పరిస్థితులు వస్తున్నాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఉచిత వైద్యానికి స్వస్తి చెబుతూ నిమ్స్​ ను ప్రైవేట్​ ఆసుపత్రి తరహా మార్చేశారని ఆ హాస్పిటల్​ లో పనిచేసే ఓ కీలక వైద్యుడు వ్యాఖ్యానించడం గమనార్హం.

ప్రజాప్రతినిధులదీ అదే పరిస్థితి..!

సాధారణ ఉద్యోగులతో పాటు ఎమ్మెల్యేలు, ఎంపీలు, మంత్రుల సిఫార్సులను పట్టించుకోవడం లేదు. కేవలం సీఎం కేసీఆర్​, మంత్రి కేటీఆర్​, ఎంపీ సంతోష్​, ఎమ్మెల్సీ కవితతో పాటు మరికొద్ది మంది కీలక నేతల రిఫరెన్స్​లను మాత్రమే పరిగణలోకి తీసుకుంటున్నారు. మిగతావారి పరిస్థితి అగమ్యగోచరంగా తయారైంది. ఎమ్మెల్యేలుగా ఉండి తన వ్యక్తులకు నిమ్స్​ లో మెరుగైన వైద్యం అందించలేని దయనీయ స్థితిలో ఉన్నట్లు హైదరాబాద్​ కు చెందిన ఓ అధికారి పార్టీ ఎమ్మెల్యే చెప్పడం గమనార్హం. కొన్ని సార్లు అడ్మిట్​ చేసుకున్నా.. రోగుల పర్యవేక్షణ కరువైనట్లు స్వయంగా ప్రజాప్రతినిధులే చెబుతున్నారు. అత్యవసర పరిస్థితులున్నా ,డాక్టర్లతో పాటు క్షేత్రస్థాయి సిబ్బంది కూడా పట్టించుకోవడం లేదని ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. అయితే ప్రభుత్వం నుంచి బిల్లులు రీయింబర్స్​ మెంట్​ కాకపోవడంతోనే ఈ పరిస్థితి వచ్చినట్లు నిమ్స్​ ఉన్నతాధికారులు పేర్కొంటున్నారు. రాష్ట్ర వ్యాప్తంగా ఈహెచ్​ఎస్​, జేహెచ్ఎస్​ స్కీంలకు సర్కార్​ సుమారు రూ.200 కోట్ల బకాయిలు ఉంటుందని ఓ అధికారి దిశకు తెలిపారు. దీనిలో నిమ్స్​ కే ఎక్కువ బిల్లులు రావాల్సి ఉన్నదని అక్కడి ఆఫీసర్లు స్పష్టం చేస్తున్నారు. అయితే కేవలం అత్యవసర పేషెంట్లకు కార్డులు చెల్లవని నిమ్స్​ అధికారులు చెబుతున్నా, ఆ తర్వాత కూడా స్కీంలలోకి కన్వర్ట్​ చేయడం లేదని సమాచారం.

వరంగల్​ ఎమ్మెల్యే బిల్లు ఇవ్వలేదు…నా జీతం నుంచి పది వేలు కడుతున్నా: నిమ్స్​ డైరెక్టర్​ డా. మనోహర్​

‘‘నిమ్స్ హాస్పిటల్‌కు రావాల్సిన ఈహెచ్‌ఎస్‌, జేహెచ్‌ఎస్ డబ్బులను సర్కార్​ సకాలంలో అందించడం లేదు. హెల్త్​ కార్డులతో చికిత్సను అందించాలని ఉద్యోగులు, జర్నలిస్టులు , ప్రజాప్రతినిధులు ఒత్తిడి చేస్తున్నారు. ప్రభుత్వం నుంచి డబ్బులు రానిది వైద్యం ఎలా అందించాలి. ఇటీవల వరంగల్ తూర్పు ఎమ్మెల్యే ధాస్యం వినయ్ భాస్కర్ ఓ పేషెంట్‌ను అడ్మిట్ చేశారు. చికిత్స తర్వాత బిల్లు కట్టకుండానే తీసుకువెళ్లారు. ఆ పేషెంట్‌కు సుమారు రూ.5 లక్షల బిల్లు అయింది. కానీ ప్రభుత్వం నుంచి కేవలం లక్ష రూపాయల ఎల్‌వోసీ ఇచ్చి చేతులు దులుపుకున్నారు. దీంతో చేసేదేమీ లేక మిగతా నాలుగు లక్షలు స్వయంగా నేనే ఆసుపత్రికి చెల్లిస్తున్నాను. ప్రతీ నెల నా జీతం నుంచి పది వేలు కడుతున్నాను. అయితే కేవలం అత్యవసర నిమిత్తం వచ్చిన పేషెంట్లకే కార్డులు వర్తించవు. మిగతా వారివి తీసుకుంటున్నాము.’’

Advertisement

Next Story