హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,233 కోట్లు!

by Harish |
హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,233 కోట్లు!
X

దిశ, సెంట్రల్ డెస్క్: హౌసింగ్ డెవలప్‌మెంట్ ఫైనాన్స్ కార్పొరేషన్ లిమిటెడ్(హెచ్‌డీఎఫ్‌సీ) సోమవారం 2019-20 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి నాలుగో త్రైమాసిక ఫలితాలను వెల్లడించింది. మార్చితో ముగిసిన త్రైమాసికంలో హెచ్‌డీఎఫ్‌సీ నికర లాభం రూ. 2,233 కోట్లతో 22 శాతం క్షీణించినట్టు ప్రకటించింది. అంతకుముందు ఆర్థిక సంవత్సరంలో రూ. 2,862 కోట్ల నికర లాభాన్ని నమోదు చేసింది. అలాగే, ఈ త్రైమాసికంలో డివిడెండ్ ఆదాయం రూ. 2 కోట్లని తెలిపింది. గతేడాది ఇదే త్రైమాసికంలో డివిడెండ్ ఆదాయం రూ. 537 కోట్లుగా ఉంది. అందుకే నికర లాభం తగ్గిందని సంస్థ పేర్కొంది. ఈ త్రైమాసికంలో పెట్టుబడుల అమ్మకంపై లాభం రూ .2 కోట్లు కాగా, అంతకుముందు త్రైమాసికంలో ఇది రూ. 321 కోట్లని వెల్లడించింది. ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి కంపెనీ బోర్డు ఒక్కో షేర్‌కు రూ. 21 డివిడెండ్ ప్రకటించింది. ఇక, వార్షిక నికర వడ్డీ ఆదాయం రూ. 3,780 కోట్లతో 17 శాతం పెరిగింది. ఇదే త్రైమాసికంలో నికర వడ్డీ ఆదాయం రూ. 3,238 కోట్లు ఉండగా, నికర వడ్డీ మార్జిన్ 3.3 శాతానికి తగ్గింది. రికవరీలు మార్చి చివరి భాగంలో దెబ్బ తిన్నాయని, దీనివల్ల వ్యక్తిగత నిరర్ధక ఆస్తులు పెరిగినట్టు కంపెనీ వివరించింది. మార్చితో ముగిసిన నాలుగో త్రైమాసికంలో కార్యకలాపాల ద్వారా వచ్చే ఆదాయం గత ఆర్థిక సంవత్సరంలో ఇదే త్రైమాసికానికి రూ. 11,580 కోట్లతో పోలిస్తే 3.4 శాతం పెరిగి రూ. 11,976 కోట్లకు చేరుకుందని కంపెనీ తెలిపింది. అలాగే త్రైమాసికంలో మొత్తం లోన్‌ల వృద్ధిని 12 శాతంగా నమోదు చేసింది.

Advertisement

Next Story

Most Viewed