‘ముందు మీ రాష్ట్రం గురించి చూసుకోండి’

by Shamantha N |
‘ముందు మీ రాష్ట్రం గురించి చూసుకోండి’
X

లక్నో: అటు శివసేన పాలిత మహారాష్ట్ర, ఇటు బీజేపీ పాలిత ఉత్తరప్రదేశ్ రాష్ట్రాల్లో రోజుల వ్యవధిలో చోటుచేసుకున్న సాధువుల హత్యలు రాజకీయంగా దుమారం రేపుతున్నాయి. యూపీలో జరిగిన సాధువుల హత్య గురించి శివసేన నాయకుడు సంజయ్ రౌత్ ట్వీట్టర్‌లో స్పందిస్తూ.. ఈ భయంకరమైన హత్యలను పాల్ఘర్ ఘటన మాదిరిగా మతంరంగు పులిమేందుకు యత్నించొద్దంటూ యూపీ ప్రభుత్వానికి హితవు పలికారు.

సంజయ్ రౌత్ ట్వీట్‌పై యోగి ఆదిత్యనాథ్ ఘాటుగా స్పందించారు. యూపీ గురించి ఆందోళన చెందాల్సిన అవసరం లేదనీ, ముందు తమ మహారాష్ట్రను పట్టించుకోవాలంటూ ఎద్దేవా చేశారు. ఈ మేరకు యోగి ట్విట్టర్‌లో స్పందిస్తూ.. ‘సంజయ్ రౌత్.. నీ వ్యాఖ్యలు, రక్తంతో తడిసిన అనైతిక విలువలే మీరు మారిన రాజకీయ రంగులకు ప్రతిబింబం. నిస్సందేహంగా ఇవన్నీ బుజ్జగింపు రాజకీయాలే’ అని పేర్కొన్నారు. అలాగే, పాల్ఘర్‌లో మృతి చెందిన సాధువులు నిర్మోహి అఖాడాకు చెందిన వారు కావడంతోనే తాను ఉద్ధవ్‌కు ఫోన్ చేసినట్టు చెప్పారు. యూపీలో కఠిన నిబంధనలుంటాయనీ, ఎవరు ఉల్లంఘించినా ఉపేక్షించమని తెలిపారు. బులంద్షహర్ ఘటనలో నిందితుడిని గంటల వ్యవధిలోనే పట్టుకున్నామని తెలిపారు. యూపీపై ఆందోళన చెందకుండా, ముందు మహారాష్ట గురించి ఆలోచించాలని వ్యాఖ్యానించారు. కాగా, సాధువుల హత్యలు జరిగిన సమయంలో ఇరు రాష్ట్రాల సీఎంలు ఒకరికొకరు ఫోన్‌లు చేసుకుని, నిందితులపై కఠిన చర్యలు తీసుకోవాలని సూచించుకున్న విషయం తెలిసిందే.

Tags: yogi adityanath, shivsena, up, sanjay rauth, handle maharashtra, dont worry about up, sadhus killed, palghar incident, bulandhushahar incident

Advertisement

Next Story