- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
షట్‌డౌన్ : ‘చదువులు’ భారం.. ‘జీవితాలు’ ఆగం..!
దిశప్రతినిధి, రంగారెడ్డి : విద్యావ్యవస్థలో జరిగే లోపాలు సరిచేయడంలో ఇప్పటివరకు అన్ని ప్రభుత్వాలు విఫలమయ్యాయి. ఇదే సమయంలో కరోనా వైరస్ వ్యాప్తితో రాష్ట్రంలోని విద్యావ్యవస్థ మరింత చిన్నాభిన్నమైంది. ఉద్యోగాలు లేకపోవడంతో యువకులు ప్రైవేట్ ఉద్యోగాల్లో నిమగ్నమవుతున్నారు. గత ఐదేండ్లుగా ప్రభుత్వం ఉద్యోగాలకు సంబంధించి నోటిఫికేషన్లు లేకపోవడంతో నిరుద్యోగులు రోడ్డున పడ్డారు. ప్రస్తుతం కరోనా ప్రభావం విద్యావ్యవస్థ పై పడటంతో ప్రైవేట్ పాఠశాలలు మూతపడుతున్నాయి. కరోనా వైరస్ విజృంభణతో రాష్ట్రంలోని ప్రతీరంగంపై ప్రభావం చూపడంతో చిరు వ్యాపారాలు కనుమరుగవుతున్నాయి. పెద్ద పెద్ద పరిశ్రమలు ఆర్థిక ఇబ్బందులతో కొట్టుమిట్టాడుతున్నాయి. దీంతో 50 మంది పనిచేసే రంగంలో 25 మందికి పరిమితం చేసి, వేతనాలు తగ్గించి పరిశ్రమలు నడిపిస్తున్నారు. ఈవిధంగా ప్రతి వ్యక్తిపై కరోనా వైరస్ ప్రభావం తీవ్రమైయింది. గతంలో ఆటో నడిపే, కూలీ పనిచేసే ప్రతిఒక్కరూ తమ పిల్లల భవిష్యత్తు బాగా ఉండాలని అప్పులు చేసి ప్రైవేట్ స్కూల్లో చదివించే వారు. అలాంటి పరిస్థితి నుంచి ఇక ప్రభుత్వ స్కూల్లోనే చదివించాలనే నిర్ణయానికి ప్రజలు వచ్చారు.
ఎందుకంటే కరోనా సమయంలో ఆన్లైన్ క్లాసులతో, అర్ధంకానీ చదువులతో ఫీజులను వసూలు చేస్తున్నారని తల్లిదండ్రులు తమ నిర్ణయాలను మార్చుకుంటున్నారు. దీంతో ప్రైవేట్ స్కూల్స్ మూతపడుతున్నాయి. ఇదిలాఉంటే, ప్రైవేట్ స్కూళ్లలో హైఫై కానీ స్కూళ్ల మనుగడ కష్టసాధ్యంగా మారింది. సాధారణ ప్రైవేటు స్కూళ్లు కొనసాగుతున్న భవనాలకు అద్దె, ఉపాధ్యాయులకు వేతనాలు చెల్లించలేక నిర్వాహకులు తీవ్ర ఇబ్బందులు పడుతున్నారు. తాండూరులో 30 ఏళ్లపాటు సుధీర్ఘంగా నడిచిన అంబేద్కర్ జూనియర్ కాలేజీలో అడ్మిషన్లు లేక ఎత్తివేశారు. మరికొన్ని కాలేజీలు ఇతరులకు విక్రయిస్తున్నారు. ఇదే పరిస్థితి కొనసాగితే వచ్చే ఏడాది ఉమ్మడి జిల్లాలో 200లకు పైగా ప్రైవేట్ స్కూళ్లు మూతపడే అవకాశం ఉంది. గతంలో మాదిరిగా ప్రైవేట్ స్కూళ్లలో అడ్మిషన్లు జరగడం లేదు. సగానికి పైగా విద్యార్థుల సంఖ్య తగ్గిపోయింది. దీంతో ప్రైవేటు స్కూళ్ల యాజమాన్యాలు వీటిని నిర్వహించలేక సతమతమవుతున్నారు.
మూతపడుతున్న స్కూల్స్..
పెద్దపెద్ద భవనాల్లో వందల మంది విద్యార్థులతో, ఉద్యోగులతో కళకళలాడే ప్రైవేట్ పాఠశాలల పరిస్థితి దయనీయంగా మారింది. గత రెండేండ్ల నుంచి విద్యాసంస్థలు ఆర్థిక ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు. స్కూల్స్ విద్యార్థులతో ఎప్పుడు కళకళలాడుతాయో తెలియక యాజమాన్యాలు ఆందోళనకు గురవుతున్నాయి. స్కూల్ బిల్డింగ్ అద్దె, కరెంట్, వాటర్ బిల్లులు, ఆస్తిపన్నులు చెల్లించలేక తిప్పలు పడుతున్నారు. కార్పొరేట్ స్ధాయిలో నడిచే భాష్యం, రవీంద్రభారతి, కృష్ణవేణి, నారాయణ, శ్రీచైతన్య స్కూల్స్ పదుల సంఖ్యలో బ్రాంచీలను పెట్టి నడిపించే యాజమాన్యం… నేడు వాటిని తగ్గించి ఆదరణ ఉండే బ్రాంచీలకే పరిమితమవుతున్నారు. దీంతో ఉద్యోగులను, బిల్డింగ్, ఆస్తి పన్నుల తదితర ఖర్చులను తగ్గించుకునే ప్రయత్నం చేస్తున్నారు. గ్రామీణ ప్రాంతాల్లోని ప్రైవేట్ స్కూల్స్ మూసివేయడానికి శ్రీకారం చుడుతున్నారు. ఆన్లైన్ క్లాసులు నిర్వహించే స్థోమత లేని సాధారణ, మధ్యతరగతి ప్రైవేట్ స్కూల్స్ మూతపడుతున్నాయి. మరికొన్ని స్కూళ్లను పెద్ద బిల్డింగ్స్ నుంచి ఖాళీ చేసి చిన్న భవనాల్లోకి షిఫ్ట్ చేస్తున్నారు. రెండేళ్ల కిందట ప్రైవేటు స్కూళ్లలో తమ పిల్లలకు సీట్ల కోసం తల్లిదండ్రులు పరిగెత్తేవారు. తమ స్థోమతకు మించి ఫీజులు చెల్లించేందుకు పోటీపడే వారు. కానీ కరోనా కాటుతో పరిస్థితులు తారుమారయ్యాయి. గతంలో చిన్నచూపుకు గురైన ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం విద్యార్థుల తల్లిదండ్రులు పోటీపడుతున్నారు. ప్రైవేటు స్కూళ్లలో ఫీజులు చెల్లించలేక తమ పిల్లలకు సర్కార్ స్కూళ్లలో అడ్మిషన్ దొరికితే చాలనుకుని మొక్కుకుంటున్నారు. కరోనా విలయతాండవంతో అన్ని వర్గాల వారి ఆర్థిక పరిస్థితులు తలకిందులైన విషయం తెలిసిందే. ఉపాధి అవకాశాలు దెబ్బతిన్నాయి. ఈ ప్రభావం విద్యారంగంపై తీవ్ర ప్రభావాన్నే చూపింది.
ఫీజుల కోసం అవస్థలు..
విద్యార్థుల తల్లిదండ్రులు ఫీజులు చెల్లించలేక నానా అవస్థలు పడుతున్నారు. మరోవైపు స్కూళ్లు సక్రమంగా నడవకపోవడంతో ప్రైవేటు స్కూల్ యాజమాన్యాలు ఉపాధ్యాయులు, సిబ్బందికి జీతభత్యాలు చెల్లించలేక కోత విధిస్తున్నారు. కొందరిని ఉద్యోగాల నుంచి తొలగిస్తున్నారు. మరికొందరు శాశ్వతంగా స్కూళ్లు మూసివేసేందుకు సిద్ధమవుతున్నారు. ఇక ఫీజుల విషయానికి వస్తే ఉమ్మడి రంగారెడ్డి జిల్లాలో ప్రైవేట్ స్కూళ్లలో దాదాపు గతేడాది అమల్లో ఉన్న ఫీజులే వసూలు చేస్తున్నారు. ప్రభుత్వం నిర్ణయించిన విధంగా ట్యూషన్ ఫీజు మూడు నెలలకోసారి కాకుండా నెలనెలా వసూలు చేస్తున్నారు. సాధారణ ప్రైవేటు స్కూళ్లలో రూ.15వేల నుంచి రూ.40 వేల వరకు ఫీజులు వసూలు చేస్తున్నారు. ఇంటర్నేషనల్ స్కూల్స్, బడా కార్పొరేట్ స్కూళ్లలో ఫీజులు రూ.లక్ష దాటుతున్నాయి. గతంలో వివిధ రకాల యాక్టివిటీస్, డెవలప్ మెంట్, డొనేషన్ రూపంలో తీసుకునే వారు. అయితే, ఇప్పుడు ఆ విధానానికి స్వస్తి పలికి ట్యూషన్ ఫీజు మాత్రమే తీసుకుంటున్నారు. గతంలో స్కూళ్లలో పనిచేసిన ఉపాధ్యాయుల్లో ప్రస్తుతం సగం మందినే కొనసాగిస్తున్నారు. విద్యార్థులకు ఆన్‌లైన్‌లోనే పాఠాలు బోధిస్తుండటంతో ఒక సబ్జెక్టుకు ఒకరిద్దరు ఉపాధ్యాయులతోనే కాలం వెళ్లదీస్తున్నారు. విద్యార్థుల హాజరు శాతం బట్టి ఉపాధ్యాయులకు జీతాలు చెల్లిస్తున్నారు. కొన్నిచోట్ల 7 నుంచి 10వ తరగతి వారికి పూర్తి జీతాలు చెల్లిస్తుండగా 7 అంతకన్నా తక్కువ స్థాయి తరగతుల వారికి 50 నుంచి 75 శాతం జీతాలు ఇస్తున్నారు.
ప్రభుత్వ పాఠశాలల్లో ఫుల్
ఒకవైపు విద్యార్థులు లేక ప్రైవేటు స్కూళ్లు మూతపడుతుండగా.. మరోవైపు ప్రభుత్వ పాఠశాలల్లో విద్యార్థుల సంఖ్య పెరగడం విశేషం. ప్రభుత్వం పరీక్షలు లేకుండానే పై తరగతులకు అనుమతిస్తున్న విషయం తెలిసిందే. ఇదే సమయంలో ఆర్థిక ఇబ్బందుల కారణంగా అనేకమంది విద్యార్థుల తల్లిదండ్రులు ఆన్‌లైన్ క్లాస్‌లకు ఫీజులు చెల్లించలేకపోతున్నారు. ఫీజులు చెల్లించకపోవడంతో ప్రైవేటు యాజమాన్యాలు ఆన్‌లైన్ క్లాసులు బంద్ చేస్తున్నారు. దీంతో ప్రైవేటు స్కూళ్లలో ఆన్‌లైన్ హాజరుశాతం 25 నుంచి 50శాతం వరకే ఉంటుంది. అయితే, ప్రైవేటు పాఠశాలలు ఇలా ఇబ్బందులు పెడుతుండటంతో ప్రభుత్వ స్కూళ్లలో అడ్మిషన్ల కోసం ఎగబడుతున్నారు. ఆదిభట్లలోని ప్రభుత్వ ఉన్నత పాఠశాలల్లో ఇప్పటికే 150 మంది అడ్మిషన్ల కోసం దరఖాస్తు చేసుకున్నారు. ప్రభుత్వ స్కూళ్లలో టీవీలో క్లాస్‌లు వస్తుండటంతో ఇంటర్‌నెట్ సమస్య కూడా రావడం లేదు.
కార్పొరేట్ స్కూల్లో ఆన్‌లైన్ ’దందా’
ప్రభుత్వ ఆదేశాలు ఎవరైనా పాటించాల్సిందే. కానీ కార్పొరేట్ స్కూల్ యాజమాన్యాలు మాత్రం బేఖాతరు చేస్తున్నాయి. ఆన్‌లైన్ క్లాసుల పేరుతో అత్యధిక ఫీజులు వసూలు చేస్తున్నాయి. చెల్లించలేని పరిస్థితుల్లో ఉన్న స్టూడెంట్స్‌ను క్లాసులు వినకుండా చేస్తున్నాయి. కార్పొరేట్ స్కూల్స్ ఆన్‌లైన్ క్లాసుల పేరుతో ఫీజుల దందాలు చేస్తున్నాయి. అంతేకాదు పూర్తిగా ఫీజులు చెల్లించాలంటూ పేరెంట్స్‌కు మొబైల్స్‌లో మెసేజ్‌లు పెడుతున్నారు. ఆన్‌లైన్ క్లాసులు అవిఇవీ అంటూ తల్లిదండ్రుల నుంచి అందినకాడికి డబ్బులు దండుకుంటున్నాయి. కరోనా సమయంలో ఆర్థిక సమస్యతో సతమతమవుతుంటే.. మరోవైపు వేలల్లో ఫీజులు ఎలా చెల్లించాలని విద్యార్థుల తల్లిదండ్రులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ప్రభుత్వ జీవో ప్రకారం ట్యూషన్ ఫీజులు మాత్రమే చెల్లించాలని ఆదేశాలు ఉన్నప్పటికీ.. స్కూళ్ల యాజమాన్యం పూర్తి ఫీజులు చెల్లించాలని ఒత్తిడి చేస్తున్నారని తల్లిదండ్రులు ఆరోపించారు.