అది టీ కప్పులో తుపానే

by Shyam |
అది టీ కప్పులో తుపానే
X

దిశ, స్పోర్ట్స్: బౌలర్లు బంతిపై ఉమ్మిని రాయడం నిషేధించడం వల్ల బ్యాట్స్‌మెన్ లాభపడతారని అనుకోవడం ఊహ మాత్రమేనని ఆసీస్ మాజీ కెప్టెన్ గ్రెగ్ చాపెల్ అన్నాడు. కరోనా వైరస్ వ్యాప్తిని నియంత్రణలో భాగంగా ఐసీసీ పలు కొత్త మార్గదర్శకాలు విడుదల చేసింది. దీంతో బంతిపై ఉమ్మి రాయడాన్ని నిషేధించడమే కాకుండా రెండు హెచ్చరికల తర్వాత కూడా బౌలర్ అదే పనిచేస్తే ప్రత్యర్థి జట్టుకు 5 పరుగులు పెనాల్టీ రూపంలో ఇస్తామని ప్రకటించింది. ఈ నిర్ణయంపై బౌలర్లు తీవ్ర అసంతృప్తి వ్యక్తం చేస్తున్నారు. ఇప్పటికే క్రికెట్‌లో బ్యాట్స్‌మెన్ ఆధిపత్యం పెరిగిపోయిన నేపథ్యంలో ఐసీసీ నిబంధన బౌలర్ల పాత్రను నామమాత్రం చేస్తుందని విమర్శలు వచ్చాయి. అయితే ఈ గొడవంతా టీకప్పులో తుపాను లాంటిదని, దీన్ని పెద్దగా పట్టించుకోవల్సిన అవసరం లేదని చాపెల్ అంటున్నాడు. ఉమ్మి కాకపోతే చెమట.. ఏదో ఒకటి వాడుకోవచ్చు. రెండింటిలో పెద్ద వ్యత్యాసం ఏమీ ఉండదని చాపెల్ అభిప్రాయపడ్డాడు. ఐసీసీ కొత్త నిబంధన వల్ల ఆస్ట్రేలియన్ బౌలర్లకు వచ్చిన ఇబ్బంది ఏమీ ఉండదని అన్నాడు. ప్రస్తుతం ఆసీస్ జట్టులో స్వింగ్ చేయగలిగే బౌలర్లు పెద్దగా ఎవరూ లేరని చెప్పాడు. మిచెల్ స్టార్క్ మాత్రం కాస్త రివర్స్ స్వింగ్ రాబట్టగలడని చెప్పాడు. ఉమ్మిని నిషేధించినంత మాత్రాన బ్యాట్, బంతికి మధ్య సమతూకం చెడిపోదని చెప్పాడు.

Advertisement

Next Story

Most Viewed