గవర్నర్ హరిచందన్‌కు రెండో డోస్ వ్యాక్సిన్

by srinivas |
గవర్నర్ హరిచందన్‌కు రెండో డోస్ వ్యాక్సిన్
X

దిశ, వెబ్ డెస్క్: అర్హత కలిగిన వారంతా కరోనా వ్యాక్సిన్ తీసుకోవాలని ఏపీ గవర్నర్ బిశ్వభూషణ్ హరిచందన్ విజ్ఞప్తి చేశారు. బుధవారం రాజ్‌భవన్‌లో గవర్నర్ దంపతులు హరిచందన్ ఆయన సతీమణి సుప్రవ హరిచందన్ రెండోవిడత కోవిడ్ వ్యాక్సిన్ తీసుకున్నారు. కోవాక్సిన్ యొక్క రెండవ మోతాదు తీసుకున్న అనంతరం మీడియాతో మాట్లాడిన గవర్నర్ హరిచందన్ తొలిదశ టీకా తీసుకున్న తర్వాత జ్వరం, నొప్పి వంటి ప్రతికూల పరిస్థితులు ఏమీ రాలేదన్నారు. వ్యక్తులు తమ ఆరోగ్యం కోసం వ్యాక్సిన్ తీసుకోవడం సురక్షితమే కాక ఖచ్చితంగా అవసరమన్నారు.

కరోనాపై పోరులో రాష్ట్ర ప్రభుత్వం, ప్రజలు తమదైన భూమికను పోషించటం ముదావహమన్నారు. కోవిడ్ నియమావళిని అనుసరించటం, సామాజిక దూరాన్ని పాటిస్తూ ఎల్లప్పుడూ మాస్క్ ధరించడంతో పాటూ ఇతర చర్యలను కూడా పాటించటం అవసరమని గవర్నర్ అన్నారు. భారత ప్రభుత్వ మార్గదర్శకాల ప్రకారం పరీక్షలు, ట్రాకింగ్, చికిత్స, టీకా కార్యక్రమాల ద్వారా ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం అన్ని చర్యలు తీసుకుంటుందని, పరిస్థితిని నిశితంగా పర్యవేక్షిస్తుందని గవర్నర్ హరిచందన్ తెలిపారు. టీకా కార్యక్రమంలో గవర్నర్ కార్యదర్శి ముకేష్ కుమార్ మీనా, డిఎంహెచ్ఓ డాక్టర్ సుహాసిని పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed