ఏపీలో గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం

by srinivas |
ఏపీలో గ్రాడ్యుయేట్లకు సువర్ణావకాశం
X

దిశ, వెబ్ డెస్క్: కరోనా వైరస్ విస్తృతంగా వ్యాప్తిచెందుతున్న విపత్కర పరిస్థితుల్లోనూ ఏపీ సర్కారు దూసుకుపోతోంది. అంతేగాకుండా కరోనాను ఆరోగ్య శ్రీలో చేర్చడం లాంటి సంచలన నిర్ణయాలు కూడా తీసుకున్నారు. కాగా ఈ క్లిష్ట పరిస్థితుల్లో అందుబాటులో ఉన్న మానవ వనరులను సమర్థంగా వినియోగించుకోవాలని ఏపీ సర్కారు భావిస్తోంది. విజయవాడలో ఉన్న కొవిడ్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పోస్టు గ్రాడ్యుయేట్లు, మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్ల సేవలు ఉపయోగించుకునేందుకు ప్రణాళిక రూపొందించింది. ఈ మేరకు రాష్ట్ర వైద్య ఆరోగ్య శాఖ ఇంటర్న్ షిప్ ప్రకటన విడుదల చేసింది. కరోనా సంక్షోభ నివారణ చర్యల్లో భాగంగా కమాండ్ కంట్రోల్ సెంటర్‌లో పనిచేసేందుకు ఆసక్తి కలిగిన మేనేజ్ మెంట్ గ్రాడ్యుయేట్లు, పోస్టుగ్రాడ్యుయేట్లు వాక్ ఇన్ ఇంటర్వ్యూకు హాజరు కావొచ్చని ఆ ప్రకటనలో వెల్లడించింది. దరఖాస్తులకు ఈ నెల 22 తుది గడువు.

విజయవాడ ఎంజీ రోడ్ లోని న్యూ ఆర్ అండ్ బి బిల్డింగ్ లో ఉన్న స్టేట్ కమాండ్ కంట్రోల్ సెంటర్‌కు ఉద్యోగార్థులు నేరుగా రావొచ్చని ప్రకటనలో పేర్కొన్నారు. అభ్యర్థులకు బేసిక్ కంప్యూటర్ స్కిల్స్, విశ్లేషణ సామర్థ్యం, భావవ్యక్తీకరణ నైపుణ్యాలు, సాఫ్ట్ స్కిల్స్ అవసరం. ఈ ఉద్యోగాలకు ఎంపికైనవారు మూడే నెలల పాటు పనిచేయాల్సి ఉంటుంది. నెలకు రూ.6 వేల చొప్పున గౌరవవేతనం చెల్లిస్తారు. ఇంటర్న్ షిప్‌ను విజయవంతంగా పూర్తిచేసినవారికి ఓ సర్టిఫికెట్ కూడా ఇస్తారు.

Advertisement

Next Story

Most Viewed