ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు.. ఆవేదనలో ప్రభుత్వ ఉపాధ్యాయులు

by Sridhar Babu |   ( Updated:2021-08-18 08:58:41.0  )
ఇంకెన్నాళ్లీ ఎదురుచూపులు.. ఆవేదనలో ప్రభుత్వ ఉపాధ్యాయులు
X

దిశ, కరీంనగర్ సిటీ : ఆరేళ్లుగా వారికి పదోన్నతులు లేవు. మూడేళ్ళుగా సాధారణ బదిలీలు కూడా నిర్వహించలేదు. రాష్ట్రంలోని అన్ని శాఖల్లో పనిచేస్తున్న ఉద్యోగులకు ఏటా పదోన్నతులు కల్పిస్తున్నా, ప్రభుత్వం వారిని మాత్రం విస్మరించింది. దీంతో, సాధారణ, అంతర్ జిల్లా బదిలీలు, ప్రమోషన్ల కోసం ఇంకెంత కాలం వేచి ఉండాలో అర్థం కావడంలేదంటూ ప్రభుత్వ ఉపాధ్యాయులు ఆందోళన చెందుతున్నారు.

నిన్న మొన్నటివరకు.. తమకు బదిలీల అవకాశం లభిస్తుందని ఆశతో ఉండగా, హేతుబద్దీకరణలో సర్దుబాటు మాత్రమే చేస్తామంటూ ప్రకటించిన ప్రభుత్వం వారి ఆశలపై నీళ్లు చల్లింది. దీంతో, ఈ ఏడాదికి ఇంతేనంటూ ఉపాధ్యాయ సంఘాలు స్పష్టం చేస్తుండగా, తామో చోట, తమ కుటుంబాలు వేరేచోట అన్నట్లుగా తమ పరిస్థితులు మారాయని ఆవేదన వ్యక్తం చేస్తున్నారు.

ఉమ్మడి కరీంనగర్ జిల్లాలో 40 వేల పైచిలుకు ప్రభుత్వ ఉద్యోగులుండగా, వారిలో 15 వేల వరకు ఉపాధ్యాయులున్నారు. వీరంతా కొన్నేళ్లుగా ప్రస్తుతం ఉన్న స్థానాల్లోనే విధులు నిర్వహిస్తున్నారు. జిల్లా విభజన అనంతరం సొంత జిల్లాలు వీడి ఉద్యోగాలు చేస్తున్నారు. అనేక మంది అనారోగ్య సమస్యలు, ఇతరత్రా ఇబ్బందులు పడుతున్నారు. వారి కుటుంబ సభ్యుల పరిస్థితులైతే వర్ణనాతీతంగా మారాయి. అయినా, నిన్నటి వరకు బదిలీలపై ఆశలతోనే ఉన్న వీరిలో మంగళవారం విద్యాశాఖ చేసిన ప్రకటన వారి ఆశలకు ఆడియాశలు నింపింది.

సర్దుబాటుతోనైనా సర్దుకుపోదామనుకుంటే అధికారుల తీరుతో తమకు అనుకూల ప్రాంతంలో పోస్టింగ్ వస్తుందో, రాదోననే టెన్షన్ నెలకొంది. హేతుబద్దీకరణ కోసం ఈ నెల 12న విడుదల చేసిన జీవో నం.25 ఐదు రోజుల తర్వాత 17వ తేదీన అందుబాటులోకి రాగా, 2020-21 యూ-డైస్ డేటా ప్రకారం ప్రైమరీ, అప్పర్ ప్రైమరీ, హైస్కూల్స్‌లో ఉన్న ఉపాధ్యాయ పోస్టులను రేషనలైజేషన్ చేయనున్నారు.

అయితే, రేషనలైజేషన్‌తో మిగిలే టీచర్ పోస్టులను ఎటు మార్చాలి, మిగులు పోస్టుల్లో పని చేస్తున్న ఉపాధ్యాయులను ఏ పరిధి మేరకు బదిలీ చేయాలనే వివరాలు లేకపోవటంతో, ఆ పోస్టుల్లో తామే ఉంటే పరిస్థితి ఏంటనే ఆందోళన ఉపాధ్యాయవర్గాల్లో గోచరిస్తున్నది. రేషనలైజేషన్‌లో సమ్మతి తెలిపిన సీనియర్ టీచర్‌ర్లను బదిలీ చేస్తారు. ఒకవేళ నిరాకరిస్తే, నిర్బంధంగా జూనియర్లని బదిలీ చేస్తారు.

పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారిని సీనియర్, జూనియర్ అని చూడకుండా రేషనలైజేషన్‌లో భాగంగా, గతంలో నిర్బంధంగా బదిలీ చేసేవారు. అయితే, సాధారణ బదిలీలు చేపట్టకుండా కేవలం రేషనలైజేషన్ ప్రక్రియలో మిగులుగా తేలే ఉపాధ్యాయులను మాత్రమే బదిలీలు చేస్తే, పాఠశాలలో ఎనిమిదేళ్ల సర్వీస్ పూర్తి చేసిన వారికి స్థానచలనం కల్పించడం అనుమానమే కావటంతో పలువురు ఉపాధ్యాయులు, దీనిపై స్పష్టత కోసం అనుభవజ్ఞులైన ఉపాధ్యాయ సంఘాల నేతల వద్దకు పరుగులు తీస్తున్నారు.

Advertisement

Next Story