‘ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలి’

by Shyam |
‘ప్రైవేట్ ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలి’
X

దిశ, తెలంగాణ బ్యూరో : రాష్ట్రంలో ప్రభుత్వ నిబంధనలు ఉల్లంఘిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకోవాలని ఏఐసీసీ సభ్యుడు జి.నిరంజన్ డిమాండ్ చేశారు. శుక్రవారం సీఎం కేసీఆర్ కు మెయిల్ ద్వారా వినతిపత్రం పంపారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ ప్రైవేటు ఆసుపత్రులు అధిక ఫీజులు వసూలు చేస్తున్నాయని 88 ఫిర్యాదులు వస్తే 64 ఆసుపత్రులకు నోటీసులు ఇచ్చామని, ఒకదాని గుర్తింపు రద్దు చేశామని ప్రజారోగ్యశాఖ డైరెక్టర్ శ్రీనివాసరావు వెల్లడించారన్నారు. ఎన్నిసార్లు ప్రభుత్వం సమావేశాలు ఏర్పాటు చేసి కోరినా, హెచ్చరికలు జారీ చేసినా చీమ కుట్టినట్టయినా లేదన్నారు. ప్రాణాలను అరచేతిలో పెట్టుకొని వెళ్తున్న వారి నుంచి యథావిధిగా అధిక చార్జీలు వసూలు చేస్తూ దోచుకుంటున్నాయని ఆవేదన వ్యక్తం చేశారు. ఆసుపత్రులు వైద్యం కంటే దోచుకోవడానికే అన్నట్లుగా వ్యవహరిస్తున్నాయని ఆరోపించారు. నిబంధనలు అతిక్రమిస్తున్న ప్రైవేటు ఆసుపత్రులను స్వాధీనం చేసుకొని వాటి నిర్వహణకు సీఎం ఆధ్వర్యంలో నిష్ణాతులైన విశ్రాంత అధికారులు, వైద్యాధికారులతో బోర్డు ఏర్పాటు చేయాలని డిమాండ్ చేశారు. డాక్టర్లను, సిబ్బందిని కొనసాగిస్తూ ప్రభుత్వ నియంత్రణలో సేవలు కొనసాగించాలని, ప్రతి ప్రైవేటు ఆసుపత్రి రోగుల నుంచి వసూలు చేసే బిల్లు వివరాలను ఆన్ లైన్ లో పెట్టేలా చర్యలు తీసుకోవాలని, వైద్య ఆరోగ్యశాఖ లో ఒక సెల్ ఏర్పాటు చేసి నిరంతరం పర్యవేక్షిస్తూ దోపిడిని అరికట్టాలని సీఎంను కోరారు.

Advertisement

Next Story