- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
కరోనా ప్రమాదంలో జర్నలిస్టులు
దిశ, న్యూస్‌బ్యూరో: కరోనా ఫ్రంట్‌లైన్ వారియర్లలో జర్నలిస్టులను ప్రభుత్వం గుర్తించకపోయినా విధి నిర్వహణలో పదుల సంఖ్యలో ఇన్‌ఫెక్షన్ బారిన పడుతున్నారు. ఇంతకాలం ఢిల్లీ, మహారాష్ట్ర, తమిళనాడు రాష్ట్రాల్లో ఈ బెడద ఉండగా ఇప్పుడు తెలంగాణలో సైతం ఏర్పడింది. రాష్ట్రంలో ఇప్పటివరకు కరోనా బారిన పడిన పాతికమందికి పైగా జర్నలిస్టులందరూ హైదరాబాద్ నగరంలో పనిచేస్తున్నవారే. ఇందులో ఒకరు కరోనా కారణంగానే మృతి చెందారు. మొదట ఒకరిద్దరితో మొదలైన పాజిటివ్ జర్నలిస్టుల సంఖ్య ఇప్పుడు రెండంకెలకు చేరుకుంది. బుధవారం ముగ్గురు జర్నలిస్టులకు పాజిటివ్ నిర్ధారణ కాగా గురువారం మరో తొమ్మిది మందికి సోకింది.
దీంతో పాజిటివ్ జర్నలిస్టులతో ప్రైమరీ కాంటాక్టులో ఉన్న పాత్రికేయుల్లో భయాందోళనలు నెలకొన్నాయి. వైరస్ ఇన్‌ఫెక్షన్ సోకడానికి కారణాలేవైనప్పటికీ చికిత్స పొందుతున్న క్రమంలో గాంధీ ఆసుపత్రిలో తగిన సౌకర్యాలు లేవనేది బహిరంగ రహస్యం. వైద్య సేవలు, సౌకర్యాలు భేషుగ్గా ఉన్నాయని ప్రభుత్వం చెప్పుకుంటున్నా వాస్తవాలు మాత్రం అందుకు భిన్నంగా ఉంటున్నాయి. వార్డుల్లో వాస్తవిక పరిస్థితిని జర్నలిస్టులు వీడియోల రూపంలో బాహ్య ప్రపంచానికి పంపుతున్నా వాటిని స్వీకరించడానికి ప్రభుత్వం సిద్ధంగా లేదు. స్వయంగా ముఖ్యమంత్రే మీడియాపై అసత్య ప్రచారాలంటూ విమర్శలు చేయడంతో ఆసుపత్రిలో వైద్యులు సైతం అంతకంటే భిన్నంగా ఏమీ లేరనేది అక్షరసత్యం.
చికిత్స పొందుతూ జర్నలిస్టు మనోజ్ చనిపోవడం మొత్తం పాత్రికేయుల్లోనే అలజడి రేకెత్తించింది. ప్రధాన తెలుగు దినపత్రిలో పనిచేస్తున్న ఒక పాత్రికేయుడికి పాజిటివ్ రావడంతో ఆఫీసులో మొత్తం బ్లాకును శానిటైజ్ చేయించి తాత్కాలికంగా మూసివేయించాల్సి వచ్చింది. అదే పత్రికలో పనిచేస్తున్న మరో జర్నలిస్టుకు పాజిటివ్ రావడంతో అతని కుటుంబంలో మరో ముగ్గురికి కూడా సోకింది. దీంతో వైద్య మంత్రితో మాట్లాడిన జర్నలిస్టులు పరీక్షలు చేయించుకోవడంతో రెండు రోజుల వ్యవధిలో 12 మందికి పాజిటివ్ నిర్ధారణ అయింది. దీంతో చాలా మంది ఒకవైపు భయపడుతూనే మరోవైపు క్వారంటైన్‌లోకి వెళ్ళిపోయారు.
జర్నలిస్టుల భద్రతకు ప్రభుత్వం ప్రత్యేక చర్యలు తీసుకోవడంతో పాటు మృతుల కుటుంబాలకు నష్టపరిహారాన్ని చెల్లించాలని, పాజిటివ్‌గా నిర్ధారణ అయినవారికి ప్రత్యేక వార్డుల్లో చికిత్స కల్పించాలని, ఆరోగ్య బీమా కల్పించాలని, జర్నలిస్టులందరికీ నిర్ధారణ పరీక్షలు చేయాలని గవర్నర్‌కు, రాష్ట్ర వైద్య మంత్రికి తెలంగాణ జర్నలిస్టు యూనియన్ (ఐజేయూ అనుబంధం) ప్రతినిధులు విజ్ఞప్తి చేశారు. నాలుగేళ్లుగా జర్నలిస్టుల సంక్షేమం పట్ల ప్రభుత్వం నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని, కనీసం కరోనా సమయంలోనైనా వారిని రక్షించాలని సంఘం ప్రతినిధులు శ్రీనివాసరెడ్డి, విరాహత్ ఆలీ తదితరులు కోరారు. జర్నలిస్టులకు కూడా రూ. 50 లక్షల ఆరోగ్య బీమా సౌకర్యం కల్పించాలని, మృతి చెందిన మనోజ్ కుటుంబానికి రూ. 50 లక్షల పరిహారం చెల్లించాలని, పాజిటివ్ వచ్చిన మీడియా సిబ్బంది చికిత్స కోసం ప్రత్యేక ఆసుపత్రి కేటాయించాలని కోరారు. మరోవైపు మీడియా అకాడమీ తరఫున పాజిటివ్ బారిన పడిన జర్నలిస్టులకు తలా రూ. 10 వేల చొప్పున సాయం చేసినట్లు ఛైర్మన్ అల్లం నారాయణ తెలిపారు.
ప్రత్యేక ఏర్పాట్లపై ప్రభుత్వానికి చెప్తా : గవర్నర్
జర్నలిస్టుల సమస్యలపై సానుకూలంగా స్పందించిన గవర్నర్ తమిళిసై సౌందర్ రాజన్ కరోనా కాటుకు గురయ్యే జర్నలిస్టులకు చికిత్స కోసం ప్రత్యేక ఏర్పాట్లు ఉండేలా రాష్ట్ర ప్రభుత్వానికి తగిన సూచనలు చేస్తానని వ్యాఖ్యానించారు. జర్నలిస్టు మనోజ్ కుమార్ కరోనాతో మృతి చెందడం బాధాకరమని విచారం వ్యక్తంచేశారు. కరోనా వ్యాధి కట్టడిలో జర్నలిస్టుల సేవలను ఆమె ప్రశంసించారు. తగిన జాగ్రత్తలు తీసుకుంటూ అప్రమత్తంగా ఉండాలని సూచించారు. ప్రస్తుత గడ్డు పరిస్థితి నుంచి సమాజాన్ని కాపాడేందుకు వార్తల ద్వారా ప్రజలను మరింత చైతన్యపర్చాలని కోరారు.