ఓ లింగా.. ఓ లింగా.. సల్లంగ సూడవయ్యా సామీ..

by Anukaran |
ఓ లింగా.. ఓ లింగా.. సల్లంగ సూడవయ్యా సామీ..
X

దిశ ప్రతినిధి, నల్లగొండ: తెలంగాణలోనే రెండో అతిపెద్ద జాతరైన పెద్దగట్టు(గొల్లగట్టు) లింగమంతుల స్వామి జాతర అంగరంగ వైభవంగా సాగుతోంది. యాదవ సోదరుల డిల్లెం బల్లెం శబ్దాలకు తోడు భక్త కోటి చేస్తోన్న ఓ లింగా నామస్మరణతో పెద్దగట్టు పరిసరాలు మారుమోగుతోంది. యాదవులు తమ ఇలవేల్పుగా భావించే లింగమంతుల స్వామి జాతర… అట్టహాసంగా ప్రారంభమైంది. ఆదివారం రాత్రి కేసారం నుంచి పెద్దగుట్టకు దేవరపెట్టె తరలిరావడంతో… ప్రత్యేక పూజల అనంతరం జాతర మొదలైంది. గంపలు నెత్తినెత్తుకొని బోనాలు, పోలు ముంతలు, పసుపు సమర్పించేందుకు… భక్తులు అర్ధరాత్రి నుంచే బారులు తీరారు. దేవరపెట్టే పెద్దగట్టుకు చేరుకున్న అనంతరం… మొక్కులు చెల్లించుకున్నారు. లింగమంతుల స్వామి, చౌడమ్మ తల్లిని దర్శించుకునేందుకు పోటీ పడుతున్నారు.

ఇదీ ప్రత్యే‘కథ’

300 వందల ఏండ్ల ఘనమైన చరిత్ర ఉన్న ఈ జాతరను ప్రతి రెండేండ్లకోసారి నిర్వహించడం ఆనవాయితీ. ఈ జాతరలో యాదవుల ఇలవేల్పు అయిన లింగమంతుల స్వామి, యలమంచిలమ్మ, గంగమ్మ, శివుడి సోదరి సౌడమ్మలు కొలువైన పెద్దగట్టును అత్యంత మహిమాన్విత ప్రదేశంగా యాదవులు భావిస్తుంటారు. తమ సంపదలైన గొర్రె జీవాలను, తమను కూరమృగాల నుంచి కాపాడాలని లింగమంతుల స్వామిని యాదవులు వేడుకుంటారు.

ప్రత్యేక ఆకర్షణగా యాదవుల విన్యాసాలు..

పెద్దగట్టు లింగమంతుల స్వామి జాతర పూర్తిగా యాదవ సంప్రాదాయ ప్రకారమే జరుగుతుంది. రెండేండ్లకోసారి జరిగే గొల్లగట్టు జాతరలో యాదవ సోదరులు చేసే విన్యాసాలు జాతరకు ప్రత్యేక ఆకర్షణగా నిలుస్తాయి. లింగమంతుల స్వామికి మొక్కులు సమర్పించేందుకునేందుకు కుటుంబ సమేతంగా గంపలు, బోనాలు నెత్తిన ఎత్తుకుని పోలుముంతలు, పసుపు బియ్యంతో బంధుగణం సమేతంగా పెద్దగట్టుకు చేరుకుంటారు. గట్టుపైకి చేరుకునే క్రమంలో యాదవ సోదరులు గజ్జెల లాగులు ధరించి, కత్తులు, కటార్లతో ప్రత్యేక విన్యాసాలు చేస్తారు. డప్పు వాయిద్యాలతో లయబద్దంగా అడుగులు వేస్తూ చేసే లింగనామస్మరణతో తన్మయత్వం చెందుతారు.

యావత్ దేశం నుంచి భక్తుల రాక..

తెలంగాణలోనే వైభవోతంగా సాగే పెద్దగట్టు జాతరకు ఒక్క తెలంగాణ రాష్ట్రం నుంచి కాకుండా ఆంధ్రప్రదేశ్, మహారాష్ట్ర, ఒరిస్సా, ఛత్తీస్‌ఘడ్, కర్ణాటక రాష్ట్రాల నుంచి లక్షలాదిగా భక్తులు తరలివస్తారు. తాము కోరుకున్న కోర్కెలు తీరినవారంతా మొక్కులు చెల్లించుకోవడం ఇక్కడ ఆనవాయితీ. తెలంగాణలోని యాదవ సోదరులతో పాటు ఇతర రాష్ట్రాల నుంచి వచ్చే భక్తులతో దురాజ్‌పల్లిగుట్టతో పాటు సూర్యాపేట పట్టణ పరిసరాలన్నీ ఇసుకెస్తే రాలనంత భక్తజనం రద్దీ నెలకొంటుంది. భక్తులు యాట(మేకపోతు, గొర్రెపోతు)లను లింగమంతుల స్వామికి సమర్పించి.. జాతరకు వచ్చిన బంధువులకు విందు భోజనాలు పెడతారు. జాతరకు వచ్చే భక్తులు రెండు నుంచి మూడు రోజుల వరకు దురాజ్‌పల్లిలోనే ఉంటారు.

Advertisement

Next Story

Most Viewed