జీహెచ్ఎంసీ ఖజానా ఖాళీ.. జీతం రాలే..!

by Shyam |
GHMC
X

దిశ, తెలంగాణ బ్యూరో: జీహెచ్ఎంసీ బడ్జెట్ రోజురోజుకూ దిగజారిపోతోంది. బ‌ల్దియా క‌ష్టాలు పెరిగిపోతున్నాయి. ఇప్పటికే అప్పులతో నెట్టుకొస్తున్న బల్దియా ఖజానాపై వరదలు, ఎన్నికలు మరింత భారాన్ని మోపాయి. అధికారులంతా ఎన్నికల విధుల్లో బిజీగా ఉండటంతో నెలనెలా రావాల్సిన పన్నులు వసూలు కాలేదు. ప్రతి నెలా మొదటి తేదీనే చెల్లించాల్సిన జీతాలు 15 రోజులైనా అందకపోవడంతో కార్మికులు ఆందోళన బాటపట్టారు.

ఒక‌ప్పుడు కాసుల‌తో గ‌లగ‌ల‌లాడిన బ‌ల్దియా ఖ‌జానా కాలం గడుస్తున్న కొద్దీ వెలవెలబోతోంది. జీహెచ్ఎంసీకి ఉన్న ఫిక్స్‌డ్ డిపాజిట్లు కరిగిపోయాయి. మ‌రో వైపు ప‌న్నుల వ‌సూళ్లు తగ్గిపోయాయి. వరుసగా కరోనా, ధరణి, వరదలు, తాజాగా ముగిసిన ఎన్నికలు గ్రేటర్ కార్పొరేషన్‌ను ఆర్థిక కష్టాల ఊబిలో ముంచేశాయి. అటు ప్రభుత్వ కార్యక్రమాలు, ఎన్నికల విధులతో బిజీగా గడిపిన అధికారులు ఆదాయ మార్గాలపై దృష్టి సారించలేకపోయారు. ఒక వైపు జీతాలను ఇవ్వలేక.. మెయింటెనెన్స్ వెళ్లదీయలేక బల్దియాలో పరిస్థితి అధ్వానంగా తయారైంది.

ఒకటో తేదీ దాటినా జీతాలు వస్తాయనే నమ్మకం కార్మికుల్లో లేకుండా పోయింది. జీతాలు, పెన్షన్లు, మెయింటెనెన్స్ కోసం వందల కోట్లు ఖర్చు చేయాల్సి ఉండగా.. తగ్గిపోతున్న ఆదాయ వనరులతో అధికారులు తలలు పట్టకుంటున్నారు. ప్రతీ నెలా జీతాలు, పెన్షన్ల కోసం రూ. 134కోట్లు, నిర్వహణ కోసం రూ. 30కోట్లు, రోడ్లు, నాలాలు, భ‌వ‌నాల నిర్మాణాల వంటి వాటి కోసం నెలనెల బిల్లులు రూ. 40 కోట్ల వ‌ర‌కు ఉన్నాయి. రోడ్డు మెయింటెనెన్స్‌తో పాటు ఇతర పనుల కోసం రూ.60 – 100 కోట్ల వరకు ఖర్చు అవుతుందని అధికారుల అంచనా. ఈ పరిస్థితుల్లో ఏ బిల్లులు ఆపివేయాలి.., ఏ బిల్లులు విడుదల చేయాలంటూ ఒకటికి నాలుగు సార్లు చెక్ చేసుకుంటున్నారు.

సాధారణంగా ప్రతి నెలా ఆస్తి పన్ను రూ.60 కోట్లకు పైగా వసూలు రావాల్సి ఉంటుంది. అయినా గతంలో మాదిరిగా పన్ను చెల్లింపులు జరగడం లేదని అధికారులు కూడా అంగీకరిస్తున్నారు. దాదాపు ఆరు నెలలుగా కరోనా, ధరణి, వరదలు, జీహెచ్ఎంసీ ఎన్నికలు ఒకదాని వెంట ఒకటి రావడంతో బల్దియా యంత్రాంగం పూర్తిగా ఆయా పనుల్లో మునిగిపోయింది. దీంతో పన్నుల వసూలు మందగించింది. ఆరు వారాలుగా బిల్ కలెక్టర్లు ఒక్క ఇంటికి వెళ్లి పన్ను వసూలు చేయలేదు. కేవలం ఆన్‌లైన్ పన్ను చెల్లింపు దారుల నుంచి రూ. 12కోట్లు మాత్రమే గత నెలలో వసూలు అయ్యాయి. జీహెచ్ఎంసీ అప్పులకు వడ్డీగా ప్రతీ నెలా రూ.30 కోట్లు చెల్లించాల్సి ఉంది.

ఖాతాల్లో జమా అవగానే వడ్డీ కోసం నేరుగా ఖాతాలో నుంచి ఆటోమేటిక్‌గా కట్ అవుతుంది. వచ్చిన ఆదాయం కూడా వడ్డీలకే వెళ్తుండటంతో బ్యాంకు ఖాతాల్లో బ్యాలెన్స్ కూడా ఉండటం లేదు. మరో వైపు టౌన్ ప్లానింగ్ ఆదాయం కూడా ఈ మధ్య కాలంలో భారీగా తగ్గిపోయింది. దాదాపు రూ.100-200 కోట్ల మధ్య ఆదాయం తగ్గినట్టు సమాచారం. దీంతో ప్రతి నెలా రావాల్సిన జీతాలు 15 రోజులైనా రాకపోవడంతో కార్మికులు ఇబ్బందులు పడుతున్నారు. అధికారులంతా మొదటి తేదీనే వేతనాలు తీసుకుంటూ కార్మికులను గాలికి వదిలేశారని వారు విమర్శిస్తున్నారు. ఏ జోన్‌, ఏ సర్కిల్‌లో ఎంతమందికి జీతాలు వచ్చాయంటూ ప్రతీ రోజూ ఫోన్లు చేసి తెలుసుకుంటున్నారు. శానిటేషన్ విభాగంలోని సిబ్బందితో పాటు ట్రాన్స్‌పోర్ట్ డ్రైవర్లకు కూడా నవంబర్ నెలకు సంబంధించిన జీతాలు ఇంకా అందలేదు. ఈ విషయంపై వారంతా జీహెచ్ఎంసీ కార్యాలయం ముందు ధర్నా చేయడంతో పాటు మేయర్‌కు వినతిపత్రం కూడా అందించారు.

పెండింగ్‌లోనే కాంట్రాక్టర్ల బిల్లులు

వేతనాలు అందక కార్మికులు ఇబ్బందులు పడుతుండగా.. కాంట్రాక్టర్లకు సైతం బిల్లుల చెల్లింపులు జరగడం లేదు. పనులు పూర్తి చేసి నెల‌లు గ‌డుస్తున్నా త‌మ‌కు బిల్లులు చెల్లించ‌డం లేద‌ని వారు వాపోతున్నారు. ఆగస్టు నెల మధ్య వారం నుంచి బిల్లుల చెల్లింపులను అధికారులు జరపడం లేదు. ఇప్పటి రకూ దాదాపు రూ.210 కోట్ల బిల్లులు పెండింగ్‌లోనే ఉన్నట్టు సమాచారం. కరోనా తర్వాత రియల్టర్లు కొత్తగా ప్రాజెక్టులను చేపట్టడం లేదు. ఈ కారణంగా నిర్మాణ అనుమతుల ద్వారా వచ్చే ఆదాయం కూడా తగ్గిపోయింది. వరుసగా జరుగుతున్న పరిణామాలు, ఆదాయ మార్గాలపై దృష్టి సారించకపోవడంతో బల్దియా ఖజానా మరింత లోటులోకి వెళ్లిపోయి జీతాలు ఇవ్వలేని పరిస్థితుల్లోకి చేరిపోయింది.

Advertisement

Next Story