ఎంత ఖర్చు చేశారో చెప్పండి.. లేకపోతే పదవికి ఎసరు..!

by Shyam |
ఎంత ఖర్చు చేశారో చెప్పండి.. లేకపోతే పదవికి ఎసరు..!
X

దిశ, తెలంగాణ బ్యూరో : జీహెచ్ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసిన అభ్యర్థులు ప్రచారంలో చేసిన ఖర్చుల లెక్కలు చూపించడం లేదు. ఓడినవారు లెక్కలు సమర్పించడంలో నిర్లక్ష్యం చేస్తుంటే గెలిచిన వారు సంబురంలో మర్చిపోతున్నారు. నిబంధనల ప్రకారం ఖర్చు వివరాలను 45 రోజుల్లో ప్రకటించకుంటే అనర్హత వేటు పడనుంది. గతంలో దాదాపు 18 మంది సర్పంచ్​లు, 945 మంది వార్డు సభ్యులు పదవులను కోల్పోగా, మరో 1800 మంది మూడేండ్ల పాటు ఎన్నికల్లో పోటీ చేయకుండా అనర్హత వేటుకు గురయ్యారు. తాజాగా గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో పోటీ చేసిన 1122 మంది కూడా లెక్కలు చూపించడం లేదు. ఇప్పటికే నెల రోజులు గడిచాయి. అయినా ఒక్కరు కూడా లెక్క చూపించడం లేదు. వాస్తవంగా ప్రచారంలో చేసిన ఖర్చును రోజువారీగా అభ్యర్థులను ప్రతిపాదించిన వారిలో ఒకరు లెక్క వివరాలను సమర్పించాల్సి ఉంటుంది. కానీ ఒక్కటీ, రెండు రోజులకే లెక్కలిచ్చి తర్వాత మర్చిపోయారు.

కోట్లల్లోనే ఖర్చు..

జీహెచ్​ఎంసీ ఎన్నికల్లో పోటీ చేసే అభ్యర్థికి ప్రచార వ్యయ పరిమితి రూ. 5 లక్షలుగా నిర్ధారించారు. దేనికి ఎంతెంత లెక్క ఉంటుందనే వివరాలిచ్చారు. కొన్నిచోట్ల ఎన్నికల వ్యయ పరిశీలకులు వివరాలను అభ్యర్థుల ప్రచారంలో జత చేశారు. కానీ కొంతమంది ఇవ్వకపోవడంతో ప్రచార పరిశీలకులు ఆయా జెండాలు, గుర్తులు, కండువాలతో ప్రచారంపై అంచనా వేసుకుని ఖర్చు వివరాలను వారి ఖాతాల్లో జమ చేశారు. వాస్తవంగా అభ్యర్థుల నుంచి అధికారికంగా లెక్కలు రావాల్సి ఉంటోంది. అలా వచ్చిన లెక్కల జాబితాలో పరిశీలకులు గుర్తించిన ఖర్చును చూపించకుంటే వీటిని అదనంగా వాటికి జమ చేస్తారు. నిజానికి గ్రేటర్​ ఎన్నికల్లో అభ్యర్థులు కోట్లు కుమ్మరించారు. పలుచోట్ల లక్షల సొమ్ము పట్టుబడింది. కానీ అవన్నీ అనధికారిక లెక్క. అది ఎవరి సొమ్ము అనేది స్పష్టం ఉండదు కాబట్టి ఎన్నికల సంఘం కూడా పరిగణలోకి తీసుకోదు. దీంతో పరిశీలకులు గుర్తించిన వాటితో పాటుగా అభ్యర్థులు ఇచ్చిన ఖర్చు వివరాలనే పరిగణలోకి తీసుకుంటారు.

లెక్కల్లేవ్​..

ఎన్నికలు ముగిసి నెల దాటింది. గెలుపోటములు తేలిపోయాయి. ఎవరి పనుల్లో వారు నిమగ్నమయ్యారు. కానీ ప్రచారం కోసం వెచ్చించిన ఖర్చుల మాత్రం పట్టించుకోవడం లేదు ఎవరూ వివరాలివ్వడం లేదు. ఒక్కో అభ్యర్థి ప్రత్యేక ఖాతాను కూడా తీశారు. ఆ ఖాతా నుంచే ప్రచార వ్యయాన్ని వెచ్చించాలని నిబంధనల్లో పేర్కొన్నారు. కేవలం 120 మంది మాత్రం తొలి మూడు రోజుల ఖర్చు వివరాలను సమర్పించారు. ఆ తర్వాత వారు కూడా ఇవ్వలేదు. అయితే ఎన్నికల ప్రక్రియ ముగిసిన తర్వాత 45 రోజుల వ్యవధి ఉంటోంది. దీంతో తర్వాత ఇవ్వాలనే ధీమాతో ఉంటున్నారు. మరికొంతమంది అసలు పట్టించుకోవడమే లేదు.

ఇవ్వకుంటే ముప్పే..

ఎన్నికల సంఘానికి ఖర్చులు వివరాలు అందించకపో తే మూడేళ్ల వరకు ఎన్నికల్లో పోటీ చేయడానికి వీల్లేదు. 2016లో జరిగిన ఎన్నికల్లో దాదాపు 1800 మంది ఎన్నికల వ్యయ వివరాలను సకాలంలో అధికారులకు సమర్పించలేదు. దీంతో వీరిపై 2019లో నిర్ణయం తీసుకుని అనర్హత వేటు వేశారు. వీరిలో కొందరు 2021 వరకు, 2022 వరకు మరికొంతమంది ఎన్నికల్లో పోటీ చేసే అవకాశాన్ని కోల్పోయారు. ప్రస్తుతం చాలా మంది ఓడిన అభ్యర్థులు వివరాలు ఇవ్వలేదు. గెలిచినా, ఓడిపోయినా ఖర్చు వివరాలు అందించాల్సిందే. వివరాలు చూపించని వారిపై ఆయా ఎన్నికలు వచ్చే సమయంలోనే వేటు వేసే అవకాశాలుంటాయి.

ఈ నెల 19 వరకు ఛాన్స్​..

గ్రేటర్​ హైదరాబాద్​ ఎన్నికల్లో పోటీ చేసిన వారంతా ఈ నెల 19 వరకు ఎన్నికల ఖర్చు వివరాల్సిందే. ఇప్పటికే ఎన్నికల సంఘం నోటీసులు కూడా జారీ చేసింది. ఈ నెల 8న అబ్జర్వర్లతో సమావేశాన్ని కూడా ఏర్పాటు చేసింది. ఈ సమావేశంలో వార్డుల వారీగా వివరాలను ఫైనల్​ చేయనున్నారు. ఆ తర్వాత ఖర్చు లెక్కలిచ్చిన వారి నివేదికలను పరిశీలించి వ్యయాన్ని నిర్ధారించనున్నారు. ఒకవేళ లెక్కల వివరాలు ఇవ్వకుంటే వేటు వేసేందుకు నిర్ణయం తీసుకోనున్నారు. గెలిచిన అభ్యర్థులు ప్రచార వ్యయాన్ని చూపించకుంటే అనర్హత వేటు పడనుంది.

Advertisement

Next Story