చెత్త తరలించే వాహనాల్లో మృతదేహాలు

by Shamantha N |   ( Updated:2021-04-14 21:39:27.0  )
చెత్త తరలించే వాహనాల్లో మృతదేహాలు
X

రాయ్‌పూర్ : వెళ్లిపోయిందనుకున్న మహమ్మారి తిరగబడి దేశాన్ని మరోసారి ప్రమాదంలో నెట్టుతున్న తరుణంలో వెలుగుచూస్తున్న దారుణాలు ఆవేదనకు గురి చేస్తున్నాయి. కరోనా మరణాలను దాస్తున్న ప్రభుత్వాలు.. మృతి చెందినవారిని కనీసం గౌరవంగా కూడా సాగనంపడం లేదు. అసలే శ్మశానాలలో చోటు దొరక్క, కాల్చడానికి బయట అనుమతుల్లేక మృతుల బంధువులు నానా అవస్థలు పడుతుంటే.. వారిని శ్మశనానికి తరలించే ప్రక్రియ కూడా కన్నీళ్లను తెప్పిస్తున్నది. ఛత్తీస్‌గఢ్‌లో కరోనా మృతదేహాలను తరలించడానికి అంబులెన్సులు, ఇతర వాహనాలు లేక చెత్త తరలించే వాహనాల్లో తీసుకెళ్తుండటం గమనార్హం. కరోనా కారణంగా ఛత్తీస్‌గఢ్ ఎదుర్కొంటున్న దుస్థితికి ఈ ఘటన సజీవ సాక్ష్యం.

ఛత్తీస్‌గఢ్ లోని రాజ్‌నందగావ్ లో చోటు చేసుకుంది ఈ ఘటన. కరోనా బారిన పడి మరణించిన వారిని శ్మశానాలకు తరలించడానికి అంబులెన్సులు లేక వారిని చెత్తను తీసుకెళ్లే వాహనాల్లో తరలించారు మున్సిపాలిటీ సిబ్బంది. డోంగర్‌గావ్ కొవిడ్ కేర్ సెంటర్ లో చేరిన అక్కా చెల్లెళ్లతో పాటు మరో ముగ్గురు బాధితులు చేరారు. ఆక్సిజన్ అందక రెండ్రోజుల క్రితం వీరిలో నలుగురు మరణించారు. కానీ వారి మృతదేహాలను తరలించడానికి ఆస్పత్రిలో తగిన అంబులెన్సులు లేకపోవడంతో అధికారులు ఈ చర్యకు ఒడిగట్టారు. రాష్ట్రంలో వైద్య సదుపాయాల కొరతను ఈ ఘటన ఎలుగెత్తి చూపుతున్నది.

Advertisement

Next Story

Most Viewed