నల్గొండలో కానరాని ఫ్రెండ్లీ పోలీసింగ్

by Shyam |   ( Updated:2020-08-19 20:10:38.0  )
నల్గొండలో కానరాని ఫ్రెండ్లీ పోలీసింగ్
X

దిశ ప్రతినిధి, నల్లగొండ : ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ఫ్రెండ్లీ పోలీసింగ్ ఎక్కడా కానరావడం లేదు. పోలీసు శాఖలో కొంత మంది దిగువస్థాయి అధికారులు అధికార పార్టీ నేతల ఒత్తిళ్లకు తలొగ్గి పనిచేస్తున్నారు. వారు హుకుం జారీ చేస్తే చాలు.. న్యాయం కోసం పోలీసు స్టేషన్‌కు వెళ్లేవారిపై దాడులకు దిగుతున్నారు. ఇటీవల ఉమ్మడి జిల్లాలో వివిధ పోలీసు స్టేషన్లలో అధికారులు వ్యవహరిస్తున్న తీరు విమర్శలకు తావిస్తోంది. స్థానిక నేతలు, కొంతమంది పోలీసులు కుమ్మకై ప్రత్యర్థులను ఇరకాటంలో పెట్టడమే కాకుండా చట్టాన్ని ధిక్కరించి దాడులకు దిగుతుండటం చర్చనీయాంశంగా మారింది.

జిల్లాలో ఈ ఏడాది కాలంగా పోలీసుల తీరు వివాదస్పదంగా ఉంటున్నది. స్టేషన్ వచ్చే వారితో పోలీసులు సరిగ్గా బిహేవ్ చేయడం లేదనే ఆరోపణలు వెల్లువెత్తుతున్నాయి. దీనిపై విచారణ చేపట్టిన అధికారులు పలువురిపై ఇటీవల క్రమశిక్షణ చర్యలు కూడా తీసుకున్నారు. అయినా వారిలో ఎటువంటి మార్పు రావడం లేదు. తాజాగా ఓ భూ సంబంధిత విషయమై ఫిర్యాదు చేసేందుకు స్టేషన్‌కు వచ్చిన బాధితుడిపై సూర్యాపేట జిల్లా నాగారం మండల ఎస్ఐ విచక్షణ రహితంగా కొట్టి గాయపరిచాడు. ఇలాంటి ఘటనలు ఉమ్మడి జిల్లా వ్యాప్తంగా అనేకం చోటుచేసుకున్నాయి.

ఎస్సై అరాచకం..

సూర్యాపేట జిల్లాలోని నాగారాం ఎస్‌ఐ లింగం సివిల్ కేసులో తలదూర్చడమే కాకుండా, న్యాయం చేయాలంటూ ఆశ్రయించిన రైతులపైనే దౌర్జన్యం చేశారు. వారిని లాఠీతో చితకబాదడమే కాకుండా చెప్పినట్టు వినకుంటే ప్రాణాలు తీస్తానని బెదిరించాడు. దీంతో రైతులు జిల్లా ఎస్పీ భాస్కర్ ఫిర్యాదు చేయడంతో విషయం వెలుగుచూసింది. రైతులపై దాష్టికానికి దిగిన ఎస్ఐ లింగంపై గతంలో కూడా అనేక ఆరోపణలు వచ్చినట్టు తెలుస్తోంది. శాఖాపరమైన చర్యలు తీసుకున్నా కూడా ఆయన తీరులో ఏ మాత్రం మార్పు రాలేదు.

వివాహితపై వేధింపు..

ఏఆర్ నుంచి సివిల్‌కు బదిలీపై వచ్చిన ఓ అధికారి నల్లగొండ జిల్లా నకిరేకల్ పోలీస్ స్టేషన్లో విధులు నిర్వహిస్తున్నాడు. సంసారంలో ఇబ్బందులు, ఇద్దరు పిల్లలను వదిలి భర్త సూర్యాపేటకు వెళ్లిపోగా ఆ మహిళ నకిరేకల్‌లో ఒంటరిగా ఉంటోంది. భర్త కోసం ఆమె పోలీస్ స్టేషన్ మెట్లెక్కింది. 50 ఏళ్ల వయసున్న ఆ ఖాకీ అధికారి నీ సంసారాన్ని చక్కబెడతా, ఎలాంటి బెంగ వద్దు అంటూ మాటలతో నమ్మించాడు. ఏ ఇబ్బంది వచ్చినా ఫోన్ చేయి, నీ కుటుంబంలో ఓ మనిషి అనుకో అంటూ మాయమాటలు చెప్పాడు.

కొద్దికాలం తరువాత తన లైంగిక వాంఛ తీర్చాలని వేధించడం మొదలు పెట్టాడు. చివరికి ఆమె పుట్టింటి వారు నకిరేకల్‌లోని అధికార పార్టీ ప్రజాప్రతినిధిని ఆశ్రయించారు. శనివారం ఆ ప్రజాప్రతినిధి తన క్యాంపు కార్యాలయానికి పోలీసు అధికారిని పిలిపించి, సెల్ ఫోన్ రికార్డులు వినిపించారు. సదరు అధికారి తప్పయిందని అందరి ముందు ఒప్పుకోగా, ఆ మహిళ చెప్పుదెబ్బలతో సత్కారం చేసి వదలి పెట్టింది. అనంతరం విషయం తెలుసుకున్న పోలీసు ఉన్నతాధికారులు సదరు అధికారిపై శాఖాపరమైన చర్యలు తీసుకున్నారు.

భూవివాదంలో సీఐ, ఎస్ఐ

నార్కట్‌పల్లి మండలంలోని అమ్మనబోలు గ్రామంలో కాసం సత్యనారాయణ వద్ద మోత్కూరు మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామానికి చెందిన అంబటి నర్సయ్య, బండ యాదయ్య 10.02 ఎకరాల భూమిని రూ.24లక్షలకు ఎకరం చొప్పున కొనుగోలు చేశారు. అదే భూమిని చేర్యాలకు చెందిన పెద్ది ప్రశాంత్‌కు రూ. 27లక్షలకు ఎకరం చొప్పున అమ్ముకున్నారు. 25 శాతం డబ్బు చెల్లించి 2019 ఏప్రిల్‌ 20న అగ్రిమెంట్‌ చేసుకున్న ప్రశాంత్‌ వాయిదా ప్రకారం 90 రోజుల్లో మిగతా డబ్బు చెల్లించి రిజిస్ట్రేషన్‌ చేయించుకోలేదు.

ఈ వివాదం ఇలా ఉండగా, మున్సిపాలిటీ పరిధిలోని కొండగడప గ్రామంలో గత సంక్రాంతి పండుగకు గ్రామ దేవత ముత్యాలమ్మకు బోనం చెల్లింపు సందర్భంలో అంబటి నర్సయ్య అతడి పాలివారైన అంబటి చంద్రయ్య మధ్య ఘర్షణ జరిగింది. ఇరువర్గాలు మోత్కూరు పోలీస్‌ స్టేషన్‌లో కేసులు పెట్టుకున్నారు. గ్రామ పెద్దల సమక్షంలో రాజీపడి ఫిబ్రవరి 8న కేసు కొట్టేయించుకోవడానికి రామన్నపేట కోర్టులో నిర్వహించిన లోక్‌ అదాలత్‌కు వెళ్లారు.

రామన్నపేట సీఐ ఏవీ రంగా, మోత్కూరు ఎస్సై హరిప్రసాద్‌ జోక్యం చేసుకొని అమ్మనబోలు భూమి తగాద పరిష్కరించుకుంటేనే ఈ కేసు రాజీ కుదురుతుందని లింకు పెట్టారు. పథకం ప్రకారం కేసు కొట్టేయ్యకుండా చేశారని బాధితుడు అంబటి నర్సయ్య సీపీని ఆశ్రయించారు. దీనిపై జూలై 14న అడిషనల్‌ సీపీ విచారణ జరిపి ఇచ్చిన నివేదిక ఆధారంగా సీపీ మహేశ్‌ భగవత్‌ సీఐ రంగా, ఎస్సై హరిప్రసాద్‌లను రాచకొండ కమిషనరేట్‌కు అటాచ్‌ చేశారు.

నో రూల్స్..

ఉమ్మడి జిల్లాలోని పోలీసు స్టేషన్లలో ఫ్రెండ్లీ పోలీసింగ్ అమలు చేస్తున్నామని ఆ శాఖ ఉన్నతాధికారులు ప్రచారాలు చేస్తున్నారే తప్ప.. అలాంటి పరిస్థితులు పోలీసు స్టేషన్లలో కానరావడం లేదు. సమస్యలు చెప్పుకునేందుకు పోలీసు స్టేషన్‌కు వచ్చే వారికి న్యాయం చేయకపోగా, నేతల దన్నుతో వారి ఆదేశాలను పాటిస్తూ ఎదురు దాడులకు దిగుతున్నారు.

గతంలో పోలీసు స్టేషన్‌కు వచ్చే వారిని ఫ్రంట్ ఆఫీసులో ఒక మహిళా కానిస్టేబుల్‌ను అందుబాటులో ఉంచి వారే ఫిర్యాదు నమోదు చేసుకునేవారు. కానీ ప్రస్తుతం జిల్లాలో ఎక్కడా ఫ్రంట్ ఆఫీసులే లేవు. ప్రతి ఫిర్యాదుదారుడికి ఎఫ్ఐఆర్ నమోదు చేయకముందే ఫిర్యాదు స్వీకరించినట్టు రశీదు ఇవ్వాల్సి ఉంటుంది. కానీ అదెక్కడా అమలు కావడం లేదు. ఇప్పటికైనా పోలీసులు తమ తీరును మార్చుకోవాలని ప్రజలు కోరుతున్నారు.

Advertisement

Next Story

Most Viewed