టీవీలు, రీఫ్రిజిరేటర్లు కొనేవారికి షాక్..

by Harish |
టీవీలు, రీఫ్రిజిరేటర్లు కొనేవారికి షాక్..
X

దిశ, వెబ్‌డెస్క్ : 2020-21 ఆర్థిక సంవత్సరం ముగుస్తున్న వేళ దేశవ్యాప్తంగా టెలివిజన్లు, రీఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ వంటి గృహోపకరణాల ధరలు పెరగనున్నాయి. ఇప్పటికే పలు కంపెనీల ధరల పెంపుపై స్పష్టత ఇచ్చాయి. తాజాగా, అంతర్జాతీయ మార్కెట్లో ఎలక్ట్రానిక్ వస్తువులకు భారీగా కొరత ఏర్పడే అవకాశాలున్నాయని, దీనివల్ల గృహోపకరణాల ధరలపై భారం పడవచ్చని కంపెనీల అధికారులు చెబుతున్నారు. ఇటీవల జరిగిన అంతర్జాతీయ అప్లయెన్స్, ఎలక్ట్రానిక్స్ ఎక్స్‌పోలో పలు దిగ్గజ కంపెనీలు ఈ అభిప్రాయాన్ని వ్యక్తపరిచాయి. రానున్న రోజుల్లో ఎలక్ట్రానిక్ వస్తువుల కొరత వల్ల పలు ఉపకరణాల రేట్లు పెరుగుతాయని వర్ల్‌పూల్ కార్పొరేషన్ ప్రెసిడెంట్ జాసన్ ఐ చెప్పారు.

అంతర్జాతీయంగా ఎలక్ట్రానిక్ చిప్‌ల కొరత అత్యధికంగా ఉంది. దీనివల్ల రీఫ్రిజిరేటర్, మైక్రోవేవ్ ఉత్పతులపై ప్రభావం ఉంటుందని జాసన్ ఐ స్పష్టం చేశారు. ఇదివరకు కార్ల కంపెనీలో ఉత్పత్తికి, ఆ తర్వాత స్మార్ట్‌ఫోన్ తయారీని దెబ్బతీసిన చిప్‌లు ఇప్పుడు గృహోపకరణాల ఉత్పత్తికి అవసరమైన స్థాయిలో డిమాండ్‌ను తీర్చలేకపోతున్నాయని జాసన్ పేర్కొన్నారు. ప్రపంచంలోనే అతిపెద్ద గృహోపకరణాల కంపెనీల్లో ఒకటైన వర్ల్‌పూల్ ఇటీవల చిప్‌ల కొరత కారణంగా ఎగుమతులు తగ్గినట్టు వెల్లడించింది.

ఈ కంపెనీ ఉత్పత్తిలో ఎలక్ట్రానిక్ పరికరాల కొరత వల్ల 25 శాతానికి పైగా ఎగుమతులు క్షీణించాయని కంపెనీ పేర్కొంది. పరిస్థితి ఇలాగే ఉంటే రానున్న రోజుల్లో ఇది మరింత ఇబ్బందికరంగా ఉండనున్నట్టు కంపెనీ అభిప్రాయపడింది. గతేడాది కరోనా నేపథ్యంలో స్మార్ట్‌ఫోన్లు, ల్యాప్‌టాప్‌ల కొనుగోళ్లు భారీగా పెరిగాయి. దీంతో ఎలక్ట్రానిక్స్ చిప్‌ల కొరత ఏర్పడింది. రీఫ్రిజిరేటర్లు, మైక్రోవేవ్ వంటి ఇతర ఎలక్ట్రానిక్ ఉత్పత్తులకు అవసరమైన స్థాయిలో ప్రాసెసర్లు, మైక్రో కంట్రోలర్లను అందించడంలో కంపెనీలు ఆలస్యాన్ని ఎదుర్కొన్నాయి.

Advertisement

Next Story

Most Viewed