అటెండర్ జాబ్ ఇవ్వండి.. అంతర్జాతీయ క్రికెటర్ ఆవేదన

by Shyam |
అటెండర్ జాబ్ ఇవ్వండి.. అంతర్జాతీయ క్రికెటర్ ఆవేదన
X

దిశ, స్పోర్ట్స్: ఒక అంతర్జాతీయ క్రికెటర్ అటెండర్ జాబ్ అడగటమేంటి? మామూలు ఫస్ట్ క్లాస్ క్రికెట్ ఆడిన వాళ్లే రూ.లక్షల్లో సంపాదిస్తుంటే అంతర్జాతీయ క్రికెట్ ఆడిన వ్యక్తి అటెండర్ ఉద్యోగం ఎందుకు అడుగుతున్నాడని మీ అనుమానంగా ఉంది కదూ. అవును, అతను అంతర్జాతీయ క్రికెటరే. కానీ దివ్యాంగుల క్రికెట్ ఆడే క్రీడాకారుడు. హర్యాణాలోని సోనేపట్‌కు చెందిన దినేష్ సెయిన్ పుట్టుకతోనే పోలియో బాధితుడు. కానీ, క్రికెట్‌లో ఉన్న ఆసక్తితో ఆటలో మంచి ప్రతిభకనపరిచాడు. 2011 నుంచి 2019 మధ్య కాలంలో 9 అంతర్జాతీయ మ్యాచ్‌లు ఆడాడు. అతను భారత్ తరపున కొన్ని మ్యాచ్‌లకు కెప్టెన్‌గానూ వ్యవహరించాడు. జాతీయ జట్టుకు ప్రాతినిథ్యం వహించినా తాను మాత్రం పేదరికం నుంచి బయటపడలేక పోయాడు. దీంతో తన కుటుంబాన్ని పోషించుకునేందుకు ఒక ఉద్యోగం ఇప్పించాలని కోరుతున్నాడు. జాతీయ డోపింగ్ నిరోధక సంస్థ (నాడా)లో అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేశానని.. తనకు ఆ ఉద్యోగం వచ్చేలా చూడాలని అధికారులను కోరుతున్నాడు. ‘ఇంతకు మునుపు జిల్లా కోర్టు అటెండర్ ఉద్యోగానికి దరఖాస్తు చేసినా ఎంపిక కాలకపోయాను. తాను ఐటీఐ చదివాను.. కానీ గుమాస్తా ఉద్యోగం అయితే చేయగలను. తన భార్య, కొడుకు పోషణార్థం ఉద్యోగం తప్పని సరిగా కావాలి’ అని అతడు కోరుతున్నాడు. ప్రస్తుతం దినేష్ ఒక చిన్న కిరాణా దుకాణాన్ని నడుపుతున్నాడు. కానీ దాని ద్వారా వచ్చే ఆదాయం అతని కుటుంబానికి ఏ మాత్రం సరిపోవడం లేదు.

Advertisement

Next Story