2023లో టీఆర్ఎస్‌ను బొంద పెట్టుడే : ఈటల

by Shyam |
etala-rajender 1
X

దిశ, జమ్మికుంట : త్వరలో జరగనున్న ఉప ఎన్నికల్లో హుజురాబాద్ ప్రజలు సీఎం కేసీఆర్‌కు తగిన గుణపాఠం చెప్తారని, 2023లో జరిగే ఎన్నికల్లో కేసీఆర్ అహంకారానికి ప్రజలు గోరి కడతారని మాజీ మంత్రి, బీజేపీ నాయకులు ఈటల రాజేందర్ అన్నారు. కాషాయ కండువా కప్పుకున్న తర్వాత తొలిసారిగా ఈటల జమ్మికుంటకు రావడంతో పెద్ద సంఖ్యలో కార్యకర్తలు, నాయకులు, అభిమానులు తరలివచ్చారు. మొదటగా పట్టణ శివారులోని శివాజీ విగ్రహానికి, మోతుకుల గూడెం వద్ద అంబేద్కర్ విగ్రహానికి, గాంధీ చౌరస్తాలోని గాంధీ విగ్రహానికి పూలమాలలు వేసిన అనంతరం అక్కడ నుండి మండలంలోని నాగారం గ్రామానికి చేరుకుని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఆ తర్వాత విలేకరులతో సమావేశంలో మాట్లాడుతూ.. పోలీసు నిర్బంధాలు, ప్రలోభాలతో ప్రజలను భయపెట్టే ప్రయత్నం చేస్తే ఖబర్దార్ అని ప్రభుత్వ తీరుపై హెచ్చరించారు. హుజురాబాద్ ప్రజలు ప్రేమకు లొంగుతారని, దబాయింపులకు లొంగరని విమర్శించారు.

ఇక ముందు కూడా టీఆర్ఎస్ పాలన ఇలాగే కొనసాగితే, ప్రజల ఆగ్రహానికి గురికాక తప్పదని మండిపడ్డారు. చిలక పలుకులు పలికే మంత్రులు, ఎమ్మెల్యేలు ప్రగతి భవన్ స్క్రిప్ట్‌లను చదివితే ప్రజలు నమ్మరని ఆగ్రహం వ్యక్తంచేశారు. 2004 ఎన్నికల్లో కరీంనగర్ జిల్లా టీఆర్ఎస్‌కు అండగా ఉండగా, హుజురాబాద్ ఊపిరి పోసిందని గుర్తుచేశారు. రానున్న ఎన్నికల్లో నియోజకవర్గ ప్రజలు టీఆర్ఎస్ ప్రభుత్వాన్ని బొంద పెడతారన్నారు. శుక్రవారం నుండి ఇంటింటికీ వెళ్లి ప్రజల కష్టసుఖాలు తెలుసుకుంటానన్నారు. కాగా, జమ్మికుంట మున్సిపల్ వైస్ చైర్మన్ దేశిని స్వప్న ఆధ్వర్యంలో కొత్తపెళ్లిలో భారీగా తరలి వచ్చిన మహిళలు మంగళ హారతులతో ఘనస్వాగతం పలికారు. ఈటల వెంట దుబ్బాక ఎమ్మెల్యే రఘునందన్ రావు, మాజీ ఎంపీ వివేక్, బీజేపీ నాయకుడు స్వామి గౌడ్, జిల్లా అధ్యక్షుడు గంగా డి.కృష్ణారెడ్డి వివిధ గ్రామాల నాయకులు, కార్యకర్తలు పాల్గొన్నారు.

Advertisement

Next Story

Most Viewed