‘న్యాయవ్యవస్థపై కుట్ర’ కేసు మూసివేత

by Shamantha N |
Former CJI Ranjan Gogoi
X

న్యూఢిల్లీ: మాజీ సీజేఐ రంజన్ గొగోయ్‌ను లైంగిక ఆరోపణల కేసుల్లో ఇరికించే అతిపెద్ద కుట్రకు ఆస్కారముందని సుప్రీంకోర్టు ప్రారంభించిన విచారణను నిలిపేస్తున్నట్టు గురువారం ప్రకటించింది. జస్టిస్ రంజన్ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలను విపరీతంగా ప్రచారం చేసిన నేపథ్యంలో ‘న్యాయవ్యవస్థపై కుట్ర’ను విచారించడానికి సుప్రీంకోర్టు 2019లో సుమోటుగా స్వీకరించింది. ఈ కేసు మొదలుపెట్టి రెండేళ్లు గడిచినందున సరిపడా ఆధారాలు సేకరించడం కష్టతరంగా మారిందని జస్టిస్ సంజయ్ కిషన్ కౌల్ సారథ్యంలోని జస్టిస్ ఏఎస్ బోపన్నా, జస్టిస్ వీ రామసుబ్రమణియన్‌ల ధర్మాసనం అభిప్రాయపడింది. కుట్రకు సంబంధించి వాట్సాప్ సందేశాలను, రికార్డులను రిటైర్డ్ జస్టిస్ ఏకే పట్నాయక్ ప్యానెల్ సమకూర్చుకోలేకపోతున్నదని వివరించింది.

ఇలాంటి సందర్భంలో సుమోటు కేసు విచారణను కొనసాగించడం అర్థరహితమని పేర్కొంది. సుప్రీంకోర్టులో 2014 మేలో జాయిన్ అయిన ఓ మహిళా వర్కర్ 2018 అక్టోబర్‌లో అప్పటి సీజేఐ గొగోయ్‌పై లైంగిక ఆరోపణలు చేశారు. ఈ ఆరోపణలను సుప్రీంకోర్టు సెక్రెటరీ జనరల్ కొట్టివేశారు. సీజేఐ కార్యాలయాన్ని పూర్తిస్థాయిలో పనిచేకుండా చేసే చర్య అని, న్యాయవ్యవస్థ స్వతంత్రతను దెబ్బతీసే కుట్ర అని గొగోయ్ వ్యాఖ్యలుచేశారు. అనంతరం విచారణకు ఏర్పాటు చేసిన అంతర్గత కమిటీ గొగోయ్‌కు క్లీన్ చిట్ ఇచ్చింది. తనకు న్యాయపరమైన ప్రతినిధులను ఇవ్వలేదని పేర్కొంటూ సదరు మహిళా ఈ కమిటీ దర్యాప్తు మధ్యలో నుంచే తప్పుకోవడం గమనార్హం.

Advertisement

Next Story

Most Viewed