హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం

by Shyam |
హిందుత్వానికి వ్యతిరేకంగా ప్రచారం
X

దిశ, హైదరాబాద్: దేశంలో హిందుత్వానికి వ్యతిరేకంగా కొందరు భావితరాల్లో విషబీజాలు నాటుతున్నారని ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ మాజీ డీజీపీ అరవింద్ రావు అన్నారు. నేటి సమాజంలో అర్చక, పురోహితులు లేని గ్రామాలు దర్శనమివ్వడం చాలా బాధాకరమని ఆవేదన వ్యక్తం చేశారు. గ్రామీణ ప్రాంతాల్లో కూడా మతమార్పిడి మాఫియా చెలరేగి పోతుందన్నారు. సామ, దాన, బేద, దండోపాయాలతో మత మార్పిడి చర్యలకు కొన్ని అరాచక శక్తులు పాల్పడుతున్నాయని వివరించారు. ప్రతి హిందువూ భగవద్గీతను చదవాలని, ఒకసారి భగవద్గీతను చదివి అర్థం చేసుకుంటే ఎట్టి పరిస్థితిల్లోనూ మతం మారే అవకాశం లేదని అభిప్రాయపడ్డారు. కోఠిలోని విశ్వహిందూ పరిషత్ రాష్ట్ర కార్యాలయాన్నిఅరవింద రావు మంగళవారం సందర్శించారు. ఈ సందర్భంగా ఆయన మాట్లాడుతూ..తన జీవితంలో మొట్టమొదటి సారి VHP కార్యాలయంలో అడుగు పెట్టడం సంతోషంగా ఉందన్నారు. ఓవైపు ముస్లింలు, మరోవైపు క్రైస్తవులు ప్రపంచాన్నే తమ మతాలతో కప్పివేయడానికి పోటీపడి ప్రచారం చేస్తున్నాయని చెప్పుకొచ్చారు. హైందవ జీవన విధానాన్నిఅణువణువునా వ్యతిరేకిస్తూ కొన్ని శక్తులు భావితరాల మెదళ్ళలో విషం నింపుతున్నాయని నొక్కి చెప్పారు. హిందుత్వంలో ఎక్కడా కులాల మధ్య తారతమ్యాలు కనిపించవని కానీ, ఒక్కటిగా ఉన్న హిందువులను విభజించేందుకు కులాల ప్రస్తావన తీసుకువచ్చి చిచ్చు పెడుతున్నారని పేర్కొన్నారు. అవకాశం ఉన్న ప్రతి దగ్గర హిందూ అమ్మాయిలను ప్రేమపేరుతో మోసం చేసి, దారుణాలకు పాల్పడుతున్నారని ఆవేదన వ్యక్తం చేశారు.

అహింస, నైతికతతోనే హిందుత్వం

హింస, అనైతికం ఆధారంగా ఇతర మతాలు పనిచేస్తున్నాయని.. అహింస, నైతికత పేరుతోనే హిందుత్వం పనిచేస్తుందని అరవింద రావు చెప్పారు. ఒక మతాన్నినాశనం చేసి, తమ మతమే గొప్పదని చెప్పుకునే వాళ్లే దాడులకు తెగబడుతున్నారని వివరించారు. శాంతి, అహింస, నీతి, విశ్వాసం అనేవి హిందుత్వానికి మూలాధారాలు అన్నారు. హిందువుల్లో ఎందరో దేవుళ్ళు ఉన్నా కూడా, అందరినీ సమన్వయపరుస్తూ వారి వారి పద్ధతులతో, ఆరాధిస్తూ పూజించడం గొప్ప విషయమన్నారు.

ఇంటలెక్చువల్స్ ఫి‌టెనెస్ సాధించాలి

ప్రతి హిందువూ భగవద్గీత, రామాయణంతో పాటు చరిత్రను ఇతర విషయాలను తప్పకుండా అవగాహన పరుచుకోవాలని, అందుకు అధ్యయనం తప్పనిసరి అని మాజీ డీజీపీ సూచించారు. నేడు పాఠ్యాంశాల్లో ఔరంగజేబు గొప్పతనం గురించి రాస్తున్నారని, టిప్పు సుల్తాన్‌ను కీర్తిస్తూ పాఠ్యాంశాలు ముద్రిస్తున్నారని అరవింద రావు ఆవేదన వ్యక్తం చేశారు. వాస్తవానికి 1590లోనే గోవాలో హిందువులపై ఊచకోత ప్రారంభమైందని, కేరళలో బ్రాహ్మణ వర్గానికి చెందిన నాయర్లను కనుమరుగు చేశారన్నారు.

కమ్యూనిస్టుల ఎజెండా “ఎడిట్- ప్రాప్ “

ఇంటలెక్చువల్ డెవలప్మెంట్ సాధించలేకపోతే “ఎడిట్ – ప్రాప్” సమస్యలు ఎదుర్కోవాల్సి వస్తుందన్నారు. ఎడిట్ ప్రాప్ అంటే కమ్యూనిస్టులు అవలంభించే సిద్ధాంతమన్నారు. ‘‘ఒక విషయాన్ని శ్రద్ధగా చదివి దానిపై అవగాహన పెంచుకోవడం’’ అదేవిధంగా వాస్తవాన్ని అవాస్తవంగా ప్రాపగండా చేయడం కమ్యూనిస్టుల ముఖ్యలక్షణమన్నారు. అనంతరం VHP రాష్ట్ర కార్యదర్శి బండారు రమేష్ ఆయన మెడలో కాషాయ కండువా వేసి ఆత్మీయంగా సత్కరించారు. కార్యక్రమంలో VHP కేంద్రీయ సహ కార్యదర్శి సత్యం, వీహెచ్పీ రాష్ట్ర సహ కార్యదర్శులు జగదీశ్వర్, రాజేశ్వర్ రెడ్డి, ప్రాంత ప్రచార సహ ప్రముఖ్ పగుడాకుల బాలస్వామి, మహా నగర అధ్యక్షుడు శ్రీనివాస రాజా, బజరంగ్ దళ్ స్టేట్ కన్వీనర్ సుభాష్ చందర్, కో- కన్వీనర్లు శివరాం, కుమారస్వామి, గణేష్, రంజిత్, రమణారెడ్డి పాల్గొన్నారు.

Advertisement

Next Story