భారీ అగ్నిప్రమాదం.. సొరంగంలో చిక్కుకున్న ఉద్యోగులు

by Anukaran |   ( Updated:2020-08-20 22:27:40.0  )
భారీ అగ్నిప్రమాదం.. సొరంగంలో చిక్కుకున్న ఉద్యోగులు
X

దిశ ప్రతినిధి, మహబూబ్ నగర్: నాగర్ కర్నూల్ జిల్లా అమ్రాబాద్ మండలం దోమలపెంట శ్రీశైలం ఎడమ గట్టు కాలువ జల విద్యుత్ కేంద్రంలో భారీ అగ్ని ప్రమాదం చోటు చేసుకుంది. షాట్ సర్క్యూట్ కారణంగా విద్యుత్ తయారీ కేంద్రంలో అకస్మాత్తుగా మంటలు చెలరేగాయి. ఒక్కసారిగా మంటలు ఎగిసిపడడంతో దట్టంగా పొగలు అలుముకున్నాయి. దీంతో ఉద్యోగులు అంతా ఒక్కసారిగా బయటకు పరుగులు తీశారు.

ప్రమాదం జరిగినప్పుడు 25 మంది ఉద్యోగులు విధుల్లో ఉండగా 15 మంది సొరంగం నుంచి బయటకు పరుగులు తీశారు. మిగిలిన 9 మంది ఉద్యోగులు సొరంగ మార్గంలోనే చిక్కుకున్నారు. వీరిలో ఏడుగురు జెన్ కో ఉద్యోగులు కాగా ఇద్దరు అమ్రాన్ కంపెనీ సిబ్బంది ఉన్నారు. ఫైర్ సిబ్బంది ఘటనా స్థలానికి చేరుకొని మంటలు ఆర్పే ప్రయత్నం చేస్తున్నారు. విద్యుత్ శాఖ మంత్రి జగదీశ్ రెడ్డి, ఎమ్మెల్యే గువ్వల బాలరాజు, జెన్ కో సీఎండీ ప్రభాకర్ రావు, కలెక్టర్ శర్మన్, ఎస్పీ సాయిశేఖర్ ఘటన స్ధలానికి చేరుకుని పరిశీలిస్తున్నారు. సొరంగంలో చిక్కుకున్న వారిని బయటకు తీసుకొచ్చేందుకు మూడు అత్యవసర దారులు ఉన్నాయని పొగ తగ్గిన తర్వాత వారిని బయటకు తీసుకొచ్చేందుకు ప్రయత్నం చేస్తామని అధికారులు తెలిపారు.

లోపల చిక్కుకున్న వారిలో డీఈ శ్రీనివాస్, వెంకట్రావు, ఏఈలు ఫాతిమా, మోహన్, సుందర్, కిరణ్, రాంబాబుతోపాటు మరో ఇద్దరు హైదరాబాద్ కు చెందిన ప్రైవేట్ ఎలక్ట్రిషన్ ఉద్యోగులుగా అధికారులు గుర్తించారు. అయితే లోపల చిక్కుకున్న వారి కుటుంబ సభ్యులు మాత్రం భారీ పొగ కారణంగా ఏమైనా ప్రమాదం జరిగి ఉంటుందేమోనని ఆందోళన చెందుతున్నారు. విద్యుత్ ఉత్పత్తి నిలిచిపోయింది. కానీ, మంటలు చల్లారిన కూడా సొరంగం నుంచి భారీగా పొగ బయటకు వస్తోంది.

Advertisement

Next Story