- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
వ..ణు..కు పుడుతోంది
దిశ, న్యూస్ బ్యూరో: కేన్సర్ పేషెంట్లకు కరోనా శాపంగా మారింది. నిర్ణీత సమయానికి క్రమం తప్పకుండా చికిత్స పొందాల్సిన ఈ రోగులు కరోనా భయంతో చికిత్సకు దూరంగా ఉంటున్నారు. లాక్‌డౌన్, కరోనా వైరస్ తీవ్రతకు భయపడి మరి కొందరు రోగులు సర్జరీలను వాయిదా వేసుకుంటున్నారు. అలాంటి వాళ్లలో వ్యాధి తీవ్రత పెరిగి మరింత ఇబ్బంది పడుతున్నారు. లాక్‌డౌన్‌లోనైతే రాష్ట్ర సరిహద్దు వరకు వచ్చి హైదరాబాద్‌కు రాలేక తిరిగెళ్లిన వారూ ఉన్నారు. కరోనా నేపథ్యంలో పేషెంట్లకు సహాయకులుగా వచ్చేందుకు ఎవరూ ముందుకు రాని కేసులు కూడా ఉన్నాయి. నగరంలో వైరస్ తీవ్రతకు భయపడి ఆసుపత్రికి వచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఈ నేపథ్యంలో కీమోథెరపీ, సర్జరీలను కూడా ఇచ్చిన తేదీల్లో చేయించుకోవడానికి రాలేకపోయారు. అలాంటి రోగుల్లో క్యాన్సర్ వ్యాధి తీవ్రత పెరిగింది. ట్యూమర్స్ పరిమాణం పెరిగి రోగులను ముప్పుతిప్పలు పెడుతోందని ఓ ఆంకాలజిస్టు ఆవేదన వ్యక్తం చేశారు. వేలాది మంది కేన్సర్ రోగులు, ఆ కుటుంబాలు కరోనా వైరస్‌తో సతమతమవుతున్నారన్నారు.
అన్నీ ఖాళీ..
ప్రస్తుతం హైదరాబాద్‌లోని ప్రభుత్వ, ప్రైవేటు కేన్సర్ ఆసుపత్రులన్నీ బోసిపోయి కనిపిస్తున్నాయి. ఆంకాలజీ విభాగాలన్నీ ఖాళీగా కనిపిస్తున్నాయి. కొత్త రోగులెవరూ ఆసుపత్రులకి వెళ్లేందుకు సాహసించడం లేదు. కేన్సర్ లక్షణాలు ఉన్నా మరికొంత కాలం ఆగుదామంటూ సర్దుకుపోతున్నారని డాక్టర్లు చెబుతున్నారు. ఆధ్యాత్మిక చింతన, మారిన ఆహారపు అలవాట్లతో నెగ్గుకొస్తున్నారన్నారు. ప్రతి ఆసుపత్రిలోనూ ఇప్పుడు కరోనా పాజిటివ్ కేసులు మినహా మరే ఇతర రోగగ్రస్థులు ఉండడం లేదు. అందుకే టాప్ కార్పొరేట్ ఆసుపత్రుల్లోనూ టాప్ కన్సల్టెంట్లతో పాటు 30-40 శాతం వరకు సిబ్బందికి సెలవులు ఇచ్చినట్లు ఓ డాక్టర్ ‘దిశ’కు వివరించారు. కేవలం కొవిడ్-19 పేషెంట్లను చూసుకోగల నర్స్‌లు మాత్రమే డ్యూటీల్లో ఉన్నట్టు తెలిపారు.
సిబ్బందికీ కరోనా వైరస్..
మిగతా వ్యాధిగ్రస్థులకు చికిత్స ఎలాగైనా చేయొచ్చు. కానీ కేన్సర్ రోగులకు మాత్రం తప్పనిసరిగా ముట్టుకోవాల్సిందే. ఎంత జాగ్రత్తలు తీసుకున్నా రోగి తనలోని లక్షణాలను వెల్లడించకపోవడంతో డాక్టర్లకు, టెక్నీషియన్లకు సమస్యగా మారింది. అందుకే హైదరాబాద్ లోని పలు కేన్సర్ ఆసుపత్రి సిబ్బందికి కరోనా పాజిటివ్ ఎక్కువగా వచ్చినట్లు సమాచారం. ఓ ఆసుపత్రిలోనైతే దాదాపు మొత్తం సిబ్బందికి వైరస్ సోకడంతో చికిత్సలకు బ్రేకులు పడ్డాయని తెలిసింది. అతి కష్టమ్మీద 10 సర్జరీలు చేయాల్సిన రోజు సగానికి పరిమితం చేస్తున్నారు. కేన్సర్ రోగులతో పాటు సిబ్బంది కూడా భయపడుతున్నారని ఓ డాక్టర్ చెప్పారు.
చికిత్స మధ్యలో ఆపలేం.. : డా.కృష్ణమోహన్ రావు, సీనియర్ ఆంకాలజిస్టు, బసవతారకం ఇండో అమెరికన్ కేన్సర్ ఆసుపత్రి
కేన్సర్ రోగులకు చికిత్స మధ్యలో ఆపలేం. ఆపితే దాని ప్రభావం ఎక్కువవుతుంది. లాక్‌డౌన్‌లో వారికి సకాలంలో వైద్యం అందలేదు. కరోనా సోకిన రోగులైతే మరింత ఇబ్బంది పడ్డారు. వారిలో ఇమ్యూనిటీ తక్కువ ఉంటుంది. నిర్ణీత సమయంలో సర్జరీ చేయకపోతే వ్యాధి తీవ్రమవుతుంది. ఇప్పుడు రోగి రాగానే కేన్సర్ నిర్ధారిత పరీక్షల కంటే ముందు కొవిడ్-19 పరీక్షలు చేస్తున్నాం.
ఫాలో అప్ కేసులను రావద్దంటున్నాం: – డా.విజయ్ ఆనంద్‌రెడ్డి, డైరెక్టర్, అపోలో కేన్సర్ ఆసుపత్రి
రోజూ 50 కేసులను చూస్తాం. 15దాకా కొత్త కేసులు వస్తాయి. కరోనా వైరస్‌తో కొంత తగ్గాయి. కొత్తగా కేన్సర్ అని తేలిన వాళ్లు 2, 3 నెలలు ఆగుతున్నారు. సమస్య తీవ్రంగా ఉన్నవాళ్లు మాత్రం వస్తున్నారు. మేం కూడా ఫాలో అప్ కేసులను రావద్దంటున్నాం. కేన్సర్ పేషెంట్లలో ఇమ్యూనిటీ చాలా తక్కువ. కీమోథెరపీ చేయించుకుంటున్నవారికి కరోనా సోకితే ఎఫెక్ట్ ఎక్కువగా ఉంటుంది. కేన్సర్ చికిత్స కోసం వచ్చే రోగుల సంఖ్య 30 శాతం పడిపోయింది.