అధికారులకు రైతుల వార్నింగ్.. రైతు ఉద్యమం అంటే ఏంటో చూపిస్తాం

by Shyam |   ( Updated:2023-03-14 07:31:54.0  )
అధికారులకు రైతుల వార్నింగ్.. రైతు ఉద్యమం అంటే ఏంటో చూపిస్తాం
X

దిశ, జనగామ: రెండు మూడు రోజులుగా కురుస్తున్న వర్షాలకు ధాన్యం తడిచి వడ్లు మొలకలు వస్తున్నాయని రైతులు తీవ్ర ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. ఇందులో భాగంగా జనగామ వ్యవసాయ మార్కెట్ గేటు‌కు తాళాలు వేసి నిరసన వ్యక్తం చేసిన ఘటన సోమవారం చోటు చేసుకుంది. ఎన్నో కష్టాలు పడి శ్రమించి పంటలు పండించి చేతికి వచ్చిన పంటను మార్కెట్కు తీసుకువస్తే అధికారులు మార్కెట్ కమిటీ చైర్మన్ వడ్లను కొనుగోలు చేయకుండా నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారని రైతులు ఆవేదన వ్యక్తం చేశారు. దీనిపై రాష్ట్ర ప్రభుత్వం వెంటనే స్పందించి రైతుల కష్టాలను పట్టించుకొని ధాన్యం కొనుగోలు చేయాలని డిమాండ్ చేస్తూ రైతులు ఆందోళన చేపట్టారు.

ఈ క్రమంలో మార్కెట్ యార్డ్ లోపలికి వెళ్తున్న మార్కెట్ కమిటీ చైర్ పర్సన్ విజయను రైతులు అడ్డుకోవడంతో చైర్‌పర్సన్ చేసేది ఏమీ లేక మార్కెట్ నుంచి వేనుదిరిగారు. 24 గంటల్లో రైతుల నుంచి వడ్లు కొనుగోలు చేయని పక్షంలో రైతుల ఉద్యమం అంటే ఏంటో తెలియజేస్తామని ఈ సందర్భంగా రాష్ట్ర ప్రభుత్వాన్ని రైతులు హెచ్చరించారు. వాతావరణ పరిస్థితుల మార్పుల కారణంగా వర్షాలు పడుతుండడంతో రైతులకు తీవ్ర నష్టం వాటిల్లుతుందని, వ్యవసాయ మార్కెట్ యార్డులో రైతులకు కనీస సౌకర్యాలు లేకపోవడం చాలా దారుణమన్నారు. ఒక్క గింజ అయినా వదలకుండా కొంటామన్న రాష్ట్ర ప్రభుత్వం ధాన్యం కొనుగోలు చేయడానికి ఎందుకు నిర్లక్ష్యంగా వ్యవహరిస్తోందని ప్రశ్నించారు. ఈ సంఘటనపై సమాచారం తెలుసుకున్న పోలీసులు ఘటనా స్థలానికి చేరుకొని ఇరువర్గాలను శాంతింప జేశారు.

Advertisement

Next Story