TRS ఎమ్మెల్యేకు చేదు అనుభవం.. పోలీసుల ఎంట్రీతో సీన్ రివర్స్

by Sridhar Babu |   ( Updated:2021-06-22 07:50:06.0  )
TRS-MLA-Mahesh-Reddy
X

దిశ, పరిగి : టీఆర్ఎస్ పరిగి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డికి చేదు అనుభవం ఎదురైంది. పొలాలకు వెళ్లే శాకర కంత రోడ్డును బాగు చేయమంటే పట్టించుకోరా.. అంటూ రాపోల్ గ్రామ రైతులు, కాంగ్రెస్ నాయకులు మహేష్ రెడ్డిని ప్రశ్నించారు. వివరాల ప్రకారం.. మంగళవారం. వికారాబాద్ జిల్లా పరిగి మండలం రాపోల్, చిగురాలపల్లి, సయ్యద్ పల్లి గ్రామాల్లో వైకుంఠధామం, రైతు వేదికను ఎమ్మెల్యే మహేష్ రెడ్డి ప్రారంభించారు. రైతు వేదిక వద్ద ఎమ్మెల్యే మాట్లాడుతూ.. వ్యవసాయాన్ని పండుగలా చేసేందుకు ముఖ్యమంత్రి కేసీఆర్ కృషి చేస్తున్నారన్నారు. అధికారులు గ్రామస్థాయిలో అందుబాటులో ఉండేందుకు ఈ రైతు వేదికలు నిర్మించారన్నారు. వైకుంఠ దామాలతో గ్రామాలలో నెలకొన్న అంత్యక్రియల సమస్య తీరింది అన్నారు.

అనంతరం.. పొలాలకు వెళ్లే శాఖర కంతా రోడ్డు పూర్తిగా అధ్వానంగా తయారైందని రైతులు ఎమ్మెల్యే దృష్టికి తీసుకొచ్చారు. ఈ నేపథ్యంలో శకర కంతా రోడ్డును పరిశీలించేందుకు వెళ్లిన ఎమ్మెల్యే మహేష్ రెడ్డిని.. రాపోల్ గ్రామానికి చెందిన కాంగ్రెస్ నాయకుడు నాగ వర్ధన్, రైతులు అడ్డుకుని.. ఈ విషయాన్ని చాలాసార్లు మీ దృష్టికి తీసుకువచ్చామని, అధికారులకు చెప్పినా ఎందుకు పట్టించుకోవడం లేదని ప్రశ్నించారు. ఈ క్రమంలో మాటా మాటా పెరిగి.. ఎమ్మెల్యే పక్కనే ఉన్న టీఆర్ఎస్ నాయకులు.. మీ కాంగ్రెస్ ఎమ్మెల్యే హయంలో ఏం చేశారు అంటూ ఎదురు ప్రశ్నించారు. దీంతో కాంగ్రెస్, టీఆర్ఎస్ నాయకులు, రైతులకు మధ్య వాగ్వివాదం నెలకొంది.

ఈ వాగ్వివాదం వీడియో తీస్తున్న మీడియా ప్రతినిధులను తీయ వద్దంటూ చేతితో సైగ చేశారు. మీకు కామన్ సెన్స్ ఉందా.? అంటూ.. టీఆర్ఎస్ నాయకులపై ఎమ్మెల్యే మండిపడ్డారు. ఈ క్రమంలో టీఆర్ఎస్, కాంగ్రెస్ నాయకులు ఒకరిపై ఒకరు మాటల యుద్ధం చేసుకున్నారు. దీంతో అక్కడే విధుల్లో ఉన్న పరిగి ఎస్ఐ రమేష్.. రెండు పార్టీల నేతలను సముదాయించారు. అనంతరం అక్కడి నుంచి ఎమ్మెల్యే కొప్పుల మహేష్ రెడ్డి వెళ్లిపోయారు.

Advertisement

Next Story