పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య

by Anukaran |   ( Updated:2020-07-30 05:12:07.0  )
పురుగుల మందు తాగి యువ రైతు ఆత్మహత్య
X

దిశ, గజ్వేల్
నిరుపేదలు సాగు చేసుకునేందుకు గతంలో తెలంగాణ ప్రభుత్వం భూమి పంపిణీ చేసింది. ఆ భూమిలో రైతు వేదిక నిర్మాణం చేపట్టడానికి గ్రామ సర్పంచ్, రెవెన్యూ అధికారులు నిర్ణయించారు. ఆ ఇవ్వాలని కోరగా యువ రైతు నో చెప్పాడు. దీంతో వారి వేధింపులు ఎక్కువయ్యాయి. దీంతో మనస్తాపానికి గురైన ఆ రైతు పురుగుల మందు తాగి ఆత్మహత్యాయత్నం చేశాడు. వెంటనే అతన్ని ఆస్పత్రి తరలించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా వర్గల్ మండలం వేలూరులో చోటుచేసుకుంది. రైతు మరణంతో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి.

వివరాల్లోకివెళితే.. జిల్లాలోని వర్గల్ మండలం వేలూరు గ్రామంలో యువ రైతు బాగరి నర్సింలు(36)కు ప్రభుత్వం 20 గుంటల భూమిని ఇచ్చింది. కాగా, ఇటీవల రాష్ట్ర ప్రభుత్వం కొన్ని గ్రామాలను క్లస్టర్లుగా ఏర్పాటు చేసి రైతు వేదికలను నిర్మిస్తుండగా.. వేలూరు గ్రామంలో నర్సింలుకి చెందిన భూమిలో రైతు వేదికను నిర్మించేందుకు అధికారులు ప్రయత్నించారు. దీనికి రైతు నర్సింలు ఒప్పుకోలేదు. అధికారులు ఇక్కడే నిర్మిస్తామని తేల్చిచెప్పడంతో ఆవేదనకు గురై బుధవారం సాయంత్రం నర్సింలు పురుగుల మందు తాగి ఆత్మహత్యకు యత్నించగా చికిత్స పొందుతూ మృతి చెందాడు.

ఆత్మహత్య చేసుకునే ముందు నర్సింలు సెల్ఫీ పొటోతో పాటు, ఆడియోను రికార్డు చేశాడు. రైతు మృతితో గ్రామంలో ఉద్రిక్త పరిస్థితులు నెలకొన్నాయి. నర్సింలు బంధువులు, కుటుంబీకులు సర్పంచ్ ఇంటి ముందు ఆందోళనకు దిగారు. గ్రామంలో ఎలాంటి అవాంఛనీయ ఘటనలు జరగకుండా ఉండేందుకు గ్రామంలో భారీగా పోలీసు బలగాలు మోహరించారు. అయతే, బాధిత కుటుంబానికి న్యాయం చేయాలని వారు కోరుతున్నారు.

Advertisement

Next Story