- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
మానవత్వం చంపుతున్న కరోనా.. తల్లిదండ్రులపైనే వివక్ష
దిశ ప్రతినిధి, కరీంనగర్: ‘‘ఆరు పదుల వయసు దాటిన ఓ వృద్దురాలు చేతిలో డబ్బు సంచితో ఆస్పత్రికి చేరింది. అంబులెన్స్‌కు అద్దె చెల్లించి ఆస్పత్రిలోకి ఆయాసపడుతూ లోపలకు అడుగుపెట్టింది. డాక్టర్ వచ్చి చూసి ఆమెకు బెడ్ కేటాయించి చికిత్స ప్రారంభించారు. వారసులు ఉన్నా ఒంటరిగానే ఆస్పత్రిలో చేరిన ఆ తల్లి తన వద్ద ఉన్న డబ్బు లెక్కిస్తోంది. పక్కనే ఉన్న మరో పెషెంట్ అవ్వా డబ్బులు బాగా తెచ్చినట్టున్నావ్ మీ వాళ్లు ఎవరూ రాలేదా..? నాకు అంటిన మాయదారి రోగంతో కడుపున పుట్టిన బిడ్డలు ఉన్నా లాభం లేకుండా పోయింది బిడ్డ. ఆస్పత్రి ఖర్చులకని రూ.10 లక్షలు నా వెంటే తెచ్చుకున్నా అని చెప్పింది. అంత డబ్బు పట్టుకుని ఒక్కదానివే ఎందుకొచ్చావు అవ్వా పిల్లలను ఆస్పత్రికి రమ్మని చెప్పి డాక్టర్లు అడిగినప్పుడు పిలిచి బిల్లు కట్టమనేవారు కదా. వాళ్లు రారు బిడ్డ.. కావల్సినంత ఆస్థి సంపాదించిపోయిండు నా పెనిమిటి, కానీ నాకొచ్చిన రోగంతో నా బిడ్డలే భయపడి దూరం పోతుండ్రు, అందుకే నేనొక్కదాన్నే అంబులెన్స్‌లో దవాఖానకు వచ్చిన. నా ప్రాణానికి ఏమైనా అయితే నా దగ్గర ఉన్న డబ్బుతోనే దహన సంస్కారాలు చేయించాలని డాక్టర్‌కు చెప్తా. మా వాళ్లకు ఫోన్ చేసి చెప్పమంటా ఇంతకన్నా ఏం చేస్తం బిడ్డ. కాటికి కాలి చాపే వయసొచ్చింది అంటూ ఆవేదనతో ఆ అవ్వ చెప్తోంది. నా పెనిమిటే ఉంటే గిట్ల ఉండేదా? నా పెళ్లానికి మంచిగ చెయ్ డాక్టర్ సాబ్ అంటూ దవాఖాన్ల చుట్టూ తిరిగేటోడు. ఇప్పుడు ఆయనే లేకండా పాయే, నా బిడ్డల తీరు చూస్తే నాకు కూడా నా పెనిమిటి దగ్గరికి పోతేనే మంచిదేమో అనిపిస్తోంది బిడ్డ అని గద్గద స్వరంతో చెప్తోంది. అవ్వ మాటలు విన్న పక్క పేషెంట్ కళ్లలో నీరు తిరిగాయి. ఏం మాట్లాడాలో తెలియక గొంతు మూగబోయింది. పేగు బంధం తెంచుకున్న బిడ్డలను కరోనా దూరం చేస్తోందా? లేక కన్న వారు కావాలనే దూరం అవుతున్నారా? అని తన మనసులో మెదిలిన ప్రశ్నకు సమాధానం దొరకక కళ్లు మూసుకున్నాడు. విదేశాల్లో ఉన్న నా కొడుకేమో నాన్న ఎలా ఉంది. నేను వచ్చేస్తాను. నీ ఆరోగ్యం జాగ్రత్త డాక్టర్‌తో మాట్లాడాను అంటూ గంటగంటకు వీడియో కాల్‌లో మాట్లడుతున్న తన కొడుకు కళ్లల్లో మెదిలాడు. కరోనా బారిన పడ్డ తాను మధ్య తరగతి కుటుంబానికి చెందిన వాడిని కావడంతో విదేశాల్లో ఉన్న కొడుకును తనకు చూడాలని ఉన్నా, వాడు వస్తానని గొడవ చేస్తున్నా వద్దని వారిస్తున్నానే. ఆర్థికభారం పడుతుందన్న కారణంతో తన కొడుకును వద్దని వారించానే తప్ప నా కొడుకు నా వద్ద ఉండాలన్న తహ తహ నాకూ ఉండి ఏం లాభం అనుకుంటూ నిశ్శబ్దంలోకి వెల్లిపోయాడు.’’
చేతి నిండా నోట్ల కట్టలు, కోట్ల రూపాయల ఆస్థులు ఉన్నా మనో ధైర్యం ఇచ్చే వారు లేక గుండె ధీటువు చేసుకున్న తల్లిదో దీనావస్థ అయితే, కొడుకు వస్తానన్న రావద్దంటూ వేడుకుంటూ తనపై పడే ఆర్థికభారాన్ని అంచనా వేసుకుంటూ ఆస్పత్రిలో తనలో తానే మదనపడుతున్న మధ్య తరగతి తండ్రి పరిస్థితి ఇది. ఇలాంటి పరిస్థితులు ఏ ఆస్పత్రిలోనైనా సర్వ సాధారణంగా మారాయి. ఒకరో ఇద్దరో పేషెంట్లు అయితే ఆస్పత్రి సిబ్బంది కూడా వారిని అక్కున చేర్చుకునే వారేమో కానీ కరోనా బారిన పడ్డ ప్రతి ఒక్కరిలోనూ ఇలాంటి బాధలే. వారి మనోవేదనను తీర్చే వారెవరు, కరోనా చికిత్స కన్నా ముందు మానసిక ప్రశాంతతను, తాము ఉన్నామన్న మనో ధైర్యాన్ని కల్పించే వారు లేకపోవడమే ఇందుకు కారణం ఒకరిదైతే. ప్రేమను పంచే బిడ్డ ఉన్నా ఎయిర్ బస్‌లో వచ్చి వెళ్లేందుకు కొడుకు కోసం లక్షలు ఖర్చవుతాయన్న ఆందోళన మరోకరిది.
‘‘కరీంనగర్‌లోని ఓ అంబులెన్స్ యజమానికి ఫోన్ వచ్చింది. మా తల్లి కరోనా బారిన పడింది ఆసుపత్రికి తీసుకెళ్లాలి అర్జంటుగా ఫలానా చోటకు రమ్మని చెప్పారు. టిఫిన్ తింటున్న అంబులెన్స్ యజమాని హుటాహుటిన తన వాహనాన్ని డ్రైవర్‌కు ఇచ్చి పంపించి ఆస్పత్రిలో బెడ్ కోసం ప్రయత్నాలు ముమ్మరం చేశాడు. అంతలో బాధితురాలి వద్దకు వెళ్లిన అంబులెన్స్ డ్రైవర్ ఫోన్ చేశాడు. సార్ పేషెంట్ ఆరోగ్య పరిస్థితి అంత సీరియస్‌గా ఏమీ లేదు కానీ, ఆకలి అవుతోందని చెప్తోంది. ఆమె పిల్లలకు ఫోన్ చేస్తే అబ్బో మేం అక్కడకు రాలేమని చెప్తున్నారు. కనీసం ఇంట్లో ఉన్న ఏదైనా టిఫిన్ ఇవ్వండి నేనే తినిపిస్తానని చెప్పిన వారు వినడం లేదని చెప్పాడు. ఏదైనా హోటల్ తీసి ఉంటే టిఫిన్ తినిపించి తీసుకరమ్మని అంబులెన్స్ యజమాని డ్రైవర్‌ను కోరాడు. 15 నిమిషాల తరువాత డ్రైవర్ నుండి మళ్లీ కాల్ సార్ లాక్2డౌన్ వల్ల హోటళ్లన్నీ మూసేశారు సర్. పేషెంట్ ఆకలి కోసం అలమటిస్తోందని చెప్పాడు. వెంటనే ఫోన్ కట్ చేసిన అంబులెన్స్ యజమాని పేషెంట్ తాలుకూ బంధువులకు ఫోన్ చేసి ఏమండి పెద్దావిడ ఆకలితో అలమటిస్తోంది, ఆహారం ఏదైనా ఇప్పించండి, మా డ్రైవర్ తినిపిస్తాడు, ఆమె ఉన్న వద్దకు మీరు రాకండి, మా డ్రైవరే వస్తాడని చెప్పాడు. లేదు లేదు మే ఇంకా వంట కూడా చేసుకోలేదు. అర్జంట్‌గా ఆస్పత్రికి తీసుకెళ్లండి. మీకెన్ని డబ్బులు కావాలన్న నేను ఆన్ లైన్‌లో పంపిస్తానని చెప్పి ఫోన్ కట్ చేశాడు. డ్రైవర్‌కు కాల్ చేసి ఆ తల్లిని తీసుకుని వెంటనే రా ఇక్కడ ఏదైనా ఫుడ్ అరేంజ్ చేస్తాను తినిపించిన తరువాత ఆస్పత్రిలో చేర్పిద్దాం అని చెప్పాడు అంబులెన్స్ ఓనర్.
పసి ప్రాయంలో గుక్క పట్టి ఏడుస్తున్న తన బిడ్డకు ఏమైందోనని తల్లడిల్లిపోయిన తల్లి ఆకలవుతుందేమోనని తన స్తనాన్ని అందించి పాలు తాగించే ప్రయత్నం చేసింది. అయినా ఆ బిడ్డ ఏడుపు మానకపోవడంతో కన్నీటి పర్యంతం అయిన ఆమె ఇంట్లో ఉన్న వారందరికి చెప్పి తన బిడ్డ బాధ ఏంటో అర్థం అయితే చెప్పాలని వేడుకుంది. మాడపై నూనె రాయాలని ఒకరు, చెవి నొప్పి కావచ్చని మరి కొందరు, అజీర్తి వల్లనేమో అని కొందరు చెప్పి అలా చేస్తే సరిపోతుందన్న ప్రతి ఒక్కరి సలహాను తూచ తప్పక పాటించింది ఆ తల్లి. ఆ బిడ్డను పెంచి పెద్ద చేసిన ఆ తల్లే కరోనా బారిన పడి ఆకలితో అలమటిస్తున్నా.. అటువైపుగా చూసేందుకు పేగు తెంచుకుని పుట్టిన బిడ్డలే రాలేదన్న విషయం చర్చించుకుటూ అంబూలెన్స్ డ్రైవర్లే మథన పడిపోయారు.
చనిపోయిన వారిపైనే కాదు. బతికున్నప్పుడు కూడా జీవశ్చవంలా కరోనా బాధితులను మార్చేస్తున్నారు. బాధితులను ఒంటరి చేస్తూ నిందితుల్లా మారిపోతున్న సంబంధీకుల్లో మార్పు రాకుంటే వారిలో మానసిక దృఢత్వం ఉండదు. దీంతో డాక్టర్లు అందించే చికిత్స కూడా అంతగా ఫలించే అవకాశం లేదు. పెషెంట్లలో తమకేమీ కాదన్న కాన్ఫిడెన్స్‌ను కల్పించాల్సిన అవశ్యకత అందరికన్నా ముందు కుటుంబ సభ్యులపైనే ఉంటుంది. వారు వ్యవహరిస్తున్న తీరుతో తమ వారే తమను దూరం పెట్టారన్న ఆవేదన కరోనా బాధితుల్లో తీవ్రమై వారిని మరణం అంచుల వరకూ చేరుస్తోంది. చనిపోతామన్న భయంతో మందులు వేసుకున్నా.. ఫలితం లేక మృత్యువు ఒడిలో చేరిపోతున్నారు. కాబట్టి కోవిడ్ బారిన పడ్డ వారి దగ్గరకు వెళ్లకున్నా వారికి కనీసం ఫోన్లో అయినా టచ్‌లో ఉండి, బతుకుపై ఆశలు రేకెత్తించే విధంగా వ్యవహరించాల్సిన అవసరం ప్రతి ఒక్కరిపైనా ఉంది.