కరీంనగర్‌లో మేడిపండు లాంటి అభివృద్ధి: మాజీ మేయర్

by Sridhar Babu |   ( Updated:2021-12-23 05:02:34.0  )
కరీంనగర్‌లో మేడిపండు లాంటి అభివృద్ధి: మాజీ మేయర్
X

దిశ, కరీంనగర్ సిటీ: నగర అభివృద్ధి మేడిపండు చందంలా మారిందని, అంతర్గత రోడ్లు, డ్రైనేజీలు చిన్నాభిన్నంగా మారడంతో నగర ప్రజలు తీవ్ర ఇబ్బందులకు గురవుతున్నారని మాజీ మేయర్, బీజేపీ నేత డీ శంకర్ విమర్శించారు. నగరంలో కొనసాగుతున్న స్మార్ట్ సిటీ పనుల జాప్యాన్ని, నగరపాలక సంస్థలో అవినీతి అక్రమాలను నిరసిస్తూ, బీజేపీ ఆధ్వర్యంలో గురువారం బల్దియా ఎదుట నిరసన చేపట్టారు.

ముఖ్యఅతిథిగా హాజరైన ఆయన మాట్లాడుతూ.. స్మార్ట్ సిటీ నిబంధనలకు టీఆర్ఎస్ ప్రభుత్వం తిలోదకాలు ఇచ్చిందని, ఇష్టానుసారంగా నాణ్యత లేని పనులు చేపడుతూ, పనుల్లో తీవ్ర జాప్యం చేస్తూ కరీంనగర్ పట్టణాన్ని అస్తవ్యస్తంగా మార్చారని ఆయన మండిపడ్డారు. కేంద్ర ప్రభుత్వం తన వాటాగా రూ. 196 కోట్ల నిధులు మంజూరు చేసినా, రాష్ట్ర ప్రభుత్వం తన వాటా నిధులు మంజూరు చేయడంలో మొక్కుబడి వ్యవహారాలు చేస్తుందని ఆయన విమర్శించారు.

ముఖ్యంగా డివిజన్లలో సీసీ రోడ్లు వేసేటప్పుడు నియమ నిబంధనలు పాటించాల్సిన కాంట్రాక్టర్లు వాటిని పాటించకపోవడం, అధికారులు మామూళ్ల మత్తులో మునిగి ఆ పనుల మీద పర్యవేక్షణ లేకపోవడం, ఇదే కాకుండా సంబంధిత అధికారుల మధ్య సమన్వయం లేకపోవడంతో ఎక్కడికక్కడ పనులు నత్తనడకన ఏళ్ల తరబడి పనులు కొనసాగుతున్నాయని చెప్పారు.

Advertisement

Next Story