- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కరోనాతో సహజీవనం తప్పదు: మంత్రి కేటీఆర్
దిశ, న్యూస్ బ్యూరో: ”ఇప్పుడిప్పుడే కరోనా వైరస్ మనల్ని వదిలిపెట్టిపోయే అవకాశం లేదు. పూర్తిస్థాయి వ్యాక్సినేషన్ వచ్చేంత వరకు ఆ వైరస్‌తో మనం సహజీవనం చేయాల్సిందే. అప్పటివరకూ కరోనా కట్టడి కోసం ప్రభుత్వం రూపొందించిన మార్గదర్శకాలను ప్రతీ ఒక్కరు పాటించాల్సిందే. ఇప్పుడు మనం పాటిస్తున్న మాస్కుల వినియోగం, భౌతిక దూరం, శానిటైజర్ల వినియోగం వంటి వాటిని ఇకపైన కూడా కొనసాగించాల్సి ఉంటుంది” అని మంత్రి కేటీఆర్ వ్యాఖ్యానించారు. కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్న నేపథ్యంలో ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని మున్సిపల్ కమిషనర్లను మంత్రి కేటీఆర్ ఆదేశించారు. రాష్ట్రంలోని మున్సిపల్ కమిషనర్లతో నగరం నుంచి శనివారం నిర్వహించిన వీడియో కాన్ఫరెన్సులో కేటీఆర్ పై విధంగా స్పష్టత ఇచ్చారు.
ముఖ్యమంత్రి కేసీఆర్ సైతం ఇటీవల మీడియా సమావేశంలో “కరోనాతో సహజీనం తప్పదు” అనే అర్థంలో వ్యాఖ్యలు చేశారు. ఇప్పుడు ఆయన కుమారుడైన మంత్రి కేటీఆర్ కూడా దాన్ని నొక్కిచెప్పే తీరులో వ్యాఖ్యలు చేయడం గమనార్హం. ఇకపైన కరోనా కట్టడి కోసం అవసరమైన మార్గదర్శకాలను రాష్ట్ర వైద్యారోగ్య శాఖ, మున్సిపల్ శాఖ సంయుక్తంగా విడుదల చేస్తాయని మంత్రి కేటీఆర్ పేర్కొన్నారు. సోషల్ డిస్టెన్స్‌ను పకడ్బందీగా నిర్వహించేందుకు వీలుగా ప్రస్తుతం రాష్ట్రంలోని కొన్ని పట్టణాల్లో అమలవుతున్న ‘సరి-బేసి’ విధానం ఇతర నగరాలకు కూడా విస్తరించక తప్పదనే అభిప్రాయాన్ని వ్యక్తం చేశారు. ఇప్పటివరకూ చురుకైన పాత్ర పోషిస్తోన్న మున్సిపల్ కమిషనర్ల కృషిని కేటీఆర్ అభినందించారు. ఇదే స్ఫూర్తితో భవిష్యత్తులోనూ పటిష్టమైన చర్యలను తీసుకోవాలని స్పష్టం చేశారు. త్వరలో దశల వారీగా లాక్‌డౌన్ ఎత్తివేసిన తర్వాత కూడా కరోనా వ్యాప్తికి అవకాశాలు ఉన్నాయని, అందువల్ల ప్రభుత్వ మార్గదర్శకాలను ఎప్పటికప్పుడు కట్టుదిట్టంగా అమలు చేయాలని వారికి స్పష్టం చేశారు. పారిశుద్ధ్య సిబ్బంది వ్యక్తిగత రక్షణ కవచాలు, మాస్కులు, గ్లౌజులు లేకుండా పని చేయరాదని, ఒకవేళ ఇవి లేకుండా కార్యక్షేత్రంలో కనిపిస్తే దానికి పూర్తి బాధ్యత మున్సిపల్ కమిషనర్లదే అవుతుందని మంత్రి స్పష్టం చేశారు. పారిశుద్ధ్య కార్మికులకు వారానికోసారి ప్రాథమిక ఆరోగ్య పరీక్షలు చేయించాలని సూచించారు. కరోనా వైరస్‌తో ఉనికిలోకి వచ్చిన లాక్‌డౌన్ ఇంకెంతకాలం ఉంటుందో ఎవ్వరికీ తెలియదు. దశల వారీగా ఆంక్షలను సడలిస్తుండడంతో తొందరలోనే పూర్తిస్థాయిలో లాక్‌డౌన్ ఎత్తివేయడం ఖాయం అనే ప్రజలు భావిస్తున్నారు. అయితే లాక్‌డౌన్ ముగియడంతోనే కరోనా వైరస్ పోయిందనే అభిప్రాయం చాలా మంది ప్రజల్లో ఉంది. కానీ, అలాంటి భ్రమలు అవసరం లేదని, ఇప్పుడు పాటిస్తున్న జాగ్రత్తలు ప్రజలు వారంతట వారుగా మరికొంతకాలం కొనసాగించక తప్పదనే సంకేతాలు మంత్రి నుంచి వెలువడ్డాయి. కరోనా వైరస్‌తో ఇక ప్రమాదం లేదనే స్పష్టతకు ప్రభుత్వం వచ్చేంత వరకు ప్రస్తుతం అమల్లో ఉన్న మార్గదర్శకాలు కొనసాగుతూనే ఉంటాయి. స్వల్ప మార్పులు చేర్పులు ఉండవచ్చేమోగానీ మాస్కులు, శానిటైజర్లు, సోషల్ డిస్టెన్స్ లాంటివి మాత్రం చాలా కాలం అమలయ్యే అవకాశం ఉంది. వ్యక్తిగత పరిశుభ్రతలో భాగంగా ఇవి ప్రతీ ఒక్కరి జీవితంలో ఇకపైన భాగం కాక తప్పదు. రానున్న వర్షాకాలాన్ని దృష్టిలో పెట్టుకుని దోమల వ్యాప్తిని నిరోధించడానికి అవసరమైన చర్యలను, డెంగ్యూ వ్యాధి సోకే అవకాశం ఉన్నందున నివారణ కోసం కనీసం వారానికోసారి యాంటీ లార్వా కార్యక్రమాలను చేపట్టాలని, ఇప్పటినుంచే దాన్ని ప్రారంభించాలని కేటీఆర్ స్పష్టం చేశారు. మురికి కాలువలను ఇప్పుడే శుభ్రం చేయాలని, వాటిల్లో పేరుకుపోయిన చెత్తను తొలగించడం ద్వారా వరదనీరు నిలిచిపోయే పరిస్థితుల్ని నివారించొచ్చని సూచించారు.