ఈటలను మించిన జమున.. దంపతుల ఆస్తుల్లో భారీ తేడా..!

by Anukaran |
ఈటలను మించిన జమున.. దంపతుల ఆస్తుల్లో భారీ తేడా..!
X

దిశ ప్రతినిధి, కరీంనగర్: ఎన్నికల అఫిడవిట్‌లో ఎన్నెన్నో చిత్ర విచిత్రాలు దర్శనమిస్తున్నాయి. ఎన్నికల కమిషన్ నిబంధనల ప్రకారం నామినేషన్ వేసే అభ్యర్థులు తమ ఆస్తులు, క్రిమినల్ కేసులు తదితర వివరాలన్నీ.. అఫిడవిట్ రూపంలో అందించాలి. హుజూరాబాద్ ఉప ఎన్నికలో పోటీ చేసేందుకు నామినేషన్ దాఖలు చేసిన ఆ దంపతులు ఇచ్చిన వివరాలు పరిశీలిస్తే గమ్మత్తుగా ఉన్నాయనే చెప్పాలి. హుజూరాబాద్ బీజేపీ అభ్యర్థిగా బరిలో నిలవనున్న ఈటల రాజేందర్‌తో పాటు ఆయన సతీమణి జమున ప్రతిసారి నామినేషన్ వేస్తుంటారు. ఈ ఆనవాయితీ ప్రకారం ఈ ఉపఎన్నికల్లోనూ జమునమ్మ నామినేషన్ వేశారు. ఇందులో భాగంగా రాజేందర్, ఆమె భార్య జమున అందించిన అఫిడవిట్లలో పొందుపర్చిన విషయాలు ఆసక్తిని రేకెత్తిస్తున్నాయి.

కారు లేని రాజన్న.. మూడు కార్ల జమునమ్మ..

2014 నుంచి ఎమ్మెల్యేగా గెలుస్తూ వస్తున్న ఈటల రాజేందర్ రెండు సార్లు మంత్రిగా కూడా బాధ్యతలు స్వీకరించారు. అసెంబ్లీలో ఫ్లోర్ లీడర్‌గా కూడా పని చేసిన ఈ ఉద్యమ నేతకు సొంత కారు లేకపోవడం విచిత్రం. అయితే ఆయన సతీమణి జమునమ్మ పేరిట మూడు కార్లు ఉండడం విశేషం. అంతేకాకుండా ఈటల రాజేందర్ తనకు స్థిర, చరాస్తులు రూ. 12.56 కోట్ల విలువైనవి ఉన్నాయని పేర్కొన్నారు. ఆయన సతీమణి జమునమ్మకు అంతకు రెట్టింపు ఆస్తులు ఉన్నట్టుగా వివరించారు. భర్త ఆస్తుల కన్నా భార్య ఆస్తులే ఎక్కువగా ఉండడం గమనార్హం. జమున తనకు రూ. 43 కోట్ల విలువైన స్థిర, చరాస్తులు ఉన్నాయని తెలిపారు.

సప్తపది..

ఏడడగులతో వైవాహిక అనుభందం పెనవేసుకున్న రాజేందర్, జమునలు మరో వైవిధ్యాన్ని అందిపుచ్చుకున్నారు. ఇప్పటికే ఏడు సార్లు ఎమ్మెల్యేగా నామినేషన్ వేసిన ఈటల రాజేందర్‌తో పాటు ఆయన సతీమణి జమున కూడా ఏడు సార్లు నామినేషన్ వేయడం విశేషం.

Advertisement

Next Story