ఇజ్జత్‌లేని బతుకొద్దనే అలా చేశా.. గతాన్ని మళ్లీ గుర్తుచేసిన ఈటల

by Sridhar Babu |
ఇజ్జత్‌లేని బతుకొద్దనే అలా చేశా.. గతాన్ని మళ్లీ గుర్తుచేసిన ఈటల
X

దిశ, జమ్మికుంట: తెలంగాణ కోసం కేసీఆర్ ఎంతగా కొట్లాడారో.. తాను, హరీష్ రావు కూడా అంతే కొట్లాడామని మాజీ మంత్రి ఈటల రాజేందర్ అన్నారు. కానీ, మధ్యలో వచ్చి మధ్యలో పోయానని తనను అనడం బాధిస్తోందన్నారు. అందుకే ఇజ్జత్ లేని బతుకు వద్దని మంత్రి, ఎమ్మెల్యే, పార్టీ నుంచి బయటకొచ్చానని ఈటల గుర్తు చేశారు. జమ్మికుంట పట్టణంలో మంగళవారం నిర్వహించిన బైపోల్ ఎన్నికల ప్రచారంలో ఆయన మాట్లాడుతూ.. కొన్ని వందల కోట్ల రూపాయలు తనలాంటి బక్క పలుచని బిడ్డమీద ఖర్చు చేస్తున్నారంటే.. ఎంత కక్ష కట్టారో అర్ధమవుతోందన్నారు. ఈటల రాజేందర్‌‌ను తొక్కెస్తే.. మరో 20 ఏళ్ల పాటు తనను ప్రశ్నించేవాడు పుట్టడని కేసీఆర్ అనుకుంటున్నారా అని నిలదీశారు. కేసీఆర్ ఖర్చు చేసిన డబ్బు, పారిస్తున్న మద్యాన్ని ప్రజలు గమనిస్తున్నారని.. నా సొమ్ము తిన్న నాయకులు కూడా నన్ను వదిలిపెట్టిపోయినా.. ప్రజలంతా నా వెంట ఉన్నందకు దండం పెడుతున్నానన్నారు. అక్బోబర్ 30న జరిగే ఎన్నికల్లో ఈటలను కాపాడుకుంటామని ప్రజలు చెబుతున్నారని.. ఈ ఉపఎన్నిక కేసీఆర్ అహంకారానికి, ప్రజల ఆత్మ గౌరవానికి మధ్య జరుగుతున్న పోటీ అంటూ రాజేందర్ అభివర్ణించారు.

Advertisement

Next Story