రూ.426కోట్లతో ఎలివేటెడ్ కారిడార్​కు శంకుస్థాపన

by Anukaran |   ( Updated:2020-07-11 10:22:54.0  )
రూ.426కోట్లతో ఎలివేటెడ్ కారిడార్​కు శంకుస్థాపన
X

దిశ, న్యూస్​బ్యూరో: హైద‌రాబాద్ న‌గరాభివృద్ధికి ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్నట్లు పుర‌పాల‌క శాఖ మంత్రి కేటీఆర్​ తెలిపారు. రూ. 426కోట్లతో నిర్మించనున్నఎలివేటెడ్ కారిడార్‌, ఫ్లైఓవర్​ పనులకు కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి జి.కిష‌న్‌రెడ్డితో క‌లిసి శంకుస్థాప‌న చేశారు. ఈ ప్రాజెక్టు కింద రూ.350 కోట్లతో ఇందిరాపార్కు నుంచి వీఎస్టీ వరకు 4 లైన్ల ఎలివేటెడ్ కారిడార్ స్టీల్ బ్రిడ్జి, రూ.76 కోట్లతో రాంనగర్ నుంచి బాగ్‌లింగంపల్లి రెండు లైన్ల ఫ్లైఓవర్ నిర్మించనున్నారు. ఈ సంద‌ర్భంగా కేటీఆర్​ మాట్లాడుతూ హైద‌రాబాద్‌ను విశ్వన‌గ‌రంగా అభివృద్ధి చేసేందుకు ఎస్​ఆర్డీపీ ద్వారా రూ. 6వేల కోట్లతో రోడ్ల విస్తర‌ణ‌, ఫ్లైఓవ‌ర్ల నిర్మాణాల‌ను చేప‌ట్టిన‌ట్లు తెలిపారు. లాక్‌డౌన్ సమయంలో నాలుగు రెట్ల వేగంతో ప‌ది నెల‌లు ప‌ట్టే ప‌నుల‌ను రెండు నెలల్లోనే పూర్తిచేసిన‌ట్లు తెలిపారు. ట్రాఫిక్ త‌క్కువగా ఉన్నందున లాక్‌డౌన్‌ను స‌ద్వినియోగం చేసుకున్నట్లు తెలిపారు. అంబ‌ర్‌పేట ఫ్లైఓవ‌ర్ నిర్మాణాన్ని కూడా వేగ‌వంతం చేయ‌నున్నట్లు తెలిపారు. ర‌సూల్‌పుర‌లో చేప‌ట్టిన ప‌నుల‌కు కేంద్ర ప్రభుత్వానికి చెందిన కొంత స్థలాన్ని ఉప‌యోగించుకునే అంశంలో కేంద్ర మంత్రి జి.కిష‌న్ రెడ్డి సానుకూలంగా స్పందించిన‌ట్లు తెలిపారు. నాగ్‌పూర్, రామ‌గుండం వెళ్లే మార్గాల్లో రూ. 5వేల కోట్లతో 18 కిలోమీట‌ర్ల చొప్పున రెండు స్కై వేల‌ను నిర్మించేందుకు ప్రతిపాదనలు రూపొందించిన‌ట్లు తెలిపారు.

కార్యక్రమానికి ముఖ్యఅతిథిగా హాజ‌రైన కేంద్ర హోంశాఖ స‌హాయ మంత్రి కిష‌న్‌రెడ్డి మాట్లాడుతూ హైద‌రాబాద్ చాలా వేగంగా అభివృద్ది చెందుతోందన్నారు. ఈ మెగా ప్రాజెక్ట్‌ను చేప‌ట్టిన సీఎం కేసీఆర్, మంత్రి కేటీఆర్​లకు ధ‌న్యవాదాలు తెలిపారు. ఈ ప‌నుల‌తో ఆర్టీసి క్రాస్ రోడ్‌లో ట్రాఫిక్ స‌మ‌స్య ప‌రిష్కార‌మ‌వుతుంద‌ని తెలిపారు. అంత‌ర్జాతీయ న‌గ‌రంగా అభివృద్ధి చెందుతున్న హైద‌రాబాద్‌లో పెట్టుబ‌డులు పెరుగుతాయ‌ని ఆశాభావం వ్యక్తం చేశారు. కార్యక్రమంలో రాష్ట్ర ప‌శుసంవ‌ర్థక శాఖ మంత్రి త‌ల‌సాని శ్రీ‌నివాస్‌యాద‌వ్‌, న‌గ‌ర మేయ‌ర్ బొంతు రామ్మోహ‌న్‌, ఎమ్మెల్సీ ఎన్‌.రామ‌చంద్రరావు, ఎమ్మెల్యేలు ముఠా గోపాల్‌, కాలేరు వెంక‌టేష్‌, జీహెచ్ఎంసీ క‌మిష‌న‌ర్ లోకేష్ కుమార్, పుర‌పాల‌క శాఖ కార్యద‌ర్శి సుదర్శన్‌రెడ్డి, హైదరాబాద్ పోలీస్ క‌మిష‌న‌ర్ అంజ‌న్‌కుమార్‌, చీఫ్ ఇంజ‌నీర్ శ్రీ‌ధ‌ర్‌, కార్పొరేట‌ర్లు పాల్గొన్నారు.

Advertisement

Next Story