కరోనా కాలంలో కన్నపేగుల కష్టాలు

by Anukaran |   ( Updated:2020-07-26 01:49:02.0  )
కరోనా కాలంలో కన్నపేగుల కష్టాలు
X

కరోనా పెడుతున్న కష్టాలు అన్నీఇన్నీ కావు. అన్ని వర్గాలను, అన్ని వయస్సుల వారిని ముప్పుతిప్పలు పెడుతోంది. ప్రతి ఇంట్లోనూ కుంపటి రాజేసింది. ప్రతి ఒక్కరిలోనూ భయాన్ని నింపింది. ప్రధానంగా వృద్ధుల జీవితాన్ని కన్నీటి పాలు చేస్తోంది. గడప దాటలేరు. దాటకుండా రోజు గడవదు. గందరగోళంతో పెద్దరికం కలవరపడుతోంది. కన్నపేగు కన్నీరు పెడుతోంది.

‘‘ఒకాయన రైల్వేలో చాలా కాలం పాటు పని చేసి రిటైరయ్యారు. తల్లిదండ్రులను పోషించడానికి ఇద్దరు కొడుకులు నెలవారీ వాటాలు వేసుకున్నారు. లాక్ డౌన్ లో పెద్ద కొడుకు వంతు పూర్త యింది. చిన్న కొడుకు తన ఇల్లు చిన్నగా ఉందంటూ వారిని తీసుకెళ్లడానికి నిరాకరించాడు. పెద్ద కోడలు నిర్దాక్షిణ్యంగా వృద్ధుల సామాను బయటపడేసింది. వాళ్లు ఉంటున్న ఇల్లు కూడా పెద్దాయనదే. పింఛన్ కూడా వస్తోంది. ఐనా వాళ్లకింత తిండి పెట్టి, సంరక్షించేందుకు కొడుకులు ఇష్టపడడం లేదు. ఎవరికి చెప్పుకోలేక ఆ వృద్ద దంపతుల పడ్డ వేదన అంతా ఇంతా కాదు’’

దిశ, న్యూస్ బ్యూరో: పండుటాకుల బతుకు దుర్భరంగా మారుతోంది. మామూలుగానే అష్టకష్టాలు అనుభవించే వారు కరోనా సమయంలో మరింత మానసిన వేదనకు, అభద్రతాభావానికి గురవుతున్నారు. కన్న బిడ్డలే ఛీదరించుకుంటుంటే, దూరం పెడుతుంటే, కాదూ పొమ్మంటుంటే ఏం చేయాలో తెలియక తల్లడిల్లిపోతున్నారు. ఇల్లు ఇరుకని బయటకు వెళ్లగొడుతుంటే ఆసరా కోసం అవస్థలు పడుతున్నారు. రోజూ మందులు వేసుకుంటే తప్ప ప్రాణం నిలవదు. ఎవ్వరూ తెచ్చి ఇవ్వరు. బయటకు వెళ్లే పరిస్థితి లేదు. ఇంకొందరేమో ఇల్లు ఇరుకైందని బయటికి వెళ్లగొడుతున్నరు. ఆస్తి పాస్తులు ఉన్నా ఆప్యాయతలు చూపిస్త లేరు. ఒక్కొక్కరిది ఒక్కో ఆవేదన. వృద్ధులకు త్వరగా వైరస్ సోకే అవకాశం ఉందన్న ప్రచారంతోనే ఈ కష్టాలు మొదలయ్యాయి. 60 ఏండ్లకు పైబడిన వారంతా ఇంటి గడప దాటొద్దన్న ప్రభుత్వాల సూచన వారిని తిప్పలు పెడుతోంది. కొన్ని సంపన్న కుటుంబాలవారు మాత్రం కలిసిమెలిసి ఇంట్లోనే ఉంటున్నారు. కన్నబిడ్డలంతా చాలా రోజుల పాటు కండ్ల ముందు కనిపిస్తున్నారని ఆనందపడుతున్నారు. ఏ పండుగకో పబ్బానికోగానీ కలవని బిడ్డలు, మనవలు, మనవరాళ్లంతా ఒకే చోట నాలుగు నెలల పాటు ఉండడాన్ని ఆస్వాది స్తున్నారు. ఇది అతికొద్ది కుటుంబాల్లోనే నెలకొందని హెల్పేజ్ ఇండియా సంస్థ చెబుతోంది.

వారి పాలిట శాపమే

అనేక కుటుంబాల్లో కరోనా వృద్ధుల పాలిట శాపంగా మారింది. చాలా ఇండ్లల్లో వారిని దూరం పెడుతున్నారు. ఇరుకైన ఇండ్లల్లో ఉంచుకోవడానికి ఇష్టపడడం లేదు. సాధారణ పరిస్థితుల్లోనే తల్లిదండ్రులను వాటాలేసుకొని చూసుకునే వారసత్వం మరింత భయపెడుతోంది. ఈ క్రమంలోనే తమను వెళ్లగొట్టారంటూ హెల్పేజ్ ఇండియాకు ఫోన్లు వస్తున్నాయి. వీళ్లలో రిటైర్డ్ ఉద్యోగులే ఎక్కువగా ఉన్నారు. బాగా సంపాదించిన వాళ్లే సమస్యను ఎదుర్కొంటున్నారు. ఎంత ప్రేమ, ఆప్యాయతలతో పెంచి పెద్ద చేసినా ఇప్పుడీ కరోనా వైరస్ బూచీతో దూరం పెడుతున్నారు. ఎక్కడ తమకు సోకుతుందోనంటూ కన్నవారిని కూడా వదిలించుకునేందుకు యత్నిస్తున్నారు. వృద్ధాప్యంలో నిర్దాక్షిణ్యంగా రోడ్డు మీద వదిలేస్తే, ఎక్కడికి వెళ్లాలో తెలియక వాళ్లు పడుతోన్న బాధ వర్ణనాతీతం. కరోనా వ్యాప్తి నేపధ్యంలో ఆకలిదప్పులతో ఛస్తున్నామంటూ ఫోన్లలో ఫిర్యాదులు వస్తున్నాయి. పేద, మధ్య తరగతి వర్గాలవారు తమకు నిత్యావసర వస్తువులు కావాలంటూ మొర పెట్టుకుంటున్నారు. ప్రధానంగా నగరాల నుంచే ఫిర్యాదులు ఎక్కువగా ఉన్నాయి.

తప్పడం లేదు

యువత కూడా ఏటీఎం కేంద్రాలకు వెళ్లడం లేదు. పెద్దరికానికి డిజిటల్ లావాదేవీలపై అవగాహన లేదు. నగదు తప్పనిసరి అవుతోంది. ఏటీఎం కేంద్రాలకు వెళ్లి డ్రా చేసుకోవడం అనివార్యంగా మారింది. అక్కడా ప్రమాదం పొంచి ఉన్నదని హెల్పేజ్ ఇండియా చెబుతోంది. నిత్యావసర వస్తువుల కోసమూ షాపులకు వెళ్తున్నారు. నగరంలో ఇద్దరు వృద్దులు మాత్రమే ఉన్న కుటుంబాలు వేలల్లో ఉన్నాయి. వాళ్ల సంతానమంతా వేర్వేరు పట్టణాల్లో నివాసముంటున్నారు. అవసరాల కోసం బయటికి వెళ్లడం అనివార్యమవుతోంది. అనారోగ్య సమస్యలకు మందుల వాడకం రోజూ తప్పనిసరి. ఆసుపత్రికి వెళ్లే ధైర్యం చేయడం లేదు. దాంతో వారి ఆరోగ్యం మరింత దిగజారుతోంది. టెలీ మెడిసెన్ కోసం ఆన్ లైన్ లావాదేవీలు చేసి మోసపోతున్నారు. మొదట ఫీజు కట్టించుకున్న తర్వాతే డాక్టర్ కి లైన్ కనెక్ట్ చేస్తున్నారు. వాళ్లకేమో ఫోన్ లో సమస్యను సరిగ్గా చెప్పుకోలేక, వినబడక చికిత్సలో సమగ్రత లోపిస్తోంది. టెలీ మెడిసెన్ అమలు చేస్తున్న కొన్ని సంస్థలు మోసాలకు పాల్పడుతున్నారు. ఏకంగా రూ.మూడు వేల వరకు ఫీజు కట్టించుకొని కాల్స్ కట్ చేసిన ఉదంతాలు హెల్పేజ్ ఇండియా దృష్టికొచ్చాయి. కుటుంబ సభ్యులు కూడా వాళ్లకు మెడిసెన్ తెచ్చి ఇచ్చేందుకు నిరాకరిస్తున్నారు. ఎవరి లైఫ్ వాళ్లదన్నట్లుగా సాగిపోతోంది.

పండుటాకుల గోస

నల్లగొండ జిల్లాకు చెందిన ఓ రిటైర్డ్ ఉద్యోగికి ఇద్దరు కొడుకులు. ఓ కొడుకు, కూతురు అమెరికాలో సెటిలయ్యారు. బాగానే సంపాదించారు. ఒక్క కొడుకు మాత్రమే ఆయన్ని చూసుకోవాలి. తను కొనుగోలు చేసిన ఫ్లాట్ లోనే కొడుకు కుటుంబం ఉంటుంది. ఐనా కాస్త తిండి పెట్టేందుకు ముందుకు రావడం లేదు. లాక్డౌన్ లో ఆయన్ని వెళ్లగొట్టారు. దానికి తన భార్య కూడా సహకరించడం గమనార్హం. ఆమె పరిస్థితి భవిష్యత్తులో అలాగే ఉంటుందని ఊహించడం లేదు. కొడుక్కి మద్దతు తెలిపింది. ఆయన ఓ వృద్ధాశ్రమాన్ని వెతుక్కున్నారు. ఇద్దరు కొడుకులను, కూతుర్ని బాగా చదివించారు. సెటిల్ అయ్యేంత వరకు తన కష్టార్జితాన్ని ఖర్చు పెట్టారు. వారు మాత్రం కరోనా వైరస్ సమయంలో కంటికి రెప్పలా కాపాడకుండా నిర్దాక్ష్యిణ్యంగా వెళ్లగొట్టారు.

సికింద్రాబాద్కు చెందిన ఓ వృద్దురాలు చచ్చే ముందు కనీసం ఒక్కసారైనా తన కొడుకును వీడియో కాల్లో చూడాలనుకుంటోంది. పదేండ్ల క్రితం తండ్రి చనిపోతే అంత్యక్రియలకు వచ్చి తిరిగి అమెరికా వెళ్లిపోయాడు. ఆ తర్వాత కన్నతల్లితో ఒక్కసారైనా ఫోన్లో మాట్లాడలేదు. కనీసం క్షేమ సమాచారాన్ని ఆరా తీయలేదు. పెద్ద ఇల్లు కూడా ఉంది. ఆస్తి ఉన్నప్పటికీ ఆ కొడుక్కి తల్లి పట్ల కనికరమైనా లేదు. ఓ కొడుకేమో చనిపోయాడు. ఉన్న ఒక్కగానొక్క కొడుకేమో అమెరికాలో సెటిలయ్యాడు. దాంతో ఆమె తనను చూసుకునేందుకు ఓ అమ్మాయిని దత్తత తీసుకున్నది. కరోనా సమయంలో పరిస్థితి ఎలా ఉంటుందో తెలియదు. ఆమె ధైన్యం కంటతడి పెట్టిస్తోంది.

కొడుకు పిల్లల కోసం

మలక్ పేటకు చెందిన 65 ఏండ్ల వృద్దుడు కరోనా సమయంలోనూ పని చేస్తున్నాడు. తన భార్య, కొడుకు కుటుంబాన్ని పోషిస్తున్నాడు. మలక్ పేట నుంచి రామాంతాపూర్ వరకు తోపుడుబండిలో ఉల్లిగడ్డ విక్రయిస్తున్నాడు. కరోనాతో చచ్చినా ఫర్వాలేదు. ఆకలితో చస్తే ఎట్లా అంటున్నాడు. ప్రభుత్వం ఇచ్చే పది కిలోల బియ్యం బతకడానికి సరిపోదు కదా అన్నాడు. కొడుకేమో తాగుబోతు. పిల్లలందరికీ తను తీసుకొచ్చే సంపాదనే గతి. 60 ఏండ్లు దాటిన వాళ్లెవరూ గడప దాటొద్దని ప్రభుత్వాలు చెబుతున్నాయి. ఇతనికి మాత్రం పని తప్పడం లేదు.

కనీసం మందులైనా సప్లయి చేయాలి: శ్యాంకుమార్, అడ్వకసీ ఆఫీసర్, తెలంగాణ అండ్ ఏపీ, హెల్పేజ్ ఇండియా సంస్థ కరోనా సమయంలో మాకు ఫిర్యాదుల సంఖ్య పెరిగింది. అన్నీ ఉన్నా చూసుకునేందుకు కన్న కొడుకులే ససేమిరా అంటున్నారు. పాజిటివ్ వచ్చినవాళ్లను ఇంట్లోనే ఉంచి చికిత్స చేయిస్తున్న తరుణంలో కన్న తల్లిదండ్రుల పట్ల కొందరు అమానుషంగా వ్యవహరిస్తున్నారు. ప్రభుత్వం వృద్ధులకు అవసరమైన మందులనైనా ఇంటికి సప్లయి చేయించే వ్యవస్థను ఏర్పాటు చేయాలి. ఆశా వర్కర్ల ద్వారా మందులను పంపొచ్చు. అంగన్ వాడీ వర్కర్ల ద్వారా న్యూట్రిషన్ సప్లిమెంట్లను అందిస్తే బాగుంటుంది. ఎవరికైనా ఇబ్బంది తలెత్తితే మాకు ఫోన్ చేయొచ్చు. చేతనైనా సాయం అందించేందుకు ప్రయత్నిస్తాం. లాక్డౌన్ లోనూ వేలాది మందికి నిత్యావసర వస్తువులను హెల్పేజ్ ఇండియా ద్వారా అందించాం. కరోనా వైరస్ వ్యాప్తి కాలంలో వృద్దులు కూడా జాగ్రత్తగా వ్యవహరించాలి. ఆపద సమయంలో 1800-180-1253 నంబరుకు ఫోన్ చేయొచ్చు.

Advertisement

Next Story

Most Viewed