ఏపీలో స్కూల్స్‌కి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్

by srinivas |
ఏపీలో స్కూల్స్‌కి ఎడ్యుకేషన్ డిపార్ట్‌మెంట్ వార్నింగ్
X

విద్యాసంస్కరణలకు ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం బీజం వేసింది. విద్యావిధానం భారంగా మారడంతో పాటు పాఠశాలల్లో బోధన ఒరవడి మార్చడం, విద్యార్ధులపై ఒత్తిడి తగ్గించడం, ఫీజులను నియంత్రించడం, విద్యాబోధనలో నాణ్యత పెంచడం వంటి విషయాల్లో సమూలు మార్పులు చేయాలని రాష్ట్ర ప్రభుత్వం భావిస్తోంది. అందులో భాగంగా గత మూడు రోజులుగా రాష్ట్ర వ్యాప్తంగా వివిధ ప్రాంతాల్లోని 130 ప్రైవేటు పాఠశాలల్లో పాఠశాల విద్యానియంత్రణ మరియు పర్యవేక్షణ కమిషన్ ఛైర్మన్ జస్టిస్ ఆర్.కాంతారావు ఆకస్మిక తనిఖీలు నిర్వహించారు.

ఈ తనిఖీల్లో ప్రైవేటు పాఠశాలల్లో వసతుల లేమిని గుర్తించారు. విద్యార్థులు ఆడుకునేందుకు సరైన మైదానాలు కూడా అందుబాటులో లేకపోవడాన్ని గుర్తించారు. పాఠశాలలు ప్రభుత్వ మార్గదర్శకాలను మీరి ఫీజులుం ప్రదర్శిస్తున్నట్టు నిర్ధారించారు. ఇందుకోసం రెండు రికార్డులు, రిసీట్ పుస్తకాలు మెయింటైన్ చేస్తున్నట్టు గుర్తించారు. విద్యార్థులు, ఉపాధ్యాయుల నిష్పత్తి, తరగతుల నిర్వహణ వంటి వాటిల్లో జరుగుతున్న అవినీతిని చూశారు. ఈ సందర్భంగా అవకతవకలకు పాల్పడిన విద్యాసంస్థలకు నోటీసులు జారీ చేశారు.

నాణ్యమైన విద్య అందించాల్సిన సమయంలో బట్టీపట్టే విధానాన్ని ప్రోత్సహించడంపై ప్రైవేటు పాఠశాలలకు హెచ్చరికలు జారీ చేశారు. ఒక ఉపాధ్యాయుడు సమయానుకూలంగా వివిధ పాఠశాలల్లో పని చేస్తుండడాన్ని గుర్తించారు. నిర్ణారిత ఫీజు 70,000 రూపాయలు ఉంటే విద్యాసంవత్సరం పూర్తయ్యేనాటికి స్కూళ్లు 95,000 రూపాయలు వసూలు చేయడాన్ని విద్యాశాఖ తీవ్రంగా పరిగణిస్తోంది. ఇంత ఫీజులు వసూలు చేస్తూ కూడా వారికి బలవంతంగా విద్యను రుద్దడంపై మండిపడింది. ఒత్తిడితో కూడిన విద్యావిధానంలో శిక్షలు కూడా కఠినంగా ఉంటున్నాయని కమిటీ గుర్తించింది.

గ్రేడింగ్ లేదా ర్యాంకింగ్ పేరిట వారిని ప్రతి యూనిట్‌కు తరగతులు మార్చడం, విద్యార్థుల ఆత్మస్థైర్యాన్ని దెబ్బతీసే చర్యలు చేపట్టడం వంటివి తమ దృష్టికి వచ్చాయని కమిటీ వెల్లడించింది. ప్రభుత్వ, ప్రైవేటు పాఠశాల్లో కూడా విద్యార్థినీ విద్యార్థులకు సరైన టాయిలెట్ సౌకర్యం లేకపోవడం శోచనీయమని కమిటీ తెలిపింది.

విద్యార్థులకు మంచినీరు అందుబాటులో ఉంచకపోవడాన్ని గుర్తించినట్టు చెప్పింది. స్టేట్ సిలబస్‌ను బోధించే పాఠశాలలతో పాటు సీబీఎస్ఈ, ఐసీఎస్ఈ పాఠశాలల్లో కూడా తనిఖీలు నిర్వహించడం జరిగిందని ఈ కమిటీ వెల్లడించింది. పాఠశాలల స్థాయిని బట్టి వాటి ఫీజులు ఉండాలని కమిటీ తేల్చిచెప్పింది. విద్య వ్యాపారం కాదని ఈ కమిటీ స్పష్టం చేసింది. యాజమాన్యాల ఫీజులుంతో పిల్లలను మంచి చదువులు చదివించేందుకు పేద, మధ్య తరగతి ప్రజలు చాలా కష్టపడుతున్నారని వారు తెలిపారు.

రైతు ఆత్మహత్యలకు విద్య, ఆరోగ్యం కూడా కారణమని, అందుకు రాష్ట్ర ప్రభుత్వం ఈ రంగాలపై ప్రధానంగా దృష్టిసారించిందని వారు తెలిపారు. అలాగే విద్య సంస్థల యాజమాన్యాలు తప్పనిసరిగా ఐటీ రిటర్న్స్ దాఖలు చేయాలని ఈ కమిటీ స్పష్టం చేసింది. విధివిధానాలు పాటించే స్కూళ్లకు సింగిల్ విండో విధానంలో అనుమతులు జారీ చేస్తామని వారు వెల్లడించారు.

Advertisement

Next Story

Most Viewed