‘అయినను పోయి రావలెను హస్తిన...’

by Ravi |   ( Updated:2023-06-27 00:45:17.0  )
‘అయినను పోయి రావలెను హస్తిన...’
X

రాజకీయ ప్రత్యర్థుల్ని నిత్యం, నిరంతరం విమర్శించి, విమర్శించీ...వారిలో ఏదైనా కాసింత మంచి ఉంటే గుర్తించడం, అంగీకరించడం కూడా మరచిపోతారు. చెడును పదేపదే జపించి తామూ దానికి అలవాటు పడుతారేమో! రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ అనుసరిస్తున్న వైఖరిని గమనిస్తే వారు కాంగ్రెస్‌ సంస్కృతికి అలవడి తమ సహజ విధానాలకు నీరొదులుతున్న తీరు...ప్రజాక్షేత్రంలో పార్టీని మరింత పలుచన చేస్తోంది. ఒక వేలు స్థానిక నాయకత్వం వైపు చూపిస్తుంటే మిగతావన్నీ కేంద్ర నాయకత్వం వైపు చూపిస్తున్నాయి.

‘అయినను పోయిరావలెను హస్తిన...’ అని పాడుకుంటున్నారు బీజేపీ తెలుగు నాయకులు ఇవాళ, రేపు! ముఖ్యంగా తెలంగాణలో. ‘తెగేది ఏమీ లేదు, తేలేది ఏదీ లేదు...అయినా ఓ ప్రయత్నం...’ అన్న పరిస్థితుల్లో ‘పాండవోద్యోగం- కృష్ణ రాయబారం’ లోని పైపద్య పాదాన్ని ప్రస్తావించడం తెలుగునాట పరిపాటి. ఢిల్లీ వెళ్లి సాధించుకు వచ్చేది ఏమీ లేకపోయినా....అలా వెళ్లి రావటం, వెళ్లక తప్పదు అనుకోవడం దశాబ్దాల కాంగ్రెస్‌ సంస్కృతి. దీనికి విరుద్ధంగా...అంతా గుంభనంగా, క్రమశిక్షణాయుతంగా పార్టీ వ్యవహారాలు నడుపుకోవడం చాలా కాలంపాటు బీజేపీ అనుసరిస్తూ వచ్చిన పద్ధతి. అదే తమ ప్రత్యేక రాజకీయ లక్షణం, బలం అని కూడా ఆ పార్టీ ప్రచారం చేసుకునేది. కాలం మారింది. పరిస్థితులూ మారాయి. ఇది ఫలానా ఒక పార్టీ లక్షణం అని కాదు, ఢిల్లీ పీఠం మీద దీర్ఘ కాలం తిష్టవేసి, రాష్ట్రాల్లో రాజకీయాల్ని ఇష్టానుసారం శాసించాలని ఏ పార్టీ పెద్దలు భావించినా...పరిస్థితులు ఇలాగే ఉంటాయని బీజేపీ రుజువు చేస్తున్నట్టుంది రాజకీయ వాతావరణం. రెండు తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ పరిస్థితుల్ని చూసి రాజకీయ ప్రత్యర్థులే కాదు, చివరకు తెలుగు ప్రజలూ నవ్వుకుంటున్నారు. ఒకడుగు ముందుకేస్తే రెండడుగులు వెనక్కు అన్న పరిస్థితి తెలంగాణలో ఉంది. రెండు పార్టీలు కాదు కదా, మూడు పార్టీలతో ముచ్చటైన దోబూచులాట ధోరణి ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ ఢిల్లీ నాయకత్వం కొనసాగిస్తున్న తీరు...ఏమీ లేని చోట కూడా పార్టీ విశ్వసనీయతను ప్రజాక్షేత్రంలో మరింత దిగజారుస్తోంది. కోలుకునేదెలా... ఎవరికీ పాలుపోని పరిస్థితి. విమర్శలకు ప్రత్యర్థులకు అస్త్రాలిచ్చే దుస్థితి బలపడుతోంది.

స్వయంకృతమే ఎక్కువ

బీజేపీ తెలంగాణలో ఒక ప్రాంతీయ పార్టీతో పోటీ పడుతుందనే విషయం ఢిల్లీ పెద్దలు మరచిపోతున్నారు. ‘సంపర్క్‌ అభియాన్‌’ లాంటి వాటిని ఇక్కడ ప్రజలకు అర్థం కాని ఢిల్లీ భాషలో ప్రచార కార్యక్రమాలు చేపట్టి ప్రజలకు మరింత దూరమవుతున్నారు. పార్టీలో ఐక్యత సాధించే చర్యల్లో, నియంత్రణలో కూడా అధినాయకత్వం విఫలమవుతోంది. గిల్లికజ్జాలన్నీ ఢిల్లీ వెళుతున్నాయి. అన్నీ ఢిల్లీయే పరిష్కరించాలి అన్న ధోరణి రాష్ట్ర నాయకత్వానికి అలవాటయింది. రాష్ట్ర నాయకులను చీటికి మాటికి ఢిల్లీకి పిలిపించుకునే సంస్కృతి ఇది వరకు బీజేపీలో లేదు. ఇప్పుడది రివాజయింది. క్రమశిక్షణకు మారుపేరు అని చెప్పుకునే బీజేపీలో కాంగ్రెస్‌ సంస్కృతి జొరబడి నెమ్మదిగా బలపడుతోంది. ‘పార్టీ విత్‌ ఢిఫరెన్స్‌’ బ్రాండ్‌ ఇమేజ్‌ క్రమక్రమంగా పలచనవుతోంది. రాష్ట్ర నాయకులందరూ ఒకరినొకరు కలుసుకుంటూ సమావేశాలు నిర్వహించుకోవాలని అమిత్‌షా పిలుపునిస్తే, అందుకు భిన్నంగా ఒకరిపై ఒకరు వ్యతిరేకంగా సమావేశమవుతున్నారు. జాతీయ అధ్యక్షులు జె.పి.నడ్డా రాష్ట్ర పర్యటనకు ముందు పార్టీ ఐక్యత కోసం ఢిల్లీలో రాష్ట్ర నేతలతో సమావేశమైన తర్వాత కూడా ఆయన పర్యటనకు వారు గైర్హాజరు కావడం పార్టీలో గాడి తప్పిన క్రమశిక్షణకు పరాకాష్టగా చెప్పవచ్చు. రాష్ట్ర నాయకులే కాకుండా పార్టీ కేంద్ర నాయకత్వం కూడా పలు విషయాల్లో తాము విమర్శించిన కాంగ్రెస్‌ అడుగుజాడల్లో నడవటాన్ని కార్యకర్తలు, అభిమానులు జీర్ణించుకోలేక పోతున్నారు. ఫలితంగా తెలంగాణలో పార్టీ, దాని ఇమేజ్‌ పాల పొంగులా ‘బుస్సు’మని పైకొచ్చి చప్పున చల్లారిపోతోంది. లోపల మంచులాగా క్రమం తప్పకుండా కరిగిపోతోంది. మరోవైపు నాయకులు మాత్రం వచ్చే ఎన్నికల్లో గెలుపు తమదేనని, అధికారంలోకి రావడం ఖాయమని పగటి కలలు కంటున్నారు. బీజేపీ గ్రాఫ్‌ తగ్గించడానికి బీఆర్‌ఎస్‌-కాంగ్రెస్‌-మీడియా కలిసి, విడివిడిగానూ కుట్ర పన్నుతున్నాయని పార్టీ రాష్ట్రాధ్యక్షుడు బండి సంజయ్‌ అంటున్నారు. కానీ, వాళ్ల గ్రాఫ్‌ను ఇతరులు కన్నా కూడా అధికంగా వాళ్లే తగ్గించుకుంటున్నారని ముందు గ్రహించాలి.

పాత కొత్తల నడుమ సమరం

తరుణ్‌చుగ్‌, సునీల్‌ బన్సల్‌ వంటి బీజేపీ జాతీయ నాయకులు కూడా కాంగ్రెస్‌లోలాగే గ్రూపులను ప్రోత్సహిస్తున్నారు. సంజయ్‌ అనుకూల వర్గం, సంజయ్‌ ప్రతికూల వర్గం ఎవరికి వారు ఫామ్‌హౌజుల్లో సమావేశాలు పెట్టుకుంటున్నారు. ఇటువంటి వాటికి స్థానికంగా సంజయ్‌, డి.కె.అరుణ, జితేందర్‌ రెడ్డి, ఈటల రాజేందర్‌, కోమటిరెడ్డి రాజగోపాల్‌రెడ్డి వంటి వారు ఎంత కారణమో జాతీయ నాయకత్వం అటువంటివి ప్రోత్సాహించడమూ అంతే కారణం. రాష్ట్రంలో ఒకరి నాయకత్వాన్ని వేరొకరు అంగీకరించని వైషమ్యాలు పెరిగాయి. ఏ వేదిక మీద చూసినా... బీజేపీలో మొదట్నుంచీ ఉన్నవాళ్లంతా వెనక వరుసలో ఉంటున్నారు. అరువు నాయకులు, వలస నాయకులే ముందు వరుసల్లో ఉంటున్నారు. ఢిల్లీ నాయకత్వమే కాకుండా బండి సంజయ్‌ కూడా పార్టీలోకి కొత్తగా వచ్చి చేరిన వారికే ఎక్కువ ప్రాధాన్యత ఇవ్వడాన్ని సీనియర్లు తప్పుబడుతున్నారు. ఎన్నో ఏళ్లుగా పార్టీని నమ్ముకొని కొనసాగుతున్న నాయకులకు కనీసం అపాయింట్మెంట్‌ ఇవ్వడం లేదని, కొత్తగా వచ్చిన వారికే ఢిల్లీ పెద్దలు కూడా ప్రాధాన్యత ఇవ్వటాన్ని పాతతరం నేతలు జీర్ణించుకోలేకపోతున్నారు. ఢిల్లీ నాయకత్వానికి కూడా పాత వారిపై నమ్మకం పోయి, కొత్తగా వచ్చిన నాయకుల వల్లే పార్టీ భవిష్యత్తు మారుతుందనే భావన కలుగుతున్నట్టుందని బీజేపీలో గుసగుసలు వినిపిస్తున్నాయి. అలా అని, కొత్తగా వచ్చిన వారికి పార్టీ పగ్గాలు, నాయకత్వ బాధ్యతలు అప్పగించే ధైర్యం లేక నాన్చుడు ధోరణితో నష్టం కలిగిస్తున్నారనేది పార్టీ శ్రేణుల్లో తరచూ వినిపిస్తున్న మాట. బీజేపీ నాయకులం అని చెప్పుకునే కొత్తవారు కొందరికి...శ్యామ్‌ప్రసాద్‌ ముఖర్జీ ఎవరో తెలియదు. ఆర్‌ఎస్‌ఎస్‌ పాత్ర తెలియదు. వీహెచ్‌పికి, ఏబీవీపీకి తేడాయే కాదు సంబంధం కూడా తెలియదు. ఆర్‌ఎస్‌ఎస్‌ సిద్దాంతాలకు అనుగుణంగా జనసంఘ్, బీజేపీ ఏర్పడ్డాయి. ఇప్పుడు ఆ మూల సిద్దాంతాలకు తూట్లు పొడిచే విధంగా నూతన నాయకులు వ్యవహరిస్తున్నారు. సిద్ధాంతపరంగా పార్టీతో ఇంతటి దూరం ఉన్నా అటువంటి నాయకులే పెత్తనం చేస్తుంటారు. ఇదీ వరుస!

సంస్థాగత బలమేమైంది?

బీజేపీ చేపట్టే కార్యక్రమాలన్నీ ఈవెంట్‌ మేనేజ్మెంట్‌లాగా సాగుతున్నాయి. డాక్టర్‌ వై.ఎస్‌.రాజశేఖరరెడ్డి, చంద్రబాబు, జగన్మోహన్‌రెడ్డి, షర్మిల, భట్టి, లోకేశ్‌ తదితరుల పాదయాత్రలతో పోల్చి చూస్తే.... సంజయ్‌ జరిపిన పాదయాత్రలో లగ్జరీ ఎక్కువ కనిపించింది. ఇది ఈవెంట్‌ మేనేజ్‌మెంట్‌కు ఎక్కువ, పార్టీ`ప్రజల మధ్య అనుసంధానానికి తక్కువ అన్నట్టే సాగిందనేది జనాభిప్రాయం. నిర్దిష్టంగా ఏం ఫలితం సాధించిందో తేలకుండా, ఎన్నికల వరకు వ్యూహాత్మకంగా సాగకుండా అర్దాంతరంగా ఆగిపోవడంలో రాష్ట్ర, కేంద్ర నాయకత్వాలది సమాన పాత్ర. సంస్థాగత నిర్మాణానికి బీజేపీ నిరంతరం ప్రాధాన్యత ఇస్తుంది. నాలుగేళ్లుగా తెలంగాణలో పార్టీ బలోపేతానికి చేపట్టిన నిర్దిష్ట చర్యలంటూ ప్రత్యేకంగా ఏమీ లేవు. కార్యకర్తల స్థాయిలో పక్కా నిర్మాణం లేదు. ‘వీరే!’ అని చెప్పదగ్గ అభ్యర్థులూ లేరు. బీజేపీలో ప్రధాన కార్యదర్శి (ఆర్గనైజేషన్‌) పదవి అత్యంత కీలకం. పార్టీ నిర్మాణ వ్యవహారాల్లో...అధ్యక్షుడికి, ఇతర కార్యవర్గానికి మధ్య సమన్వయకర్తగా ముఖ్య భూమిక పోషిస్తారు. బీజేపీలో ప్రధాన కార్యదర్శికి ఎంతో ప్రాధాన్యత ఉంటుంది. తెలంగాణలో దుబ్బాక, హుజూరాబాద్‌ ఉప ఎన్నికల్లో గెలుపు, హైదరాబాద్‌ మహానగర ఎన్నికల్లో విజయాల వెనుక ప్రధాన కార్యదర్శి సమన్వయ చర్యలు మంచి ఫలితాలిచ్చాయి. సాధారణంగా ఆర్‌ఎస్‌ఎస్‌ నుంచి వచ్చిన సిద్దాంత బలం, నిబద్దత కలిగిన వారు ఈ పదవిలో ఉంటారు. ‘మునుగోడు’ ఉప ఎన్నికల్లో ఈ లేమి కొట్టుకొచ్చినట్టు కనిపించింది. ఆ ఎన్నికకు ముందే, పొమ్మనలేక పొగబెట్టినట్టు ఆ హోదాలో ఉన్న మంత్రి శ్రీనివాస్‌ను ఇక్కడి నుంచి వేరెక్కడికో పంపించారు. ఆ పదవి ఇప్పటికీ ఖాళీగానే ఉంది. ఉన్న ముగ్గురు ఎమ్మెల్యేలు, నలుగురు ఎంపీల మధ్య కూడా సమన్వయ మాట అటుంచి సత్సంబంధాలు లేవు. వీరందరూ కలిసికట్టుగా సమావేశం నిర్వహించిన సందర్భాలు కూడా లేవు. అసెంబ్లీ ఫ్లోర్‌ లీడర్‌గా ఉన్న ఎమ్మెల్యే రాజాసింగ్‌ను పార్టీ నుండి సస్పెండ్‌ చేసిన తర్వాత సందిగ్దత నెలకొంది. ఆయనను తిరిగి పార్టీలోకి తీసుకుంటారా.. లేదా వదిలించుకుంటారా.. అనేదానిపై అనిశ్చితి ఉంది. తొమ్మిదేళ్లుగా బీఆర్‌ఎస్‌తో దాగుడుమూతల ధోరణి తప్ప స్పష్టమైన వైఖరి లేక ప్రత్యర్థి కాంగ్రెస్‌కు విమర్శనాస్త్రాలు అందించే బలహీన పరిస్థితి. అభ్యర్థులు కాంగ్రెస్‌లో గెలిచి బీఆర్‌ఎస్‌లో చేరుతారని బీజేపీ విమర్శిస్తే...రాష్ట్రంలో బీఆర్‌ఎస్‌కు బీజేపీ ‘బి’ టీమ్‌ అనే విమర్శను మోయాల్సి వస్తోంది.

బీజేపీ డబుల్‌ గేమ్‌తో మరింత ఢమాల్‌

ఒకవైపు ముఖ్యమంత్రి జగన్మోహన్‌రెడ్డికి స్నేహ హస్తం అందిస్తుంది. మరోవైపు చంద్రబాబు, పవన్‌ తన వాళ్లే అన్నట్టు కలరింగ్‌ ఇస్తోంది. ఆంధ్రప్రదేశ్‌లో బీజేపీ డబుల్‌ గేమ్‌ ఆడుతున్నట్టుంది. ఫలితంగా ఏపీలో బీజేపీని ఎవరూ నమ్మడం లేదు. తమకు అసలు పట్టులేని రాష్ట్రాల్లో ప్రాంతీయ పార్టీలు కాంగ్రెస్‌ను ఎదగనీయకుండా అడ్డుకుంటే చాలని సర్దిపెట్టుకునే బీజేపీ ధోరణి కూడా ఆయా రాష్ట్రాలలో పార్టీ ఎదుగుదలకు అవరోధంగా మారుతోంది. ఈ పరిణామాల మధ్య జంట తెలుగు రాష్ట్రాల్లో బీజేపీ విశ్వసనీయత వేగంగా పాతాళం వైపు పరుగులు తీస్తోంది. ఎన్నికల్లో గెలుపు అధికారంలోకి రావటం గురించి మాట్లాడటానికన్నా ముందు పార్టీని చక్కదిద్దుకోవడంపై ఢిల్లీ నాయకత్వం దృష్టి నిలపాలి.

-దిలీప్‌రెడ్డి,

పొలిటికల్‌ అనలిస్ట్‌, పీపుల్స్‌పల్స్‌ రీసెర్చ్‌సంస్థ,

[email protected],

99490 99802

Advertisement

Next Story