- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
కామన్ స్కూల్ కల నెరవేరేనా..?
విద్య వ్యాపారీకరణ, కార్పొరేటీకరణ 1980 దశకంలో ప్రారంభమైంది.1990లో విద్యా వ్యాపారం బాగా విస్తరించింది. నేడు విద్యారంగం ప్రైవేటు కార్పొరేట్ శక్తుల కదంబ హస్తాల్లో బందీ అయి విలవిలలాడుతుంది. ఓట్ల పండుగ వచ్చిందంటే చాలు మేధావి వర్గం ప్రజలకు నాణ్యమైన విద్య, వైద్యం ఇస్తే చాలనే చర్చ చేస్తది. రాజకీయ పార్టీలు మాత్రం విద్య, వైద్యం తప్ప అన్ని ఫ్రీగా ఇస్తాం అన్నట్లుగా మాట్లాడతాయి. జాతీయ విద్యా విధానం ప్రతిపాదించి, పార్లమెంట్‌లో ఆమోదించి.. 60 ఏండ్లు గడిచినా, అనేక మంది పాలకులు మారిన దేశంలో నేటికీ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ అమలు నోచుకోని హామీగా, కలగానే మిగిలింది.
విద్యారంగంలో కామన్ స్కూల్ ఆశయాన్ని మొట్టమొదటిసారిగా 1964-66 లో ప్రస్తావించింది కొఠారి కమిషన్. ప్రభుత్వ విద్యారంగ విస్తరణ కొరకు పాఠశాల సంఖ్యను పెంచడం కంటే కామన్ స్కూల్ విధానాన్ని ప్రవేశపెట్టాలని, ఆ ప్రాంత పాఠశాల విధానం మీద ఆధారపడి ఈ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ ఉండాలని చెప్పింది. 1968లో మొదటి జాతీయ విద్యా విధానంలో, 1986లో రెండవ విధానంలో, 1992లో సవరించిన సంస్కరణలో ఈ కామన్ స్కూల్ ఎడ్యుకేషన్ పొందుపరచబడింది. 1986, 1992 విధాన ప్రకటనలను పార్లమెంటు కూడా ఆమోదించింది. కానీ ఆచరణలోకి రాలేదు. కానీ ప్రపంచంలో అభివృద్ధి చెందిన, అభివృద్ధి చెందుతున్న దేశాల్లో ఏదో ఒక రూపంలో కామన్ స్కూల్ విధానం అమలులో ఉంది.
60 ఏండ్లు గడిచినప్పటికీ..
సమాజంలో ధనవంతులకు, పేదవారికి మధ్య చదువుకున్న వారికి చదువు రాని వారికి మధ్య వివిధ మతాల, కులాల మధ్య ఉన్న దూరం విద్యారంగాన్ని ప్రభావితం చేసిందని ఈ విభేదాల అంతరాల్లో చిక్కుకొని ప్రజలు విభజింపబడి ఉన్నారని.. సామాజిక విభజనకు సంబంధించిన ప్రభావం పాఠశాల మీద పడకూడదని.. పాఠశాల స్థానిక సమాజంతో సన్నిహితంగా కలిసిపోవాలని.. సామాజిక భాగస్వామ్యం పెరిగి జాతీయ అభివృద్ధికి ముఖ్యంగా సామాజిక సమగ్రతకు, జాతీయ సమగ్రతకు దోహదపడాలని కొఠారి కమిషన్ భావించి.. కామన్ స్కూల్ విధానంలో ప్రభుత్వ పాఠశాలలకు స్థానిక సంస్థల పాఠశాలకు మాత్రమే కాకుండా ప్రైవేటు పాఠశాలలకు కూడా కొఠారి కమిషన్ చోటు కల్పించింది. ప్రైవేటు పాఠశాలలు ప్రభుత్వ పాఠశాలలు మాదిరిగానే పనిచేస్తూ సేవా దృక్పథం కలిగి ఉండాలని భావించింది. ఆవాస ప్రాంత పాఠశాల విధానంలో ఒక పాఠశాలకు దాని ఆవాస ప్రాంతాన్ని గుర్తించి ఆ ప్రాంతంలో ఉన్న విద్యార్థులందరూ కుల, మత, జాతితో సంబంధం లేకుండా ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా సామాజిక హోదాతో సంబంధం లేకుండా ఆవాస ప్రాంతంలో ఉన్న పాఠశాలలకు మాత్రమే వెళ్లాలని.. సమాజంలోని ఉన్నత వర్గాల చెందిన వారు కూడా ఆవాస ప్రాంతం పాఠశాలకు రావడం వలన వారికి సాధారణ విద్యార్థులతో జీవిత అనుభవాలను పంచుకునే అవకాశం కలుగుతుందని, కుల మత తత్వాలకు అతీతంగా ప్రజల్లో లౌకిక తత్వం పెరుగుతుందని భావించింది. ఇలా మొత్తంగా ప్రభుత్వ విద్యా రంగం మీద ఆసక్తి కలిగి ఉంటాయని కమిషన్ అభిప్రాయపడింది. ఈ కామన్ స్కూల్ లక్ష్య సాధన కోసం ప్రభుత్వాలకి కాలవ్యవధిని నిర్ణయించింది. దీర్ఘకాలికంగా 20 సంవత్సరాల కాలంలో కామన్ స్కూల్‌లు ఏర్పాటు ప్రక్రియ పూర్తి చేయాలని భావించింది. ఆ గడువు 1986 తో ముగిసిపోయింది. ఇప్పటికీ పాలకులు పట్టించుకున్న దాఖలాలు లేవు.
కనీసం ఇలా చేయడం వల్లనైనా..
నూతన జాతీయ విద్యా విధానం (NEP- 2020) ప్రకారం విద్యలో పెట్టిన పెట్టుబడులు మానవ వనరులు తయారు చేస్తాయని, అవి ప్రపంచ మార్కెట్‌లను అభివృద్ధి పరుస్తాయని, నైపుణ్యవంతమైన ప్రపంచ స్థాయి విద్యార్థులను తయారు చేసే విధంగా రూపొందించబడింది. కానీ ఇందులో కామన్ స్కూల్ ఏర్పాటు దిశగా చర్యలు లేవు. కమిషన్ ఏర్పడి 60 ఏళ్లు గడిచిన కమిషన్ ఆశయ సాధనకు నాటి నుండి నేటి వరకు చిత్తశుద్ధితో కృషి చేసిన పాలకులు లేరు స్వతంత్ర భారతంలో విద్యా కమిషన్లు ఏర్పాటు చేయడం కమిషన్ల ప్రతిపాదనలను పక్కన పెట్టడం జరుగుతూనే ఉంది. పాలకులకు చిత్తశుద్ధి ఉంటే ఇప్పటికైనా కామన్ స్కూల్ ఆశయాన్ని అమలు చేసే దిశగా, భారత రాజ్యాంగ మౌలిక లక్ష్య సాధనకు కృషి చేయాల్సిన అవసరం ఉంది. మొన్నటి వరకు కేజీ టూ పీజీ, నేడు ఇంటర్నేషనల్ స్కూల్ అంటూ పాలకులు మాట్లాడుతున్నారు. ఏండ్లుగా కొనసాగుతున్న ప్రభుత్వ పాఠశాలల్లో మౌలిక సౌకర్యాలు కల్పించి, ప్రీ ప్రైమరీలను ప్రారంభించి, ఉన్నత పాఠశాలలను మినీ గురుకులాలుగా మార్చి, ఉపాధ్యాయుల కొరత లేకుండా చర్యలు తీసుకొని, కుల, మత, సామాజిక ఆర్థిక అసమానతలకు అతీతంగా అందరికీ నాణ్యమైన విద్య అందించే దిశగా చర్యలు తీసుకుంటే కామన్ స్కూల్ కల కొంతవరకైనా నిజమయ్యే అవకాశం ఉంటుంది.
-పాకాల శంకర్ గౌడ్
విద్యావేత్త
9848377734