- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
బీసీ ముఖ్యమంత్రి... బీజేపీ పార్టీకి లాభమా, నష్టమా?
తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల నేపథ్యంలో బీజేపీ కేంద్ర నాయకత్వం తెలంగాణపై మళ్ళీ ఫోకస్ చేస్తున్నట్లగా కనపడుతోంది. తెలంగాణలో కనీసం 25-30 సీట్లలో పాగా వేసి, హంగ్ అసెంబ్లీ రావడానికి బీజేపీ భారీ స్కెచ్ వేస్తోంది. ఈ నేపథ్యంలో కేంద్రంలో, రాష్ట్రంలో తమ ప్రభుత్వం ఉంటే డబుల్ ఇంజన్ సర్కార్ నినాదంతో పాటు బీసీ ముఖ్యమంత్రి పదవి ఆయుధాన్ని తెరపైకి తీసుకువచ్చి ఇతర పార్టీలను ఆగం చేయడానికి బీజేపీ కేంద్ర నాయకత్వం సమాయత్తమవుతోంది. తెలంగాణలో ప్రధాన పోటీ బీఆర్ఎస్, కాంగ్రెస్ మధ్యే ఉంటుందని, ఇప్పటి వరకు వచ్చిన మెజారిటీ సర్వేలన్నీ దాదాపు తేల్చగా, కాంగ్రెస్ పార్టీ మెజారిటీ స్థానాలను కైవసం చేసుకుంటుందని ప్రచారం జోరుగా సాగుతుంది. అకస్మాత్తుగా బీజేపీ బీసీ నినాదం తీసుకుంది. ఎక్కువ మంది బీసీ నేతలకు, మహిళలకు టిక్కెట్లు ఇవ్వడంతో పాటు, మేనిఫెస్టోలో కూడా బీసీ డిక్లరేషన్ హామీలతో పాటు, బీసీ వ్యక్తినే సీఎం అభ్యర్థిగా కేవలం బీజేపీ మాత్రమే ప్రకటించగలదని, ప్రధానమంత్రి నరేంద్ర మోదీ బీసీ సమాజం నుంచి వచ్చిన నాయకుడని కమల దళం ప్రచారం చేస్తున్నది.
నిర్ణయం వెనుక అసలు కథ...
తెలంగాణలో బీజేపీ గురించి మాట్లాడటం అంటే ఏడాది కిందటి వరకూ తెలంగాణలో బీఆర్ఎస్‌కు ప్రత్యామ్నాయం బీజేపి మాత్రమేనని, కాంగ్రెస్ ఎంత మాత్రం కాదని దుబ్బాక, జీహెచ్ఎంసీ, హుజురాబాద్ ఎన్నికల ఫలితాలు కూడా బలపరచాయి. కానీ తీరా ఎన్నికల సమరం వచ్చేసరికి, బీఆర్ఎస్‌తో ఢీ అంటే ఢీ అనే పరిస్థితి నుంచి అసలు బీజేపీ స్థానం ఎక్కడా అని వెతుక్కునే పరిస్థితికి వచ్చింది. 2019 లోక్‌సభ ఎన్నికలప్పుడు బీజేపీ అంచనాలకు మించి సంచలన విజయాలను నమోదు చేసింది. అయితే తర్వాత సంస్థాగతంగా బలపడటం మీద మాత్రం శ్రద్ధ పెట్టినట్లు కనపడలేదు, అన్నింటికీ మించి.. కేసీఆర్‌తో బీజేపీకి రహస్య దోస్తీ అనే ప్రచారానికి కూడా అవకాశం ఏర్పడింది. బీఆర్ఎస్‌ను అవినీతి పార్టీ అంటూ సాక్షాత్తు కేంద్ర అగ్ర నాయకత్వమే విమర్శిస్తున్నపుడు, మరి కేంద్ర దర్యాప్తు సంస్థలన్నీ వారి కనుసన్నల్లోనే ఉన్నప్పుడు ఎందుకు చర్యలు తీసుకోలేదనే అనుమానాలు సగటు తెలంగాణ ప్రజల్లో తీవ్రంగా ఉన్నాయి.
కాంగ్రెస్ పార్టీ కథ కంచికి చేరిపోయిందనుకుంటున్న తరుణంలో రేవంత్ రెడ్డి పీసీసీ అధ్యక్ష బాధ్యతలు చేపట్టడం, తర్వాత కర్ణాటక ఎన్నికలలో కాంగ్రెస్ భారీ విజయం సాధించడం, బీజేపీ, బీఅర్ఎస్ ఒకటే అన్న ప్రచారం తెలంగాణ కాంగ్రెస్‌కు కొండంత బలాన్ని ఇచ్చాయి. సహజంగానే కేసీఆర్ 10 సంవత్సరాల పాలనపై గల వ్యతిరేకత కూడ కాంగ్రెస్‌కు అనుకూలతగా మారుతోంది. దీన్నే క్యాష్ చేసుకోవాల్సిన కమలం పార్టీ తీరా ఎన్నికల సమయానికి ఆ స్థితిలో లేకపోవడం అభిమానులను తీవ్ర ఆవేదనకు గురి చేస్తోంది. ఇదే సమయంలో కేసీఆర్, కేటీఆర్, కవితలు కూడా నరేంద్ర మోడీ గురించి పెద్దగా మాట కూడా మాట్లాడటం లేదు. దాంతో జనాల మధ్య అనుమానాలు మరింతగా ముదిరిపోయాయి. ఈ సంకట పరిస్థితుల నుంచి బయట వెళ్లడానికి ఒకవైపు, గెలుపు కోసం తీవ్రంగా పోరాడుతున్న కాంగ్రెస్ పార్టీకి అధికారం దూరం చేయడానికి మరొకవైపు పనిచేస్తుందని బీజేపీ అగ్ర నాయకత్వం ఈ భారీ స్కెచ్ వేసిందని బీజేపీ అనుకూల విమర్శకులు సైతం అభిప్రాయపడుతున్నారు.
ముక్కోణపు పోటీగా మార్చేందుకు..
బీజేపీ అనగానే కేవలం బ్రాహ్మణ బనియన్ పార్టీగా ముద్రపడిన మరకను తొలగించుకునే ప్రయత్నంలో, బీజేపీ వెనుకబడిన దళితుల మైనార్టీల నాయకులకు అనేక రకాల పదవులను కట్టబెడుతున్నది. అందుకే దళిత వ్యతిరేక పార్టీ ముద్ర నుంచి బయట పడేందుకు రాంనాథ్ కోవింద్‌ను, గిరిజనులకు చేరువేయ్యేందుకు ద్రౌపది ముర్మును రాష్ట్రపతి చేసిన విషయం తెలిసిందే. ఆయా వర్గాలను తమ వైపునకు తిప్పుకునేందుకు బీజేపీ ఎప్పటికప్పుడు సామాజిక సమీకరణలకు ప్రాధాన్యత ఇస్తూ వస్తోంది. తెలంగాణలో కూడా బీసీ ముఖ్యమంత్రి అంశం తమకు కలిసి వస్తుందని కమల నాథులు భావిస్తున్నారు. కాగా రాష్ట్రంలో మొత్తం జనాభా సుమారు 4. కోట్లు ఉండగా ఇందులో బీసీల జనాభా మొత్తం 2 కోట్ల 18 లక్షల వరకు ఉంది. రాష్ట్రంలో బీసీల జనాభా 53.50 శాతంగా ఉంది. ఎస్సీలు 18.48, ఎస్టీలు 11.74, మైనార్టీలు 10.6 శాతం, ఓసీలు 5 శాతం ఉండగా, బీసీల భారీ ఓటు బ్యాంకు ఆయా పార్టీలకు కీలకంగా మారింది. దీంతో బీసీల ఓటు బ్యాంకుపై కన్నేసిన బీజేపీ ఈ అసెంబ్లీ ఎన్నికల సందర్భంగా తాము అధికారంలోకి వస్తే బీసీనే ముఖ్యమంత్రి చేస్తామనే నినాదంతో ముందుకు వెళుతోంది...అసలు సీఎం అభ్యర్థి ఎవరన్నది చెప్పకుండానే.... బీసీ సమాజం నుంచి ముఖ్యమంత్రిని. ఎస్సీ,ఎస్టీ , ఓసీల నుంచి ఉప ముఖ్యమంత్రులను చేస్తామంటూ ఆలోచనలు కలిగి ఉంది.. బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీలు బీసీలకు ఇచ్చిన టికెట్ల కంటే, ఎక్కువ సీట్లే ఇస్తున్న కమలదళ నేతలు రాష్ట్ర అసెంబ్లీ ఎన్నికలను ముక్కోణపు పోటీగా మార్చేందుకు తీవ్ర ప్రయత్నం చేస్తుంది. పైగా బీఆర్ఎస్, కాంగ్రెస్ పార్టీల్లో బీసీ నేతలకు తగినంత ప్రాధాన్యత, ప్రాతినిధ్యం దక్కడం లేదన్న ఆవేదన బీసీ వర్గాల్లో ఉన్నందున, దాన్ని అనుకూలంగా మలచుకోవడానికి కమలనాథులు తర్జన భర్జనలు చేస్తున్నారు.
మరి లాభమెంత?
తెలంగాణలో బీసీలు ఎక్కువ కాబట్టి.. బీసీలకు అనుకూలమైన నిర్ణయాలు తీసుకోవడం మంచిదే. బీసీ అభ్యర్థులను ఎక్కువ మందిని నిలబెడతామని చెప్పడం కూడా న్యాయబద్ధమైన ఆలోచనే. బీసీ నేతను ముఖ్యమంత్రిగా చేస్తే, అది సామాజిక న్యాయానికి అద్దం పడుతుందని విశ్లేషకులు సైతం చెబుతున్నారు. అయితే చాలామందిలో మెదళ్లలో తొలుస్తున్న ప్రశ్న మాత్రం...తెలంగాణలో కమలదళం బీసీ నేతను ముఖ్యమంత్రిగా ప్రకటిస్తే అది బీజేపీకి లాభమా, నష్టమా? మరి బీజేపీకి లాభమైతే నష్టమెవ్వరికి అనే చర్చ మొదలైంది. మెజార్టీ కులాల విషయంలో సోషల్ ఇంజనీరింగ్ చేసిన రాష్ట్రాలలో బీజేపీ ఘన విజయాలు సాధించిన సంఘటనలు కోకొల్లలు. అన్ని కోణాల నుంచే ఆలోచించిన పిదపనే బీజేపీ ఈ బీసీలకు సీఎం పదవి నిర్ణయాన్ని తీసుకుందని విశ్లేషకులు అంటున్నారు. బీసీలతో పాటు జనాభాలో సగభాగం ఉన్న మహిళలను ఆకట్టుకునేందుకు కూడా ఆ పార్టీ ఎత్తులు వేస్తోంది. ఇప్పటికే మహిళా రిజర్వేషన్ల బిల్లును పాస్ చేసిన ఘనత తమదేనంటూ ఎలుగెత్తి చాటుకుంటున్న బీజేపీ, టికెట్ల కేటాయింపులోనూ తగినంత ప్రాతినిధ్యం, ప్రాధాన్యత కల్పించనున్నట్టు తెలుస్తోంది.
ప్రధాన మంత్రి నరేంద్ర మోదీనే స్వయంగా బీసీ అన్న విషయాన్ని పలు వేదికలపై చెబుతున్న ఆ పార్టీ నేతలు, బీసీ కమిషన్‌కు రాజ్యాంగబద్ధత, కేంద్ర మంత్రివర్గంలో అత్యధిక సంఖ్యలో బీసీలకు చోటు, బీసీ కులవృత్తులకు ఆసరా కల్పించే పీఎం-విశ్వకర్మ వంటి పథకాల గురించి కూడా విస్తృతంగా ప్రచారం చేస్తున్నారు. అయితే బీజేపీ మేనిఫెస్టోలో ఉచిత హామీలు ఎక్కువగా ఉండవని తెలుస్తోంది. బీసీ నినాదంతో ముందుకెళ్తే కచ్చితంగా నష్టం కంటే లాభాలే ఎక్కువని విశ్లేషకులు వ్యాఖ్యానిస్తున్నారు. అలాగే ప్రధాని నరేంద్ర మోదీ భారీ ఉచితాలకు వ్యతిరేకం కాబట్టి, మేనిఫెస్టోలో ఆకట్టుకునే అంశాలు ఏమి ఉంటాయోనని చర్చ ఒకవైపు సాగుతోంది. మరోవైపున బీసీ నినాదం ఏ పార్టీ కొంప కొంపముంచుతుందో లేదా ఏ పార్టీకి అధికారం దూరం చేస్తుందో తెలియని అయోమయ పరిస్థితి మాత్రం బీజేపీ సృష్టించిందనడంలో అనుమానమే లేదు.
డా. బి.వి. కేశవులు. ఎండీ
చైర్మన్, తెలంగాణ మేధావుల సంఘం
85010 61659