- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
- సినిమా రివ్యూ
- Bigg Boss Telugu 8
నిన్ను ఎందుకు నమ్మాలి జగన్?
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు విన్నవారు మురిసిపోయారు. నవరత్నాల పేరిట ప్రజాధనాన్ని పంపిణీ చేయడంతో సంక్షేమ రాజ్యం వచ్చిందని సంబరపడ్డారు. యాత్రల పేరుతో జాతర చేసి రోజుల తరబడి తిరిగిన జగన్‌ను చూసి జనం జాలిపడ్డారు. అతడి నిజస్వరూపాన్ని పాపం ప్రజలు గుర్తించలేకపోయారు. తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇంతటి వ్యతిరేకతను ఎలా మూటగట్టుకున్నారు? ఆయనలో ఉన్న అహంకారం, ప్రతీకారేచ్ఛే ఇందుకు కారణం. బూతులను అధికారభాషగా మార్చారు. అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేసి అప్పులకుప్పగా మార్చేశారు. మాట తప్పను అంటూ పదేపదే నాలుక మడత వేశారు. అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. ప్రజల్లో అభాసుపాలయ్యామని ఆలస్యంగా గుర్తించాక, మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో కొత్త కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. కానీ ఏ వర్గాన్ని, ఏ రంగాన్ని బాగు చేశారని మిమ్మల్ని నమ్మాలి? ప్రజల గుండెల్లో నిలిచే విధంగా పరిపాలించాల్సిన జగన్ రెడ్డి వారి గుండెల్లో గునపాలు దింపారు.
ఏపీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్‌పై ప్రజల్లో అపనమ్మకం కలిగిందనే చేదు నిజాన్ని వైసీపీ ఆలస్యంగా గుర్తించినట్లుంది. అందుకే మా నమ్మకం నువ్వే జగన్ అనే పేరుతో ఈ కార్యక్రమానికి శ్రీకారం చుట్టారు. ప్రజలు మెచ్చి, నచ్చి మా నమ్మకం నువ్వే అని వారి నుంచి స్పందన రావాలి. కానీ జగన్ రెడ్డే తనను నమ్మండి, నమ్మండి అని ప్రజలను ప్రాధేయపడుతున్నారు. మా నమ్మకం నువ్వే జగన్ అనేది పార్టీ కార్యక్రమమా, ప్రభుత్వ కార్యక్రమమా? ప్రభుత్వ సొమ్ముతో పార్టీ కార్యక్రమాలు చేపడుతున్నారు. పార్టీ కార్యక్రమానికి, ప్రభుత్వ కార్యక్రమానికి మధ్య ఉన్న తేడా జగన్ రెడ్డికి అర్థంకావడం లేదు. ప్రభుత్వం వద్ద జీతాలు తీసుకున్నటువంటి వాలంటీర్లు పార్టీ కార్యక్రమాల్లో ఎలా పాల్గొంటారు? ఈ కార్యక్రమాన్ని విజయవంతం చేసేందుకు వాలంటీర్లతో పాటు సచివాలయ సిబ్బంది, గృహ సారథులపై బాధ్యతలు పెట్టారు.
రంగుల నుంచి ఫొటోల పిచ్చి
ఒకవైపు రంగుల పిచ్చితో ప్రజాధనాన్ని దుర్వినియోగం చేశారు. ఇప్పుడు ఫోటోల పిచ్చి పట్టినట్లుంది. పాసు పుస్తకాలు, యాడ్స్, బ్యానర్లు, పోస్టర్లు, మరుగుదొడ్లు. చెత్త బండ్లు.. ఇలా వేటినీ వదలకుండా జగన్ బొమ్మలు కనిపిస్తున్నాయి. ఇప్పుడు తాజాగా స్టిక్కర్లపై ఆయన విశ్వరూపాన్ని ప్రజలకు చూపిస్తున్నారు. ఇంటి పై స్టిక్కర్లు వేయడమంటే లబ్దిదారులు అగౌరవంగా భావిస్తున్నారు. లబ్ధిదారుల నిస్సహాయత, అశక్తత, ఆర్థిక అవసరాలు లాంటి బలహీనతలను బహిర్గతం చేసి వారిని బజారుకీడుస్తున్నారు. వీళ్లు ప్రభుత్వంపై ఆధారపడి బతుకుతున్నారనే చులకన భావం కలిగిస్తున్నారు. లబ్ధిదారుల ఇంటిపై స్టికర్లతో ఆగుతారా? లేక ఒంటిపై కూడా ఏదో ఒక రూపంలో ముద్రవేస్తారేమోనని ప్రజలు భయపడుతున్నారు. తన ప్రభుత్వానికి చరమగీతం పాడేందుకు ప్రజలు సిద్దపడ్డారన్న విషయం జగన్ ప్రభుత్వానికి అర్థమైంది.
మాటకు మడతేసిన సీఎం
జగన్మోహన్ రెడ్డి ముఖ్యమంత్రిగా ప్రమాణస్వీకారం చేసిన రోజు, ఆ తర్వాత ఆయన చేసిన ప్రసంగాలు విన్నవారు మురిసిపోయారు. అవినీతికి తావులేని ఆదర్శపాలన అందిస్తారని, రాష్ట్రాన్ని అభివృద్ధి పథంలో నడిపిస్తారని ఆశ పడ్డారు. అదే సమయంలో ప్రజావేదికను కూల్చివేయడం చూసి కూడా ఆయన వికృత ఆలోచనలను అర్థం చేసుకోలేకపోయారు. నవరత్నాల పేరిట ప్రజాధనాన్ని పంపిణీ చేయడంతో సంక్షేమ రాజ్యం వచ్చిందని సంబర పడ్డారు. యాత్రల పేరుతో జాతర చేసి రోజుల తరబడి తిరిగిన జగన్‌ను చూసి జనం జాలిపడ్డారు. అతడి నిజస్వరూపాన్ని పాపం ప్రజలు గుర్తించలేకపోయారు. తిరుగులేని ప్రజాదరణతో అధికారంలోకి వచ్చిన ముఖ్యమంత్రి ఇంతటి వ్యతిరేకతను ఎలా మూటగట్టుకున్నారు? ఆయనలో ఉన్న అహంకారం, ప్రతీకారేచ్ఛే ఇందుకు కారణం. బూతులను అధికారభాషగా మార్చారు. అభివృద్ధి ఆనవాళ్లు లేకుండా చేసి అప్పులకుప్పగా మార్చేశారు. మాట తప్పను అంటూ పదేపదే నాలుక మడత వేశారు. అవినీతికి తావులేని పాలన అందిస్తానని అవినీతిని వ్యవస్థీకృతం చేశారు. అధికార యంత్రాంగాన్ని తన బానిస వ్యవస్థగా మార్చేశారు. గిట్టనివారి పైకి జేసీబీ, ఏసీబీ, పీసీబీలను ప్రయోగించారు. ప్రతిపక్షంలో ఉన్నప్పుడు బాదుడే బాదుడు అని గత ప్రభుత్వాన్ని విమర్శించిన జగన్‌రెడ్డి.. ఇప్పుడు అధికారంలోకి వచ్చిన తర్వాత ప్రజలకు సంక్షేమం అనే మత్తులో సమస్త పన్నులు పెంచి పేద ప్రజల నడ్డి విరిచారు. ఇప్పుడు రాష్ట్రం సర్వనాశనం అయిందని అందరూ అఘోరించాల్సిన పరిస్థితి వచ్చింది.
అమ్మఒడితో... నాన్నబుడ్డీతో!
ఏ వర్గాన్ని, ఏ రంగాన్ని బాగు చేశారని మిమ్మల్ని నమ్మాలి? ముందు వీటికి సమాధానం చెప్పండి? ప్రజాధనంతో నిర్మించిన ప్రజావేదికను కూలగొట్టి విధ్వంస పాలన మొదలు పెట్టినందుకా? మూడు రాజధానులు ప్రకటించి అమరావతిని నాశనం చేసి రాష్ట్రానికి రాజధానే లేకుండా చేసినందుకా? 75 శాతం పూర్తయిన పోలవరాన్ని నిలిపివేసినందుకా? ఉచిత ఇసుక విధానాన్ని రద్దు చేసి ఇసుకను అస్మదీయులకు దోచిపెడుతున్నందుకా? దశలవారీ మద్య నిషేధం పేరుతో, రేట్లు పెంచి జనం జేబులు గుల్లచేస్తూ, నకిలీ మద్యంతో పేదల ప్రాణాలు తీసినందుకా? ప్రతి ఏడాది జనవరిలో జాబ్ కేలండర్‌తో, ఖాళీగా ఉన్న 2.30 లక్షల ఉద్యోగాలు భర్తీ చేస్తామని చెప్పి నిరుద్యోగ యువతను మోసం చేసినందుకా? వారంలో సీపీఎస్ రద్దు చేస్తానని ఉద్యోగులను నడిరోడ్డుపై నిలబెట్టినందుగా, ధ్వంసం అయిన రోడ్లను బాగుచెయ్యలేక పోయినందుకా, మీ పాలనలో కొత్త పరిశ్రమలు రాకపోగా ఉన్న పరిశ్రమలు కూడా పొరుగు రాష్ట్రాలకు తరలిపోయినందుకా? పన్నుల మోత, ఛార్జీల మోతతో పేదలపై భారం మోపినందుకా? ఓ చేత్తో అమ్మఒడితో మరో చేత్తో నాన్నబుడ్డితో పేదల రక్తం తాగుతున్నందుకా? కరోనా సమయంలో మాస్కు అడిగిన దళిత డాక్టర్ సుధాకర్ ప్రాణాలను నిర్దయగా తీసినందుకా? ఏడాదికి 5 లక్షల ఇళ్లు నిర్మిస్తానని 5 ఇళ్లు మాత్రమే నిర్మించినందుకా?
రైతుల ఆత్మహత్యలు లేని రాష్ట్రంగా చేస్తానని అధికారంలోకి వచ్చి ఆత్మహత్యల ఆంధ్రప్రదేశ్‌గా మార్చినందుకా? ఆంధ్రప్రదేశ్‌ను డ్రగ్స్, గంజాయి, జూదానికి కేంద్రంగా మార్చినందుకా? సలహాదారుల పేరుతో ప్రజల సొమ్ము అప్పనంగా దోచిపెడుతున్నందుకా? సొంత పార్టీ ఎమ్మెల్యేలపైనే టెలిఫోన్ ట్యాపింగ్ కు పాల్పడుతున్నందుకా? ల్యాండ్, సాండ్, వైన్, మైనింగ్ మాఫియాతో లక్షల కోట్లు అవినీతికి పాల్పడుతున్నందుకా? సొంత బాబాయి వివేకానందరెడ్డి హత్య విషయంలో గొడ్డలి పోటును ప్రతిపక్షనాయకుడుపై నెట్టినందుకా, నాడు సీబీఐ కావాలని, నేడు వద్దని కోర్టుకు వెళ్లినందుకా, నేడు హంతకులకు కొమ్ము కాస్తున్నందుకా నిన్ను ఎందుకు నమ్మాలి? న్యాయమూర్తులను దూషిస్తూ, న్యాయవ్యవస్థపై దాడికి తెగబడినందుకా, రాష్ట్ర ఎన్నికల ఎన్నికల కమిషనర్‌కు కులం ముద్రవేసి దాడి చేసినందుకా? జీవో నెం. 2430 తెచ్చి పత్రికా స్వేచ్ఛకు సంకెళ్లు వేసినందుకా? స్థానిక సంస్థల నిధులు దారిమళ్లించి సర్పంచ్‌ల అధికారాలకు కోతకోసినందుకా? ఎస్సీ, ఎస్టీలపైనే అట్రాసిటీ కేసులు పెట్టినందుకా? మహిళలపై జరిగే అఘాయిత్యాల్లో దేశంలోనే ఏపీ నెంబర్ 1గా ఉన్నందుకా? 34 శాతం వున్న బీసీ రిజర్వేషన్లను 24 శాతానికి తగ్గించినందుకా, బీసీ కార్పొరేషన్లను ఉత్సవ విగ్రహాలుగా మార్చినందుకా? బీసీ సబ్ ప్లాన్, ఎస్సీ, ఎస్టీ సబ్ ప్లాన్ నిధులు దారి మళ్లించినందుకా? ధరల పెంపు, పన్నుల పెంపు, అప్పుల పెంపుతో ఒక్కో కుటుంబంపై రూ.2.50 లక్షల భారం మోపినందుకా? అన్న క్యాంటీన్లు రద్దు చేసినందుకా, చంద్రన్న బీమా, పెళ్లి కానుకలు, సంక్రాంతి, రంజాన్, క్రిస్మస్ కానుకలు రద్దు చేసినందుకా? వైసీపీ ఎమ్మెల్సీ అనంతబాబు దళితుడైన తన మాజీ కారు డ్రైవర్ సుబ్రమణ్యంను హత్య చేసి డోర్ డెలివరీ చేసినందుకా? చెప్పండి ముఖ్యమంత్రి గారు? మిమ్మల్ని ఎందుకు ఎలా నమ్మాలో?
చివరకు మిగిలేవి పరాభవాలే
4 ఏళ్లలో జగన్ రెడ్డి 400 మోసాలు చేశారు. పార్టీ పట్ల, ప్రభుత్వం పట్ల ప్రజల్లో తీవ్రమైన వ్యతిరేకత, అపనమ్మకం పెరిగింది. ఎన్నికలు దగ్గర పడుతున్న క్రమంలో కుల, మత, ప్రాంతీయ విద్వేషాలు, మూడు రాజధానులు, నవరత్నాలు, వాలంటీర్ల వ్యవస్థ, నీలి మీడియా ప్రజలపై పెద్దగా ప్రభావం చూపలేదు. అవి సత్ఫలితాలు ఇవ్వకపోవడంతో కొత్త నాటకానికి శ్రీకారం చుట్టారు. ఒకవైపు సొంత పార్టీ ఎమ్మెల్యేల నుంచి వస్తున్న తిరుగుబాటు, ధిక్కారస్వరం, అసంతృప్తులతో ఉక్కిరిబిక్కిరి అవుతున్నారు. గడప గడపకు వైసీపీ కార్యక్రమాన్ని ప్రజలు తిరస్కరించారు. ఎమ్మెల్యేలు, మంత్రులను ప్రజలు అడుగడుగునా నిలదీశారు. ప్రజాప్రతినిధులు తిరిగి ప్రజలకు ముఖం చూపించలేక ఈ కార్యక్రమానికి వాలంటీర్లను పంపిస్తున్నారు. జగన్ రెడ్డి సొంత సొమ్ములు పందేరం చేసినట్లుగా భ్రమింపజేసేందుకు తాపత్రయపడుతున్నారు. ప్రచార ఆర్భాటమే తప్ప ప్రజలకు ప్రయోజనం ఏమీ లేదు. మాటలు కోటలు దాటుతున్నాయి, చేతలు మాత్రం గడప దాటడంలేదు. నమ్మకానికే బ్రాండ్ అంబాసిడర్ అని ఊదరగొట్టారు. కానీ మోసాలకు, అబద్దాలకు బ్రాoడ్ అంబాసిడర్‌గా మిగిలిపోయారు. ప్రజల గుండెల్లో నిలిచే విధంగా పరిపాలించాల్సిన జగన్ రెడ్డి వారి గుండెల్లో గునపాలు దింపారు. ఇంకా మీ పగటి వేషాలను, మీ జిమ్మిక్కులను నమ్మి జనం ఓట్లు గుమ్మరిస్తారని మురిసిపోవద్దు. ప్రజల నమ్మకాన్ని జగన్ పొందనంత కాలం ఈ పరాభవాలు తప్పవు.
మన్నవ సుబ్బారావు
గుంటూరు మిర్చి యార్డ్ మాజీ చైర్మన్
99497 77727
పబ్లిక్ పల్స్ పేజీకి, సాహితీ సౌరభం పేజీకి రచనలు పంపవలసిన మెయిల్ ఐడీ [email protected], వాట్సప్ నెంబర్ 7995866672