సామాజికం: జర్నలిస్టులకు భద్రత ఏది?

by Ravi |   ( Updated:2022-09-03 13:33:39.0  )
సామాజికం: జర్నలిస్టులకు భద్రత ఏది?
X

'ఉదయం లేవగానే మన ముందర ఉండేది దినపత్రికయే. దానిని తిరిగేయనిదే మిగతా కార్యకలాపాలను కొనసాగించలేని పరిస్థితి. మరి అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతి సమాచారాన్ని మోసుకొని మన ముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే. ఎక్కడ ఏం జరిగినా క్షణాలలో సంఘటన స్థలంలోకి వెళ్లి వార్తలు సేకరించడం, ఎక్కడా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలు జరగకుండా చూడడం వారి విధి. పాత్రికేయులకు ఫలానా సమయమంటూ ఏమీ ఉండదు. ఏ అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చినా సంఘటన స్థలాలకు చేరుకుంటారు.'

సమాజంలో పాలకపక్షాలు నిస్వార్థంగా, నిష్పక్షపాతంగా, అవినీతిరహితంగా, అభివృద్ధిని కాంక్షిస్తూ తమ పాలనను కొనసాగించడంలో ప్రసార మాధ్యమాలు కీలకపాత్ర పోషిస్తాయనడంలో సందేహం లేదు. స్వాతంత్ర్య సంగ్రామంలో యావత్ భారతావనికి ప్రేరణ కలిగించింది పత్రికలే. భూమి మీద ఎక్కడేమీ జరుగుతుందో? ఎలా జరుగుతుందో? ప్రతి విషయాన్ని జనాలకు చేరవేసేది ప్రసార మాధ్యమాలే. పరిణామ క్రమంలో భాగంగా శాస్త్ర, సాంకేతికరంగాలలో పలు విప్లవాత్మక మార్పులు రావడంతో ప్రసార మాధ్యమాల సంఖ్య సైతం పెనుగుతూ వస్తున్నది.

అయితేనేం, తనకుండే ప్రాధాన్యం అలాగే ఉంటుంది. ఎంతలా అంటే, మీడియా తలుచుకుంటే 'జీరోను హీరో చేయగలదు, అదే హీరో క్రమం తప్పితే జీరోనూ చేయగలదు' ప్రజలకు, ప్రసార మాధ్యమాలకూ మధ్య అవినాభావ సంబంధం ఉంటుంది. మనుషులు ఏ సమాచారాన్ని అయినా వీటి ద్వారానే తెలుసుకుంటూ, వాటికనుగుణంగా నడుచుకుంటూ ఉంటారు. అందుకే మీడియా ప్రజల పక్షాన నిలబడి పెద్దన్న పాత్ర పోషిస్తూ, సమాజానికి అండగా ఉంటుంది. తప్పుచేసేవారికి వణుకు పుట్టించి, అలాంటి ఆలోచన మరెవ్వరికీ రాకుండా ఉండటానికి దారులు వేస్తూ ఉంటుంది.

పత్రిక చూడకపోతే

ఉదయం లేవగానే మన ముందర ఉండేది దినపత్రికయే. దానిని తిరిగేయనిదే మిగతా కార్యకలాపాలను కొనసాగించలేని పరిస్థితి. మరి అలాంటి దినపత్రిక సమాజంలోని ప్రతి సమాచారాన్ని మోసుకొని మన ముందుకు వస్తుందంటే కారణం జర్నలిస్టులే. ఎక్కడ ఏం జరిగినా క్షణాలలో సంఘటన స్థలంలోకి వెళ్లి వార్తలు సేకరించడం, ఎక్కడా అవినీతి, అక్రమాలు, దౌర్జన్యాలు, మోసాలు జరగకుండా చూడడం వారి విధి. పాత్రికేయులకు ఫలానా సమయమంటూ ఏమీ ఉండదు. ఏ అర్ధరాత్రి ఫోన్ కాల్ వచ్చినా సంఘటన స్థలాలకు చేరుకుంటారు. అవినీతి కార్యకలాపాలు కొనసాగుతున్నాయని తెలిస్తే ధైర్యంతో కెమెరాలు, పెన్నులు తీసుకుని బయలుదేరుతారు.

సాహసాలకూ పూనుకుని ప్రపంచానికి వార్తలు అందిస్తారు. నిజాన్ని నిర్భయంగా రాసినందుకు వారి మీద దాడులు జరిగిన సందర్భాలూ ఉన్నాయి. ఇటీవల కుత్బుల్లాపూర్ నియోజకవర్గం, జీడిమెట్ల పోలీస్ స్టేషన్ పరిధి ప్రభుత్వ స్థలంలో అక్రమ నిర్మాణం జరుగుతుందని సమాచారం వచ్చిన వెంటనే అక్కడకు వెళ్లిన సీనియర్ జర్నలిస్ట్, ప్రజాజ్వాల ఎడిటర్ మాధగారి సుగ్రీవుడు ముదిరాజ్, ఆదాబ్ హైదరాబాద్ రిపోర్టర్ ఎల్లంపల్లి నర్సింహులు ముదిరాజ్‌ను కొంతమంది దుండగులు విచక్షణారహితంగా కొట్టారు.

వారి కుటుంబ సభ్యులను చంపుతామని బెదిరించారు. ఇలాంటి పరిస్థితులలో వృత్తిని కొనసాగిస్తున్న పాత్రికేయులకు ఏడాదిలో ఏవో పండుగల నిమిత్తం రెండు, మూడురోజులు సెలవులు మినహాయిస్తే మిగతా కాలమంతా పని చేయాల్సిందే. ఇదంతా చేస్తున్నప్పటికీ వారు అందుకునే నెలసరి వేతనం చాలా తక్కువ. కొన్ని పత్రికలు, సంస్థలు మాత్రమే నెలసరి వేతనాలు ఇస్తున్నాయి. మరి కొన్ని పత్రికలు వారు సేకరించిన వార్తలను బట్టి జీతాలు ఇస్తుంటాయి.

గౌరవం కోసమే

అయినా, వీరు ఈ వృత్తిని ఇష్టపడి స్వీకరించడానికి గల కారణం సమాజంలో వీరు పొందే గౌరవం మాత్రమే. ప్రజల పక్షాన నిలిచి ప్రతి సమస్య పరిష్కారానికి ఒకరకంగా ప్రతిపక్ష పాత్ర పోషిస్తారనడంలో అతిశయోక్తి లేదు. దిన పత్రికలలో, టీవీ న్యూస్ చానల్స్‌లో పని చేసేవారికీ ఒక గుర్తింపు ఉన్నది. సమాజ శ్రేయస్సు కోసం సాహసాలు చేస్తున్న జర్నలిస్టుల రక్షణ బాధ్యతను ప్రభుత్వం తీసుకోవాలి. ప్రజానీకం కూడా వారికి అవడగా నిలవాలి. జర్నలిస్టులపై దాడి జరిగినవెంటనే ప్రభుత్వం స్పందించి తక్షణమే చర్యలు తీసుకోవాలి. ఇలాంటి సంఘటనలు పునరావృతం కాకుండా నిందితులను కఠినంగా శిక్షించాలి.

డా. పోలం సైదులు ముదిరాజ్

94419 30361

Advertisement

Next Story

Most Viewed