తెలంగాణ భాషకు పట్టమెపుడు?

by Ravi |   ( Updated:2022-09-09 04:37:57.0  )
తెలంగాణ భాషకు పట్టమెపుడు?
X

తెలంగాణ వైతాళికుడిగా పేరొందిన కాళోజీ నిరంతర ఉద్యమ జీవి. స్వాతంత్య్ర ఉద్యమంలో పాల్గొని నిజాం రాజును, రజాకారుల అరాచకాలను ఎదిరించి జైలు జీవితం గడిపారు. తెలంగాణ కోసం తన కలంతో, గళంతో ప్రజలలో చైతన్యం కలిగించి మహాకవి. ఉద్యమమే ఊపిరిగా బతికిన మహనీయుడు. కాళోజీ రచనలలో తెలంగాణ భాష, యాస, సంస్కృతి కనిపించేది. వ్యవహారిక భాషయే 'జీవభాష' అనేవారు. కాళోజీ కర్ణాటక రాష్ట్రంలో పుట్టినా, తెలంగాణలోని హన్మకొండ సమీపంలో ఉన్న మడికొండలో స్థిరపడ్డారు. తెలంగాణ ఏర్పాటును కాంక్షిస్తూ 'వీర తెలంగాణ, ముమ్మాటికి వేరు తెలంగాణ' అంటూ ఆనాడే ధీరత్వం చాటారు.

అక్షరాలే ఆయుధంగా

తెలంగాణ భాష పట్ల వివక్షను కాళోజీ ఎంతమాత్రం సహించలేదు. 'అంత అగ్గువగున్నదా తెలంగాణ భాష? నేను గిట్లనే మాట్లాడతా, గిట్లనే రాస్తా' అని స్పష్టం చేశారు. 'జిద్దుకు రాయాలే. మన యాసలనే మన భాషలనే మన సంస్కృతి దాగి ఉంది. మనం పోగొట్టుకున్న మన బతుకును బతికించుకోవాలంటే మన యాసలోనే రాయాలి. మన యాసే మన భాష చానా ముఖ్యం. గిట్లా రాస్తే అర్థమయితదా? అని ముందరే మనను మనం తక్కువ చేసుకునే బానిస భావన పోవాలని' సెప్పిండ్రు.

తెలంగాణా 'యాసనెపుడు యీసడించు భాషీయుల సుహృద్భావన ఎంతని వర్ణించుట సిగ్గుచేటు' అన్నారు. రెండున్నర జిల్లాలదే దండి భాష అయినప్పుడు తక్కినోళ్ల నోళ్లయాస తొక్కబడినప్పుడు ప్రత్యేకంగా రాజ్యం పాలు కోరడం తప్పదన్నారు. కాళోజీ ఇతరుల వలె అక్షరాలను అడ్డు పెట్టుకొని ఎదగకుండా తన అక్షరాలు ఆయుధంగా మలిచి ప్రజలను ఆలోచింపజేశారు. 'ఒక్క సిరా చుక్క లక్షల మెదళ్లకు కదలిక' అంటూ ఆయన సహజ శైలిలోనే కవితలు రాసిండ్రు.

ప్రాంతీయ భాష దృక్పధంతో

కాళోజీ తన కవితల ద్వారా సమకాలీన సామాజిక సమస్యలపై నిర్మొహమాటంగా, నిక్కచ్చిగా, కటువుగా, స్పందిస్తూ అక్షరాయుధాలను సంధించేవారు. నీళ్లు, నిధులు దోచుకోవడమే కాకుండా మన భాషా సంస్కృతి దోపిడికి గురవుతోందని తూటాలాంటి పదాలతో ఆ కవిత్వాన్ని రచించి ఉద్యమాన్ని రగిలించి 'నా గొడవ' ఆత్మకతను తెలంగాణ యాసలోనే రాశారు. 'మర్రి విత్తనమంత చిన్న పద్యంలో మహావృక్షమంత అర్ధాన్ని చెప్పేవాడే మహాకవి' అన్నారాయన. భాషా సాంస్కృతిక రంగాలలో కాళోజీ చేసిన కృషి విశేషమైనది. తెలంగాణ భాష, యాస, సంస్కృతి కోసం ఇంత చేసినా ఇప్పటికీ పూర్తి స్థాయి తెలంగాణ భాషను పాఠ్యపుస్తకాలలో చేర్చకపోవడం, యాసను అన్ని రంగాలలో ఉపయోగించకపోవడం, పోనీ భాషకు సంబంధించి తన నిర్ణయాన్ని ఇంకా ప్రకటించకపోవడం బాధాకరం.

ప్రభుత్వం తెలంగాణ భాషకు సంబంధించి ఏదైనా కీలక నిర్ణయం తీసుకుంటే నిఘంటువు జానపదుల పదాలను, వృత్తులకు సంబంధించిన పదాలను ప్రామాణికంగా తీసుకుని రూపొందించుకోవాలి. కాళోజీ తెలంగాణ పల్లె పైరుగాలి నుంచి వీచిన భాషనే సాహిత్య భాషగా మార్చారు. కాళోజీ వ్యవహారిక భాషకు పట్టం కట్టి 'ప్రజాకవి' గా పేరొందాడు. ఆయన జన్మదినాన్ని తెలంగాణ ప్రభుత్వం 'తెలంగాణ భాషా దినోత్సవం' గా ప్రకటించి నిర్వహించడం హర్షనీయం. ప్రాంతీయ భాష దృక్పధంతో రాసిన ఆయన కవిత్వం ముందు తరాలకు మార్గదర్శనం.

Also Read : అక్షర కర్షకుడు కాళోజీ

(నేడు తెలంగాణ భాషా దినోత్సవం)

మారెపల్లి సునీత,

తెలుగు ఉపాధ్యాయిని

9866919456

Advertisement

Next Story

Most Viewed