సీపీఎస్‌ రద్దు ఎప్పుడు...?

by Ravi |   ( Updated:2024-08-06 01:00:24.0  )
సీపీఎస్‌ రద్దు ఎప్పుడు...?
X

తాజా గణాంకాల ప్రకారం, తెలంగాణ రాష్ట్రంలో 3,69,200 మంది రెగ్యులర్‌ ఉద్యోగులు ఉన్నారు. వీరిలో 40 శాతానికి పైగా ఉద్యోగులు సీపీఎస్‌ విధానంతో నష్టపోతున్నారు. 2004 తర్వాత నియామకమైన వారంతా పాత పెన్షన్‌ విధానం కోల్పోయారు. వీరంతా సీపీఎస్‌ను రద్దుచేయాలని కోరుతున్నారు. ఉద్యోగులకు కాంగ్రెస్‌ పార్టీ హామీ ఇచ్చిన మేరకు సీపీఎస్‌ సమస్యలు త్వరగా పరిష్కారం అయ్యేలా ప్రభుత్వం చొరవ తీసుకుని వీలైనంత త్వరగా సీపీఎస్‌ను రద్దుచేయాలని ఉద్యోగులు కోరుతున్నారు.

సీపీఎస్‌ అనేది కేవలం ఉద్యోగి చందా అధారిత స్కీం. ఈ పథకంలో ఉద్యోగుల మూలవేతనం, డీఏల నుంచి ప్రతి నెలా 10% చొప్పున కట్‌ చేస్తారు. ప్రభుత్వం కూడా మరో 10% చందాను జమ చేస్తుంది. ఈ మొత్తాన్ని ఎన్‌పీఎస్‌- ఎన్‌ఎస్‌డీఎల్‌కు బదిలీ చేస్తారు. అక్కడ ఉద్యోగికి పర్మినెంట్‌ రిటైర్‌మెంట్‌ అకౌంట్‌ నెంబర్‌ (ప్రాన్‌)లో ఈ మొత్తాన్ని జమచేస్తున్నారు. దీనిని ఎన్‌ఎస్‌డీఎల్‌ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం ఒప్పందం చేసుకున్న బ్యాంకులకు బదిలీచేసి, అక్కడినుంచి స్టాక్‌ మార్కెట్‌కు తరలిస్తున్నారు.

భరోసా లేని పెన్షన్!

సీపీఎస్‌ ప్రకారం, ఉద్యోగి రిటైర్‌ అయిన తర్వాత 60% సొమ్మును చెల్లించి, మిగతా 40% సొమ్మును స్టాక్‌ మార్కెట్‌లో కొనసాగిస్తూ లాభనష్టాలతో కలిసి ఎంతోకొంత పెన్షన్‌ రూపంలో చెల్లిస్తారు. షేర్లు నష్టాల్లో కొనసాగితే పెన్షన్‌ మొత్తం మైనస్‌లోకి పోతుంది. స్టాక్‌ మార్కెట్‌ ఒడిదొడుకులు, షేర్ల పెట్టుబడుల్లో ఉద్యోగులకు ఎలాంటి హక్కులు లేకపోవడంతో రిటైర్‌ అయిన ఉద్యోగులకు నెలకు రూ.1,800-2,000 పెన్షన్‌ కూడా అందడం లేదు. దీంతో రిటైర్మెంట్‌ తర్వాత ఉద్యోగులకు సామాజిక భద్రత ఉండటం లేదు. సీపీఎస్‌తో ఉద్యోగులకు తీరని నష్టం కలుగుతున్నది. పెన్షన్‌పై భరోసా లేకుండా పోతున్నది. ఈ విధానంపై ఉద్యోగుల్లో ఆందోళన వ్యక్తమవుతున్నది. ఉద్యోగులంతా ఈ విధానాన్ని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నారు. కేంద్రం పీఎఫ్‌ఆర్డీఏ చట్టాన్ని రద్దుచేయాలి. రాష్ట్ర ప్రభుత్వం ఉద్యోగులకిచ్చిన హామీ మేరకు సీపీఎస్‌ను రద్దుచేయాలి. పాత పెన్షన్‌ విధానాన్ని పునరుద్ధరించాలి.

ఉత్తరాదికో రూల్‌.. దక్షిణాదికో రూల్‌!

సీపీఎస్‌ రద్దు నాడు కాంగ్రెస్‌ పార్టీకి ఎన్నికల ఎజెండాగా మారింది. సీపీఎస్‌ రద్దు విషయంలో కాంగ్రెస్‌ పార్టీ ఉత్తర భారతానికో రూల్‌, దక్షిణ భారతదేశానికో రూల్‌ అన్నట్టుగా వ్యవహరిస్తున్నది. సీపీఎస్‌ను రద్దుచేస్తామన్న హామీతోనే కాంగ్రెస్‌ పార్టీ గతంలో రాజస్థాన్‌లో అధికారంలోకి వచ్చింది. ఛత్తీస్‌గఢ్‌, హిమాచల్‌ప్రదేశ్‌ రాష్ట్రాల్లోనూ ఇదే హామీనిచ్చింది. కాంగ్రెస్‌ మిత్రపక్షమైన జేఎంఎం అధికారంలో ఉన్న జార్ఖండ్‌లోనూ ఓపీఎస్‌ను అమలుచేస్తున్నారు. ఆయా రాష్ట్రాల్లో ఉద్యోగులకు పాత పెన్షన్‌ పేమెంట్‌ ఆర్డర్లు సైతం ఇచ్చారు. అయితే, దక్షిణాదిలోని కర్ణాటకలోనూ సీపీఎస్‌ను రద్దుచేస్తామని హామీ ఇచ్చిన కాంగ్రెస్‌ ఇప్పటివరకూ నెరవేర్చలేదు. ఇదే తరహాలో తెలంగాణలో సీపీఎస్‌ నినాదంతోనే కాంగ్రెస్‌ అధికారంలోకి వచ్చింది. కానీ, ఈ రెండు రాష్ట్రాల్లో సీపీఎస్‌ను రద్దుచేయలేదు. దీంతో ఉత్తర భారతానికి ఒక రూల్‌.. దక్షిణ భారతానికి ఒక రూల్‌ ఏమిటని ఉద్యోగులు ప్రశ్నిస్తున్నారు?

ఉద్యోగులు కోల్పోయిన ప్రయోజనాలు!

ఓపీఎస్‌ కింద ఉద్యోగి పదవీ విరమణ తరువాత ప్రతి నెలా సర్వీస్‌ పెన్షన్‌ అందేది. ఉద్యోగి రిటైర్‌ అయిన చివరి నెలలో ఉన్న వేతనంలో 50% వేతనాన్ని సర్వీస్‌ పెన్షన్‌ కింద ప్రభుత్వం చెల్లించేది. ఇప్పుడు 2004 తర్వాత నియామకమైన వారికి సర్వీస్‌ పెన్షన్‌ అన్నదే లేదు. ఒకవేళ పెన్షనర్‌ చనిపోతే అతని భార్యకు, దివ్యాంగులైన పిల్లలు, పెండ్లికాని పిల్లలకు సర్వీస్‌ పెన్షన్‌ అందేది. కానీ, ఇప్పుడు ఆ వెసులుబాటు లేకుండా పోయింది. ఒక ఉద్యోగి రిటైర్‌ అయ్యే నెలలో 50 వేల వేతనం పొందితే, ఆ ఉద్యోగికి పాత పెన్షన్‌ విధానంలో నెలకు రూ.25 వేల వరకు పెన్షన్‌ అందేది. ఇది కుటుంబ పోషణకు, జీవిత చరమాంకంలో బాసటగా ఉండేది. కానీ ఇప్పుడు ఆ భరోసా దూరమైంది. ప్రభుత్వం పలు దఫాలుగా చెల్లించే డీఏ, పీఆర్సీ ఫిట్‌మెంట్లు పెన్షనర్లకు సైతం వర్తిస్తాయి. కానీ, సీపీఎస్‌లో ఇవేవీ వర్తించవు.

పెన్షనర్లపై స్టాక్ మార్కెట్ గుదిబండ

సీపీఎస్‌తో పెన్షనర్లకు ప్రభుత్వంతో ఉన్న బంధం పూర్తిగా తెగిపోయింది. పెన్షన్‌ కోసం స్టాక్‌ మార్కెట్‌ హెచ్చుతగ్గులపైనే పెన్షనర్లు ఆధారపడాల్సి వస్తున్నది. ఇది ఉద్యోగులను ఆందోళనకు గురిచేస్తున్నది. రిటైర్మెంట్‌ తరువాత కమ్యూటేషన్‌ కింద ఒక ఉద్యోగికి ఓపీఎస్‌లో కొన్ని సంవత్సరాల మొత్తం పెన్షన్‌ను అడ్వాన్స్‌గా పొందే వీలుంటుంది. ఇంటి నిర్మాణం, పిల్లల చదువులు, పెండ్లిండ్ల కోసం అడ్వాన్స్‌లు తీసుకునే అవకాశం ఉండేది. ఇప్పుడు ఆ వెసులుబాటే లేకుండాపోయింది. ఇప్పటికైనా ముఖ్యమంత్రి త్వరగా స్పందించి సీపీఎస్ రద్దుచేసి ఓపీఎస్ అమలు చేయాలని కోరుతున్నారు. ఓపిక నశించిన ఉద్యోగులు ప్రత్యక్ష ఆందోళనకు సిద్ధమవుతున్నారు. ఆగస్టు నెలలో ప్రత్యక్ష కార్యాచరణకు సిద్ధమవుతున్నారు. ఉద్యోగుల సహకారంతోనే తాము ప్రభుత్వాన్ని ఏర్పాటు చేశామని సీఎం రేవంత్‌రెడ్డి పలుమార్లు చెప్పారు. ఉద్యోగుల చిరకాల వాంఛను నెరవేర్చి ఉద్యోగుల మనసు గెలుచుకోవాలి.

- రావుల రాజేశం,

తెలంగాణ ఉద్యమకారుడు

77801 85674

Advertisement

Next Story