ఏది గుడ్‌న్యూస్‌?

by Ravi |   ( Updated:2023-05-09 00:00:58.0  )
ఏది గుడ్‌న్యూస్‌?
X

ప్రస్తుతం మీడియాలో ఉద్యోగులకు గుడ్‌న్యూస్, నిరుద్యోగులకు గుడ్‌న్యూస్, రైతులకు గుడ్ న్యూస్, వారికి గుడ్‌న్యూస్, వీరికి గుడ్‌న్యూస్ ఇలా.. ఏ విషయానికైనా గుడ్‌న్యూస్ అంటూ రాసుకొస్తున్నారు. వీటిని చూస్తుంటే అసలు గుడ్‌న్యూస్ అంటే ఏంటనే ప్రశ్న మదిలో మెదులుతున్నది. ఒకప్పుడు ఉద్యోగులకు ఇంక్రిమెంట్ వస్తేనో, లేదా డీఏ పెరిగితేనో లేక ప్రమోషన్స్ వస్తేనో గుడ్‌న్యూస్ అంటూ సంతోషించేవారు. కానీ ఇప్పుడు.. కష్టపడి పనిచేసినా జీతం సమయానికి అందడం లేదు. టైం దాటిన తర్వాత ఎప్పటికో రిలీజ్ అయితే తీపికబురు అంటున్నారు. ఇక నిరసన తెలిపిన ఉద్యోగులను జాబ్స్ నుంచి తొలగించి.. వారిని ఇబ్బందులకు గురిచేసి చివరకు తిరిగి విధుల్లోకి తీసుకున్నా అది గుడ్‌న్యూస్ అవుతున్నది. ఉద్యోగులను ఎందుకు తొలగించారు జీతాలు ఎందుకు పెండింగ్‌లో ఉంచారు అనే ప్రశ్నలు వేయడం మానేసి.. గుడ్‌న్యూస్ పేరుతో సరిపెడుతున్నారు కొందరు. ఇక నిరుద్యోగుల విషయంలో ఈ పదం మరీ దారుణంగా మారిపోయింది. ఉద్యోగుల ప్రకటన రానుంది అనగానే తీపి‌కబురు అంటూ అందుకుంటున్నారు. కానీ అసలు విషయాన్ని మర్చిపోతున్నారు. నోటిఫికేషన్, ఎగ్జామ్స్, రిజల్ట్స్, పోస్టింగ్ ఇలా చాలా తతంగాన్ని దాటుకుని చేతిలో ఉద్యోగం పడ్డాకే నిరుద్యోగికి అది గుడ్‌న్యూస్ అవుతుందే తప్ప.. నోటిమాటలు అనేవి తీపికబురు కాలేదు.

మరో వైపు రైతుల విషయంలో గుడ్‌న్యూస్ అనే పదం చదవడానికి, వినడానికి కూడా మనసొప్పడం లేదు. ఇల్లు, కుటుంబం కన్నా.. నేలపైనే ఎక్కువ ప్రేమ పెంచుకునే అన్నదాత.. దుక్కి దున్నడం మొదలు పంట చేతికొచ్చే వరకు పడే శ్రమ వర్ణించలేనిది. డబ్బులు అర్జెంట్ అవసరం ఉన్న రైతులు తమ పంటను ఎంతో కొంతకు దళారులకు ఇచ్చి నష్టపోతున్నారు. మరి కొందరు ఐకేపీ సెంటర్లలో సర్కారుకు ధాన్యం అమ్ముతున్నారు. ఆ డబ్బులు ఎప్పుడు వస్తాయో కూడా తెలియదు. ఒక వేళ ఆ డబ్బులు ప్రభుత్వం ఎప్పటికో రిలీజ్ చేస్తే దాన్ని కూడా గుడ్‌న్యూస్ అంటున్నారు. రైతుకు మద్దతు ధర పెరిగితేనో, లేక కష్టానికి తగిన ఫలితం వస్తేనో తీపికబురు అవుతుంది కానీ, కష్టపడి పండించిన పంటను అమ్మినందుకు డబ్బులు వస్తే గుడ్‌న్యూస్ ఎలా అవుతుందో అర్థం కావడం లేదు.

పి.మహేశ్ కుమార్

9292956812

Advertisement

Next Story