- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- రాశి ఫలాలు
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- రాశి ఫలాలు
- కెరీర్
ఆదివాసీ మహావీరుడు చక్ర బిసోయి
సాధు సమాజాన్ని రక్షించాలంటే, సమాజహితాన్ని కలుషితం చేసే దుర్మార్గులను నాశనం చేసి, ధర్మస్థాపన చేయాలి. అందుకోసమే వీరపురుషుల ఆవిర్భావం జరుగుతుంది. ఆ కోవకు చెందిన ఒక వీరుడు చక్ర బిసోయ్. దుర్గమ అరణ్యంలోని వనవాసి గ్రామమైన తోరాబాదీలో 1823 పుష్యమాసం శుక్ర దశమి (ఒరిస్సాలో దీనిని సంభదశమి అని అంటారు) నాడు చక్ర అనే మహా వీరుడు బనియాకంద్ అనే గిరిజన తెగ కుటుంబంలో జన్మించాడు. ఆ గ్రామం ఒరిస్సాలోని గంజామ్ జిల్లాలోని 20 మైళ్ళ దూరంలో ఉంటుంది. ఫుల్బానిలో ముఖ్యంగా కంద తెగ పనవాసులు ఎక్కువ సంఖ్యలో నివసిస్తారు. వారు ఆ క్షేత్రంలోని అడవులు, కొండలు, లోయలు, నదులను ఆశ్రయించి జీవనం కొనసాగిస్తున్నారు. ఈ పర్వత ప్రాంతాన్ని బోధ మండలం అంటారు. ఆనాడు రాజ్యంలోని విభాగాలను ఒక్కొక్కదాన్ని ఒక్కొక్క పరగణాగా పిలిచేవారు. అలాంటి ప్రతి పరగణాకు నియమించబడిన అధికారిని బిసోయ్ అని అనేవారు. అలాంటి వారిలో చక్రబిసోయ్ అతని చిన్నాన్న గౌర బిసోయ్లు ముఖ్యమైనవారు.
ఎవరికి సహాయం కావాలన్నా..
1835 కాలంలో బ్రిటిష్ సేనలు ఫుల్బాని సమీపంలోని అన్ని క్షేత్రాలపై తమ ఆధిపత్యం నెలకొల్పారు. అక్కడి పర్వత ప్రాంతాలపై కూడా తమ ఆక్రమణ కొనసాగిస్తూ వచ్చారు. కానీ ఒక చిన్న పర్వత రాజ్యమైన 'ఘంసర్' కి చెందిన వనవాసీ వీరులు తమ సేనాపతులైన చక్రబిసోయ్, ఆయన మామ దొర బిసోయ్ల నేతృత్వంలో వీరోచితంగా పోరాటం సాగించారు. అక్కడి పర్వత ప్రాంత వనవాసులు ఎట్టి పరిస్థితుల్లోనూ బ్రిటిష్ వారి ఆధిపత్యాన్ని అంగీకరించకూడదు అనే కృతనిశ్చయంతో పోరాడారు. తన మామ దొర బిసోయ్, చిన్నాన్న గౌర బిసోయ్లతో కలసి బ్రిటిష్ వారిపై మెరుపు దాడులు చేస్తూ, బ్రిటిష్ వారి ఆధిపత్య విస్తరణకు చక్రబిసోయ్ చాలావరకు అడ్డుకట్ట వేయగలిగారు. బ్రిటిష్ సేనలు దొర బిసోయ్ని అరెస్ట్ చేసి ఊటీ జైలులో బంధించారు. అతను 1846లో జైలులోనే చనిపోయాడు. తదుపరి ఉద్యమ బాధ్యతను చక్ర బిసోయ్ కొనసాగించారు. చక్రబిసోయ్ శక్తి సామర్థ్యాలు, సైనిక వ్యూహాలు నలుదిక్కులా విజయవంతంగా వ్యాపించాయి. అంతేకాక సమీప ప్రాంతాల రాజులకు ఎలాంటి కష్టాలు ఎదురైనా వారు చక్రబిసోయ్ సహాయాన్ని అర్థించేవారు. అందుకు సాక్ష్యంగా 1846లో అనుగుల్ రాజు సోమనాధ్‌కు చక్రబిసోయ్ సహాయపడ్డాడు. అతడి నేతృత్వంలో కేవలం సంఘటిత సైనికులే కాక సామాన్య ప్రజానీకం కూడా ఆంగ్లేయులతో పోరాటానికి ముందుకు వచ్చారు.
ఆత్మగౌరవం కోసం..
1854 మైక్ నిల్ అనే బ్రిటిష్ సేనాపతి ఉల్బనిలో సాగుతున్న స్వాతంత్య్ర పోరాటాన్ని అణచడానికి నియమింపబడ్డాడు. బ్రిటిష్ సేవలు అనుగుల్ పైకి కుర్మనియా లోయ వైపుకు సాగాయి. ఒక చీకటి లోయ సమీపంలో చక్రబిసోయ్ గెరిల్లా సేనలు బ్రిటిష్ సేనలపై మూకుమ్మడిగా దాడి చేసి అక్కడ రక్తపుటేరులు ప్రవహింప చేశారు. ఆంగ్లేయ సేనలు అక్కడి నుండి వెనుదిరిగి పోవడానికి కూడా ఇబ్బంది పడ్డారు. తర్వాత 1880 వరకు కూడా అనేక సందర్భాల్లో బ్రిటిష్ సేనలపై దాడులు నిరంతరం సాగుతూనే ఉండేవి. చక్రబిసోయ్ మాత్రం ఎలాంటి పరిస్థితిలోనైనా ఆంగ్లేయుల చేతుల్లో ప్రాణాలు కోల్పోనని శపథం చేశాడు. అజ్ఞాతంలో ఉంటూనే తన కార్యకలాపాలు కొనసాగిస్తూ, కంద వీరుల గెరిల్లా సైన్యానికి ప్రేరణ నిస్తూ అనేక సంవత్సరాలు కార్యశీలిగానే ఉన్నాడు. ఆ తర్వాత కొంతకాలానికి ఎవరికీ చక్ర బిసోయ్ జాడ తెలియలేదు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ అదృశ్యాన్ని పోలినదే చక్ర బిసోయ్ అదృశ్యం కూడా. కందమాల్ జిల్లాలో వనవాసీ కళ్యాణాశ్రమం ప్రయత్నంతో, నాలుగురోడ్ల కూడలిలో చక్రబిసోయ్ స్మారక విగ్రహ ప్రతిస్థాపన జరిగింది. ఆత్మగౌరవం కోసం ఆఖరి శ్వాస దాకా మడమ తిప్పని పోరాటం చేసిన బిసోయ్ మార్గాన్ని, రాజ్యాంగ స్ఫూర్తికి లోబడి ఈనాటి గిరిజనులు కొనసాగించడమే ఆయనకు మనం ఇచ్చే ఘన నివాళి.
( చక్ర బిసోయి 200వ జయంతి సందర్భంగా)
గుమ్మడి లక్ష్మీనారాయణ,
ఆదివాసీ రచయితల సంఘం,
94913 18409