- తెలంగాణ
- ఆంధ్రప్రదేశ్
- సినిమా
- గాసిప్స్
- క్రైమ్
- లైఫ్-స్టైల్
- ఎడిట్ పేజీ
- రాజకీయం
- జాతీయం-అంతర్జాతీయం
- బిజినెస్
- వాతావరణం
- స్పోర్ట్స్
- జిల్లా వార్తలు
- సెక్స్ & సైన్స్
- ప్రపంచం
- ఎన్ఆర్ఐ - NRI
- ఫొటో గ్యాలరీ
- సాహిత్యం
- వాతావరణం
- వ్యవసాయం
- టెక్నాలజీ
- భక్తి
- కెరీర్
- రాశి ఫలాలు
సూపర్ మార్కెట్లలోని ఉద్యోగుల దీనస్థితి..
ప్రస్తుతం మానవుని దైనందిన జీవితం అత్యంత ఆధునిక సాంకేతికతతో నడుస్తున్నది. నేటి సమాజ పరిస్థితులకు ఇది అత్యంత అవసరం కూడా. ఆన్ లైన్లో క్రయవిక్రయాలు ఇంకా ఇతర బ్యాంకింగ్, రైల్వే టికెట్ల కోసం, ఉద్యోగం కోసం దరఖాస్తులు ఇతరత్రా అన్ని వ్యవహారాలు కూడా సాంకేతికత యాంత్రికరణతో జరుగుచున్నవి. ఇది మానవాళి సాధించిన ఘన విజయం. ఎంత సాంకేతికతతో దైనందిన కార్యక్రమాలు జరుగుతున్నా, అవి మానవుని మేధస్సుతో, అవయాలతో మాత్రమే నిర్వహించడం జరగాలి.
ప్రస్తుతం పెద్ద పెద్ద సూపర్ మార్కెట్లు మెడికల్ దుకాణాలు ఆధునిక సాంకేతికతో నిర్వహిస్తున్నారు. కనుమిట్లు గొలిపే విద్యుత్ దీపాల కాంతులతో చల్లటి వాతావరణంలో కొనుగోలుదారులను ఆకట్టుకోవడానికి ఎంతో ఆకర్షణీయమైన అలంకారాలతో వస్తువులను అమరుస్తున్నారు. ప్రజలను ఆకర్షించేందుకు అనేక వ్యవస్థలను నెలకొల్పుతున్నారు. ఈ షాపింగ్ మాల్స్‌లో వస్తువులను అందంగా చక్కగా ఎత్తైన ప్రదేశాలలో పొందుపరిచేందుకు అధునాతన లిఫ్టులు మొదలైన యంత్రాలను ఉపయోగిస్తున్నారు. ఇవి ప్రమాదాలను నివారిస్తూ, మానవ శ్రమను కూడా తగ్గిస్తున్నాయి. ఇందులో పని చేసే వారికి నెలకు 9వేల నుండి జీతం పొందుతారని తెలుస్తున్నది. ఈఎస్ఐ వైద్య సౌకర్యాలు, ప్రావిడెంట్ ఫండ్ సౌకర్యం కూడా కల్పిస్తున్నారు. ఈ సౌకర్యాలు కార్మిక చట్టాలకు లోబడి ఉంటున్నవి.
తొమ్మిది గంటల స్టాండింగ్..
కానీ ఇందులో పనిచేసే ఉద్యోగులకు దాదాపు తొమ్మిది నుండి పది గంటలు నిలుచొని పనిచేస్తున్నారు. ఇది అత్యంత దారుణమైన విషయం. ఏకధాటిగా దాదాపు 9 గంటలు ఒక మనిషి పనిచేయడం వలన ఆరోగ్యం చెడిపోతుంది. భవిష్యత్తులో వయసు పై పడిన తర్వాత చాలా ఇబ్బందులు ఎదుర్కోవలసి వస్తుంది. ఆరోగ్యం సహకరించక మనిషి జీవనమే దిక్కు తోచని స్థితిలోకి వెళుతుంది. ఇంతేకాక వీరి కుటుంబాల మనుగడే ప్రశ్నార్ధకమవుతుంది. ఈ విషయంలో అన్ని రకాల వ్యవస్థలు కూడా చూసి చూడనట్టు వ్యవహరిస్తున్నట్లు విషాదమవుతున్నది. ఈ షాపింగ్ మాల్‌లలో కొనుగోలు చేసే వినియోగదారులు ఇందులో పనిచేసే ఉద్యోగుల యోగక్షేమాలు గురించి తెలుసుకోవలసిన అవసరం వాస్తవానికి ఉండదు. వినియోగదారులకు కావలసింది అందులో ఉన్న అవసరమైన వస్తువులు మాత్రమే. పైగా గొప్ప గొప్ప పెద్ద షాపింగ్ మాల్‌లలో వస్తువులు కొనుగోలు చేసినామని సరదా సంబురం మాత్రమే ఉంటుంది. సాటి మానవుని స్థితి గురించి తెలుసుకోవాల్సిన పరిస్థితి నేటి సమాజంలో లేదు కనపడదు కూడా. ఎవరైనా ఇందులో పనిచేస్తున్న వ్యక్తుల గురించి తెలుసుకునే ప్రయత్నం చేస్తే అదేదో తప్పు చేసినట్టు మనకు సంబంధం లేనట్టు కొంత మంది భావిస్తుంటారు.
త్వరగా అనారోగ్యం పాలు..
పొట్టకూటి కొరకు బతుకు బండి లాగించడం కుటుంబ భారాన్ని మోయడం కోసం ఇతర ఉద్యోగాలు దొరకక ఈ షాపింగ్ మాల్‌లలో ఉద్యోగం చేస్తుంటారు. కానీ దీని నిర్వాహకులు వారి వ్యాపారభివృద్ధి లాభాలు ఆర్జించడం కోసం ప్రధాన ధ్యేయంగా ఈ షాపింగ్ మాల్స్‌ని నిర్వహిస్తున్నారు. వారి వ్యాపారంలో భాగస్వాములైన చిరు ఉద్యోగులు పనిచేసే విధానంపై ఎలాంటి శ్రద్ధ కనబరచడం లేదు. తద్వారా అందులో పని చేసే వారు తొందరగా అనారోగ్యం పాలవుతుంటారు. ఇందులో పని చేసే ఉద్యోగులకు కొన్ని షరతులు నియమ నిబంధనలకు లోబడి ఆయా సూపర్ మార్కెట్‌లలో ఉండే వస్తువులను రాయితీలతో ఇవ్వాలి. తద్వారా వారు చేసే పనికి తగు విధమైన గౌరవం లభిస్తుంది.
అధికారులు, రాజకీయ, కార్మిక సంఘాల నాయకులు, స్వచ్ఛంద సంస్థలు, మేధావులు సూపర్ మార్కెట్లలో పనిచేస్తున్న ఉద్యోగుల దీనస్థితిని పరిగణలోనికి తీసుకొని వారు పనిచేసే సమయంలో కనీసం పదినిమిషాల వ్యవధితో మొత్తం పని గంటలలో ఓ గంట కూర్చోవడానికి లేదా కూర్చుని పనిచేయడానికి ప్రత్యేక ఆధునిక సాంకేతికతతో వీల్ చైర్ల ద్వారా పనిచేసేలా ఏర్పాటు చేయాలి. తద్వారా ఇటు వ్యాపారస్తులకు అటు చిరు ఉద్యోగులకు సమన్యాయం చేసినట్లవుతుంది.
దండంరాజు రాంచందర్ రావు
రిటైర్డ్ డిప్యూటీ సూపరింటెండెంట్, సింగరేణి
98495 92958