BRS: తమ్ముళ్లను గుర్తించని గులాబీ పార్టీ.. ఊరిస్తూ నిరాశ

by Rani Yarlagadda |   ( Updated:2024-11-08 15:22:00.0  )
BRS: తమ్ముళ్లను గుర్తించని గులాబీ పార్టీ.. ఊరిస్తూ నిరాశ
X

దిశ, తెలంగాణ బ్యూరో: స్థానిక సంస్థల ఎన్నికలకు (Localbody Elections) గడువు దగ్గర పడుతున్నప్పటికీ గులాబీ అధిష్టానం దృష్టిసారించలేదు. కేవలం ప్రభుత్వంపై విమర్శలు చేస్తూ కాలం వెళ్లదీస్తుండటంతో కేడర్ అంతా నైరాశ్యంలో ఉంది. ఏళ్ల తరబడి పార్టీ కమిటీ ల్లోనూ చోటుదక్కుతుందని భావించినప్పటికీ స్పందన కరువైంది. పార్టీ రాష్ట్ర కమిటీతో పాటు అనుబంధ కమిటీలు వేస్తారా? వేయరా? ఇలాగే కాలం వెళ్లదీస్తారా? అనేది పార్టీలో జోరుగా చర్చజరుగుతోంది. పార్టీ పదవులు ఇస్తే పార్టీ చేపట్టే ప్రతి కార్యక్రమంలో చురుగ్గా పాల్గొనడంతో పాటు బలోపేతానికి తమవంతు కృషిచేస్తామని పలువురు అభిప్రాయం వ్యక్తం చేస్తున్నారు.

రాష్ట్రంలో బీఆర్ఎస్ పార్టీ (BRS Party) రెండు పర్యాయాలు అధికారంలో ఉంది. అయినప్పటికీ పార్టీని సంస్థాగతంగా బలోపేతం చేయలేదని, ఆ దిశగా దృష్టిసారించలేదని పార్టీ అధినేతనే పలు సందర్భాల్లో పేర్కొన్నారు. అధికారం కోల్పోయి ఏడాది కావస్తున్నప్పటికీ పార్టీ బలోపేతంపై దృష్టిసారించలేదు. అసలు ఏం చేస్తున్నారనేది పార్టీలో చర్చకు దారితీసింది. పార్టీని గ్రామం నుంచి బలోపేతం చేయాల్సిన అవసరం ఉంది. పార్టీ కమిటీలతో పాటు అనుబంధ కమిటీలను వేసి అధిష్టానం ప్రజా సమస్యలపై ఇచ్చే ఏ కార్యక్రమం అయినా విజయవంతం అవుతుంది. కానీ ఇప్పటివరకు ఆదిశగా చర్యలు చేపట్టలేదు. అంతేకాదు ఇప్పటివరకు రాష్ట్రంలోని ఏ గ్రామానికి పూర్తి కమిటీలు, అనుబంధ కమిటీలు లేవు. కేవలం గ్రామశాఖ అధ్యక్షుడిని మాత్రమే కేటాయించారు. దీంతో గ్రామాల్లో యాక్టీవ్ గా పనిచేస్తున్న కేడర్ అంతా నిరాశతో ఉన్నారు. పార్టీ ఏ కార్యక్రమం చేపట్టినా పాల్గొనడం లేదని, ఏదో నామ్ కే వస్తేగా కొందరు మాత్రమే పాల్గొంటున్నారని నేతలే అభిప్రాయపడుతున్నారు. అయినప్పటికీ అధినేత కేసీఆర్ మాత్రం ఇంకా ఎలాంటి చర్యలు చేపట్టడం లేదు.

కమిటీలపై గులాబీ తమ్ముళ్ల నిరాశ

ప్రత్యేక తెలంగాణ రాష్ట్ర ఉద్యమ సమయం నుంచి పార్టీలోనే పనిచేస్తున్నారు. అవకాశాల కోసం ఎదురుచూస్తున్నారు. ఒకసారి కాకపోయినా ఇంకోసారైన అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. రాష్ట్ర స్థాయిలో కమిటీల్లో చోటు దక్కుతుందని, జిల్లా కమిటీల్లోనూ అవకాశం వస్తుందని ఆశిస్తున్నారు. అయితే ప్రస్తుతం రాష్ట్రంలో ప్రతిపక్షంలో ఉండటంతో పార్టీ కమిటీలు వేస్తుందని ఎదురుచూస్తున్నారు. కమిటీల్లో పదవులు దక్కినవారికి రాబోయే అసెంబ్లీగానీ, పార్లమెంట్ ఇలా ఇతర ఎన్నికల్లో అవకాశం వస్తుందని, పార్టీ అధినేత దృష్టిలో పడతామని, మంచిరోజులు వస్తాయనే ఆశతో ఉన్నారు. కానీ అసలు కమిటీల వేయడానికి పార్టీ అధిష్టానం చర్యలు చేపట్టకపోవడంతో నైరాశ్యంలో కొట్టుమిట్టాడుతున్నారు. త్వరలో కమిటీలు వేస్తామని.. యాక్టీవ్ గా పనిచేసేవారికి అవకాశం ఇస్తామని, పనిచేసే ప్రతి ఒక్కరిని పార్టీ గుర్తింపు ఇస్తుందని తరచూగా పేర్కొంటున్నప్పటికీ ఆ దిశగా చర్యలు మాత్రం శూన్యం.

గుర్తింపులేదంటూ ఆవేదన

బీఆర్ఎస్ పార్టీకి నాయకులు, కేడర్ ఉంది. యాక్టీవ్ గా పనిచేసేవారుఉన్నారు. పార్టీ ఇచ్చే ప్రతి కార్యక్రమంలో భాగస్వాములవ్వడంతో పాటు విజయవంతానికి కృషి చేస్తున్నారు. కానీ వారికి పార్టీలో కష్టానికి సముచిత స్థానం దక్కడం లేదనే ఆరోపణలు ఉన్నాయి. ఏళ్లుగా పార్టీలో పనిచేస్తున్నప్పటికీ కొందరికి మాత్రమే అవకాశాలు ఇస్తూ ఇతరులకు మొండి చూపుతున్నారని, మరోవైపు ఇతర పార్టీల్లో నుంచి వలస వచ్చిన వారికి ప్రాధాన్యం ఇస్తున్నారని, తమకు విస్మరిస్తున్నారని పార్టీ నేతలే బహిరంగంగా అభిప్రాయపడుతున్నారు. కష్టపడేవారికి గుర్తింపు ఇస్తామని పార్టీ అధిష్టానం పేర్కొంటున్నప్పటికీ గతంలోనూ విస్మరించారనే ఆరోపణలు ఉన్నాయి. మరోవైపు కష్టానికి గుర్తింపు ఇవ్వకుండా కొంతమంది నేతల చెప్పుడు మాటలతోనే గుర్తింపు ఇవ్వకుండా పక్కనపెడుతున్నారని పలువురు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. పార్టీ దిద్దుబాటు చర్యలు చేపట్టకపోతే రాబోయే కాలంలో గడ్డుకాలం తప్పదని పార్టీ నేతలు బహిరంగంగా వ్యాఖ్యలు చేస్తున్నారు.

స్థానిక సంస్థల ఎన్నికలు దగ్గరపడుతున్నా...

వరుస ఓటములు బీఆర్ఎస్ కు మింగుడుపడటం లేదు. రాష్ట్రంలో అభివృద్ధి పనులు చేసినప్పటికీ ఓటమి పాలుకావడంతో కేడర్ సైతం నైరాశ్యం ఉంది. అయితే కాంగ్రెస్ అధికారంలోకి వచ్చి ఏడాది అవుతుండటంతో హామీలు, గ్యారెంటీలను పూర్తిస్థాయిలో అమలు చేయడంలో కొంత జాప్యం జరుగుతుంది. ఈ జాప్యాన్ని ప్రజల్లోకి బలంగా తీసుకెళ్లాలని భావిస్తున్నారు. మరోవైపు మూసీ, హైడ్రాపైనా ప్రజలు పడుతున్న ఇబ్బందులను విస్తృత ప్రచారం చేసి ప్రజలను పార్టీవైపునకు మళ్లించాలని భావిస్తున్నారు. అధిక స్థానాలు కైవసం చేసుకోవాలని అందుకు ప్రణాళికలు సైతం రూపొందిస్తున్నారు. కానీ పార్టీ బలోపేతం దృష్టిసారించకపోవడంతో కేడర్ ఎలా పనిచేస్తుంది... నాయకులు ఎలా పనిచేస్తారనేది పార్టీ సీనియర్లు అభిప్రాయపడుతున్నారు. పార్టీ కమిటీలు వేసి బాధ్యతలు అప్పగిస్తే యాక్టీవ్ గా పనిచేస్తారని పలువురు అభిప్రాయపడుతున్నారు. స్థానిక ఎన్నికలకు గడువు సమీపిస్తున్నా పార్టీ సంస్థాగతంపై అధిష్టానం ఫోకస్ పెట్టకపోవడంతో కేడర్ లో అయోమయం నెలకొంది. ఇంతకు కమిటీలు వేస్తారా? అసెంబ్లీ ఎన్నికల వరకు కాలయాపన చేస్తారా? ఇంతకు ఏం చేస్తారు? కేవలం మీడియా వేదికగానే ప్రభుత్వ వైఫల్యాలపై విమర్శలు చేసి కాలం వెళ్లదీస్తారా? అనేది పార్టీలో విస్తృత చర్చజరుగుతుంది. మరోవైపు పార్టీ ఏలాంటి నిర్ణయాలు తీసుకుంటుందా అనేది చూడాలి.

Advertisement

Next Story

Most Viewed