Monkeys : ఎఫ్‌సీఐ గోదాంలో 145 కోతులు మృతి

by Hajipasha |
Monkeys : ఎఫ్‌సీఐ గోదాంలో 145 కోతులు మృతి
X

దిశ, నేషనల్ బ్యూరో : పది కాదు.. ఇరవై కాదు.. ఏకంగా 145 కోతులు(monkeys) అనుమానాస్పద స్థితిలో చనిపోయాయి. ఈ విషయం బయటికి పొక్కకుండా ఉత్తరప్రదేశ్‌లోని హాథ్రస్‌(Hathras)లో ఉన్న ఎఫ్‌సీఐ(FCI) గోదాం సమీపంలో పూడ్చిపెట్టారు. నవంబరు 9న జరిగిన ఈ ఘటన ఆలస్యంగా శుక్రవారం వెలుగులోకి వచ్చింది. ఎఫ్‌సీఐ గోదాంలో పనిచేసే ఓ వ్యక్తి ద్వారా ఈ విషయం స్థానిక బజ్రంగ్ దళ్ నేత హర్షిత్ గౌర్‌కు తెలిసింది. ఆయన ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు మొదలుపెట్టారు.

హర్షిత్ గౌర్‌ కథనం ప్రకారం.. హాథ్రస్‌లో ఉన్న ఎఫ్‌సీఐ గోదాంలో నిల్వ చేసిన ఆహార ధాన్యాలకు చీడపీడలు సోకకుండా ఈనెల 9న క్రిమిసంహారకాలను పిచికారీ చేశారు. ఈవిధంగా పిచికారీ చేసిన క్రిమిసంహారకాల నుంచి కొద్దిసేపటి వరకు ఘాటు రిలీజ్ అవుతుంటుంది. సరిగ్గా అదే సమయంలో పెద్దసంఖ్యలో కోతుల గుంపు గోదాం లోపలికి ప్రవేశించింది. క్రిమిసంహారకాల ఘాటు ప్రభావం, వాటిని చల్లిన ఆహార ధాన్యాలను వెంటనే తినడంతో కోతులన్నీ అక్కడికక్కడే చనిపోయాయి. అనంతరం గోదాం సమీపంలో గొయ్యి తీసి ఆ కోతులను అన్నింటిని రహస్యంగా పూడ్చేశారు. దీనిపై అటవీ అధికారులకు కానీ, పోలీసులకు కానీ ఎఫ్‌సీఐ గోదాం అధికారులు సమాచారాన్ని అందించలేదు. జీవహింస వ్యతిరేక చట్టంలోని నిబంధనల కింద ఎఫ్‌సీఐ అధికారులపై కేసు నమోదు చేశామని కొత్వాలి స్టేషన్ హౌస్ అధికారి విజయ్ సింగ్ తెలిపారు. ఈ స్థాయిలో కోతుల మృతి వెనుకనున్న కారణాలను తెలుసుకునేందుకు వెటర్నరీ వైద్యుల సాయం తీసుకుంటున్నట్లు చెప్పారు.

Advertisement

Next Story

Most Viewed